Share News

విద్యుత్తు కోతలు.. రైతుకు వెతలు

ABN , Publish Date - Oct 07 , 2026 | 06:01 AM

గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. దేవాదుల ప్రాజెక్టు కింద వరి పంట పాలు పోసుకుని కంకి దశలో ఉంది! నీటిని ఎత్తి పోస్తే చాలు.. రైతులు గట్టెక్కేస్తారు! కానీ, తీవ్రమైన విద్యుత్తు కోతలు పంటలకు నీరు చేరకుండా అడ్డుకుంటున్నాయి.

విద్యుత్తు కోతలు..   రైతుకు వెతలు
DEVADULAPUMP

GODAVARI.jpg

  • దేవాదులలో సగం పంపులే నడుస్తున్నాయ్‌!

  • రోజూ సాయంత్రం 5 గంటలకు కరెంటు కట్‌

  • కేవలం 8 గంటలు మాత్రమే నీటి పంపింగ్‌

  • కంకి దశలో వరి పంట.. సరిపోని నీళ్లు..

  • తీవ్ర ఆందోళనలో రైతులు

ములుగు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. దేవాదుల ప్రాజెక్టు కింద వరి పంట పాలు పోసుకుని కంకి దశలో ఉంది! నీటిని ఎత్తి పోస్తే చాలు.. రైతులు గట్టెక్కేస్తారు! కానీ, తీవ్రమైన విద్యుత్తు కోతలు పంటలకు నీరు చేరకుండా అడ్డుకుంటున్నాయి. ఎత్తిపోతల పథకంలో సగం పంపులే పని చేస్తున్నాయి. ఈ పరిణామం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ప్రస్తుతం 5.57 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. పాలు పోసుకుని కంకి దశలో ఉంది. ఇప్పుడు పంటకు పూర్తి స్థాయిలో నీళ్లు అవసరం. కానీ, విద్యుత్తు కోతల కారణంగా జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లోని మొత్తం 10 మోటార్లకు ప్రస్తుతం ఐదు మాత్రమే పని చేస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం సోమవారం నాటికి ఫేజ్‌-1లో ఒక పంపు, ఫేజ్‌-3లో నాలుగు పంపులు (2, 4, 5, 6) మాత్రమే పని చేస్తున్నాయి. ఫేజ్‌-2లోని రెండు మోటార్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో 73.56 క్యూమెక్స్‌ సామర్థ్యానికి ప్రస్తుతం 38.04 క్యూమెక్స్‌ నీటిని మాత్రమే ఎత్తిపోస్తున్నారు. పంపింగ్‌ సామర్థ్యం సగానికి పడిపోయింది. సాయంత్రం 5 గంటలకే విద్యుత్‌ నిలిచిపోతుండటంతో రెండు వారాలుగా రోజుకు 8 గంటలు మాత్రమే పంపింగ్‌ సాగుతోంది. ఇందుకు కారణం విద్యుత్తు కోతలేనని అధికారులు చెబుతున్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో ఆదేశాల కారణంగా సాయంత్రం 5 గంటలకే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోందని, దీంతో మోటార్లు ట్రిప్‌ అవుతున్నాయని వివరిస్తున్నారు.


నిజానికి, జూలై 13న మంత్రుల బృందం దేవాదుల ప్రాజెక్ట్‌ను సందర్శించింది. ప్రాజెక్టు పరిధిలోని 22 రిజర్వాయర్లను నింపుతామని, పూర్తి స్థాయిలో గోదావరి జలాలను అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీలు క్షేత్ర స్థాయిలో అమలు కాకపోవడంపై ఆయకట్టు రైతాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

కీలక సమయంలో ఆయకట్టు చివరి ప్రాంతాలకు నీరు చేరే విషయంలో ఆలస్యం జరిగితే పంటలపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు పెట్టిన రైతులకు చివరి దశలో నీటి సమస్య ఎదురైతే నష్టం తప్పదంటున్నారు. విద్యుత్తు సమస్యకు తోడు భీంగన్‌పూర్‌, గంగారం మధ్య 25 కిలోమీటర్‌ వద్ద పైప్‌లైన్‌ దెబ్బతిని లీకేజీ ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. పైప్‌లైన్‌ సమస్యను త్వరగా పరిష్కరించడంతోపాటు, అందుబాటులో ఉన్న మోటార్లన్నంటినీ వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. పంటలకు నీటి అవసరం పెరుగుతున్న నేపఽథ్యంలో పంపింగ్‌ సామర్థ్యాన్ని వీలైనంత త్వరగా పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎవ్వరూ తప్పించుకోలేరు.. రాహుల్ గాంధీ హెచ్చరిక

రాజకీయ పార్టీల ప్రతినిధుల భేటీపై ఈసీ కీలక ప్రకటన

Updated Date - Oct 07 , 2026 | 06:25 AM