భారత్‌లోని పాక్ జాతీయులకు లాంగ్‌టర్మ్ వీసా ఉండాల్సిందే : హైకోర్టు
ABN , Publish Date - Feb 01 , 2026 | 07:19 AM
పాకిస్థాన్ జాతీయులు భారత్‌లో ఉండాలంటే చట్టప్రకారం దీర్ఘకాలిక వీసా (లాంగ్‌టర్మ్ వీసా-ఎల్‌టీవీ) తప్పనిసరిగా పొందాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్ జాతీయులు భారత్‌లో ఉండాలంటే చట్టప్రకారం దీర్ఘకాలిక వీసా (లాంగ్‌టర్మ్ వీసా-ఎల్‌టీవీ) తప్పనిసరిగా పొందాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వీసాలు లేనివారికి ఎలాంటి నోటీసు ఇవ్వలేదనే కారణంతో ప్రస్తుతం పోలీసులను తనిఖీలు చేపట్టకుండా ఆపలేమని స్పష్టంచేసింది. లాంగ్‌టర్మ్ వీసాతో భారత్‌లో ఉంటున్న పాక్ జాతీయులు మళ్లీ ఆ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం గతేడాది జూన్ 4న ఉత్తర్వులు జారీచేసింది. దాంట్లో భాగంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. దీనిపై యాకత్‌పురాకు చెందిన సయ్యద్ అలీ హుస్సేన్ రజ్వీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ పిటిషనర్ హైదరాబాద్‌లోనే పుట్టారని, 31 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ భారత పౌరురాలిని వివాహం చేసుకున్నారని తెలిపారు. పుట్టుకతో భారత పౌరసత్వం సంక్రమించిందని పేర్కొన్నారు. భారత్‌కు చెందిన ఆయన తల్లి పాకిస్థాన్ జాతీయుడిని పెళ్లి చేసుకుని కొన్ని రోజులు అక్కడ ఉందని, విడాకులు తీసుకొని తిరిగి వచ్చేసిందని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్, ఆయన తల్లి రికార్డుల్లో మొత్తం పాకిస్థాన్ జాతీయులుగానే నమోదయ్యాయాని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాకిస్థాన్ జాతీయులు లాంగ్ టర్మ్ వీసాకు తాజాగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే అని స్పష్టంచేసింది.