జాతరలో వైఫల్యాలపై సీఎంవో ఆరా
ABN , Publish Date - Feb 01 , 2026 | 07:25 AM
మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో చోటు చేసుకున్న వైఫల్యాలు, తత్ఫలితంగా భక్తులు పడిన ఇబ్బందులపై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఆరా తీసినట్టు తెలిసింది.
ట్రాఫిక్ జామ్, భక్తుల ఇబ్బందులపై ఆగ్రహం
నివేదిక పంపాలని అధికారులకు ఆదేశం
మేడారం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో చోటు చేసుకున్న వైఫల్యాలు, తత్ఫలితంగా భక్తులు పడిన ఇబ్బందులపై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఆరా తీసినట్టు తెలిసింది. ప్రధానంగా ట్రాఫిక్ జామ్‌పై సీరియస్ అయినట్టు సమాచారం. రూ.250 కోట్ల వ్యయంతో మేడారంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి, మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ.. జాతర నిర్వహణలో వైఫల్యాలు ఎందుకు చోటు చేసుకున్నాయని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రధానంగా శుక్రవారం రోజు మేడారం-తాడ్వాయి మధ్య పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ కావడానికి దారితీసిన కారణాలేంటి? ఇందుకు బాధ్యులైన అధికారులెవరు? తదితర అంశాలపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించినట్టు తెలిసింది. మేడారంలో భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు, క్యూలైన్ల నిర్వహణలో లోపాలు, ట్రాఫిక్ సమస్యపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలపై స్పందించిన సీఎంవో.. ఈ మేరకు అధికారుల నుంచి వివరణ కోరినట్టు సమాచారం.
పూజారుల అసంతృప్తి
మహా జాతర నిర్వహణ పట్ల పలువురు పూజారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతరలో పూజారుల ప్రాధాన్యం తగ్గించేలా పోలీసులు వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. మహా జాతర జరిగిన 4 రోజులు పూజారులు గుడి లోపలికి, బయటికి వెళ్లే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు కొనసాగించారని మండిపడ్డారు. గద్దెల వద్ద పలువురు వలంటీర్లు పూజారుల అవతారమెత్తారని, తరతరాలుగా వస్తున్న తమ ఆచారాలను మంటగలిపారని ధ్వజమెత్తారు. పోలీసులు వ్యవహరించిన తీరు గద్దెల వద్ద సెంట్రల్ జైలును తలపించేలా ఉందని పూజారులు ఆవేదన వ్యక్తం చేశారు.