Share News

నేటి నుంచి డీసీసీ అధ్యక్షులకు శిక్షణ

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:03 AM

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రె్‌సను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకుగాను జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ)ల అధ్యక్షులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు అన్ని...

నేటి నుంచి డీసీసీ అధ్యక్షులకు శిక్షణ

వికారాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రె్‌సను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకుగాను జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ)ల అధ్యక్షులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో శనివారం ప్రారంభమయ్యే ఈ శిక్షణ తరగతులు మార్చి 2 వరకు కొనసాగనున్నాయి. సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్వహిస్తున్న ఈ తరగతులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 77 మంది డీసీసీ అధ్యక్షులు హాజరు కానున్నారు. డీసీసీ అధ్యక్షులకు శిక్షణ అనంతరం వారి ద్వారా బ్లాక్‌, మండల, గ్రామ స్థాయి అధ్యక్షులకు అవగాహన కల్పించాలని అధిష్ఠానం భావిస్తోంది. డీసీసీ అధ్యక్షులకు శిక్షణ తరగతులు నిర్వహించడమే కాకుండా వారు క్షేత్ర స్థాయిలో కూడా పర్యటించనున్నట్లు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించనున్నట్లు సమాచారం. కాగా, శనివారం డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ఉమ్మడి రాష్ట్రాల ఏఐసీసీ కార్యదర్శులు సచిన్‌ సావంత్‌, పల్లెపు వర్మ, గణేశ్‌ హాజరు కానున్నారు. ఒకరిద్దరు మినహా తెలంగాణ మంత్రివర్గ సభ్యులు మొత్తం అనంతగిరికి రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 2న జరిగే శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రెండు రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జులు మీనాక్షీ నటరాజన్‌, మాణిక్కం ఠాగూర్‌, సీడబ్ల్యూసీ సభ్యులు, సంస్థాగత శిక్షణ జాతీయ కోఆర్డినేటర్‌ చల్లా వంశీచంద్‌రెడ్డి ఈ శిక్షణ తరగతులకు హాజరు కానున్నట్లు తెలిసింది.

Updated Date - Feb 21 , 2026 | 03:03 AM