Share News

రెబెల్స్‌ ఉండొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Feb 01 , 2026 | 05:57 AM

రానున్న మునిసిపల్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేలా పనిచేద్దామని కాంగ్రెస్‌ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

రెబెల్స్‌ ఉండొద్దు: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

  • రెబెల్స్‌ ఉండొద్దుకాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ విజయం సాధించాలి

  • పురపాలికల్లోనూ ప్రజాపాలన లక్ష్యం కావాలి

  • మంత్రులు ఇన్‌చార్జి జిల్లాల్లోనూ దృష్టిపెట్టాలి

  • మంచి అభ్యర్థులకే బీ ఫారాలు: సీఎం రేవంత్‌

  • మునిసిపల్‌ ఎన్నికలపై పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యులతో అమెరికా నుంచి జూమ్‌ మీటింగ్‌

  • నేటి అర్ధరాత్రి రాష్ట్రానికి రానున్న ముఖ్యమంత్రి

  • రేపు రాష్ట్ర అమరవీరుల దినోత్సవానికి హాజరు

  • 4 నుంచి 9 వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటనలు

హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రానున్న మునిసిపల్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేలా పనిచేద్దామని కాంగ్రెస్‌ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో చాలా చోట్ల రెబెల్స్‌ బరిలో నిలవడంతో సంపూర్ణ ఫలితాలు రాలేదని, ఈసారి మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌ ఎన్నికల్లో రెబెల్స్‌ బెడద లేకుండా చూసుకోవాలని అన్నారు. జీరో రెబెల్స్‌ వ్యూహంతో ఎన్నికలకు వెళితే.. అత్యధిక మునిసిపాలిటీలతోపాటు అన్ని కార్పొరేషన్లనూ కైవసం చేసుకోవచ్చునని తెలిపారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులు కాకుండా రెబెల్స్‌ ఎవరైనా నామినేషన్లు వేసి ఉంటే.. వారు ఉపసంహరించుకునేలా చూడాలని, పార్టీ ఓట్లు చీలకుండా చూసుకోవాలని సూచించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 3 గంటలకు ముగియనున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అమెరికా నుంచి పార్టీ ముఖ్యులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. మునిసిపల్‌ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో భవిష్యత్తు కార్యాచరణపై వారితో సీఎం రేవంత్‌ చర్చించారు. సర్వే ఫలితాలు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే అభ్యర్థుల ఎంపిక చేశారా.. అని ఆరా తీశారు. పంచాయతీ ఎన్నికల్లాగే మునిసిపల్‌ ఎన్నికల్లోనూ విజయం సాధించి పురపాలికల్లో కూడా ప్రజాపాలన తెచ్చే లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు.


మంచి అభ్యర్థులకే బీ ఫారాలు అందాలి..

‘‘ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు. మంచి అభ్యర్థులకే బీ ఫారాలు అందాలి. ఎన్నికల్లో సమన్వయం కీలకం. మంత్రులు తమ సొంత జిల్లాలతోపాటు ఇన్‌చార్జులుగా ఉన్న జిల్లాల్లోనూ ఈ రెండు అంశాలపై దృష్టి పెట్టాలి. ఈ ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోవాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జుల అభిప్రాయాలు తీసుకోవడం, సర్వే ఫలితాలతో సరిపోల్చి చూడడంతోపాటు అభ్యర్థులంతా స్థానికంగా పట్టున్నవారు, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నవారే అయినందున.. వారిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం గడచిన రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. రేషన్‌కార్డుల జారీ, 200 యూనిట్లలోపు కరెంట్‌ వాడేవారికి ఉచిత విద్యుత్తు, వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌, ఇందిరమ్మ ఇళ్లు, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు, మహాలక్ష్మి పథకంతోపాటు గృహజ్యోతి కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వంటి పథకాలను ప్రజలకు వివరించాలని నిర్దేశించారు. ఫిబ్రవరి 11న అన్నిచోట్లా ఏకకాలంలో పోలింగ్‌ ఉన్నందున ఇన్‌చార్జులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.


రేపటి నుంచి సీఎం జిల్లాల పర్యటన..

అమెరికా నుంచి ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు రానున్న సీఎం రేవంత్‌రెడ్డి.. వచ్చీరాగానే పూర్వ ఏడు జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత సోమవారం తెలంగాణ అమరవీరుల దినోత్సవంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత 4వ తేదీన నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో, 5న కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండిలో, 6న నిజామాబాద్‌ రూరల్‌లో, 7న పరిగి, 8న భూపాలపల్లిలో, 9న మెదక్‌లో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా ఆయా చోట్ల జరిగే బహిరంగ సభల్లో సీఎం ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 20 తర్వాత కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్రానికి రానున్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. వికారాబాద్‌లో వారం రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉండనుంది. ఏదో ఒకరోజు రాహల్‌గాంధీ ఈ కార్యక్రమానికి వచ్చి డీసీసీ అధ్యక్షులు, ముఖ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

భారత్‌లోని పాక్‌ జాతీయులకు లాంగ్‌టర్మ్‌ వీసా ఉండాల్సిందే : హైకోర్టు

జాతరలో వైఫల్యాలపై సీఎంవో ఆరా

Updated Date - Feb 01 , 2026 | 07:31 AM