Share News

కబ్జాకోరులు ఎవరైనా వదలం

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:43 AM

బస్తీలు, కాలనీలు మునగడానికి కబ్జాలే కారణం. కబ్జాలు చేసేవారు ఎంతవారైనా ఈ ప్రభుత్వం వదలదు. ఎవ్వడైనా సరే.. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే తోడ్కలు తీసి.. ..

కబ్జాకోరులు ఎవరైనా వదలం

  • చెరువులు, నాలాలు ఆక్రమిస్తే తోడ్కలు తీస్తాం

  • ఎవరు అడ్డం పడినా ఫ్యూచర్‌ సిటీని కడతా

  • వచ్చేసారి సిద్దిపేటలో గెలిస్తే కదా.. రద్దు చేసేది

  • ‘వన మహోత్సవం’లో సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ‘‘బస్తీలు, కాలనీలు మునగడానికి కబ్జాలే కారణం. కబ్జాలు చేసేవారు ఎంతవారైనా ఈ ప్రభుత్వం వదలదు. ఎవ్వడైనా సరే.. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే తోడ్కలు తీసి.. వీపులకు సున్నం పెట్టే బాధ్యత హైడ్రా తీసుకుంటుంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. బస్తీలు, కాలనీలు మునిగేందుకు కారణమైన కబ్జాదారుల కోరలు పీకాలని హైడ్రాను తీసుకొచ్చామని, దానిని భూతద్దంలో చూపేట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఆయన ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని గుర్రంగూడ ఎకో పార్కులో ప్రారంభించారు. మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబుతో కలిసి నాగలింగం మొక్కను నాటారు. అక్కడ ఏర్పాటు చేసిన రోబోటిక్‌ ఏనుగును ప్రారంభించారు. గుర్రంగూడ రిజర్వ్‌ ఫారెస్టులో చేపట్టిన పలు అభివృద్ధి పనులతోపాటు వివిధ జిల్లాల్లో కోట్ల విలువైన అర్బన్‌ పార్కులు, ఎకో పార్కులు, పర్యావరణ మౌలిక సదుపాయాలను వర్చువల్‌ విధానంలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘పేద, మధ్యతరగతి ప్రజల జోలికి హైడ్రా వచ్చిందా? ఎవ్వరైతే చెరువులు, నాలాలు, పార్కులు కబ్జాలు పెట్టారో.. వారి వీపులు సున్నమవుతున్నాయి. వనస్థలిపురం ప్రాంతంలో గుడికి సంబంధించిన స్థలాలను కొంతమంది కబ్జా పెడితే హైడ్రా వచ్చి కూలగొట్టి గుడికి అప్పగించింది’’ అని సీఎం వివరించారు. నీళ్లు వెళ్లే దారులను కొందరు ఆక్రమిస్తే వాన వచ్చినప్పుడు ఆ నీళ్లు మన ఇళ్లను కబ్జా పెట్టుకుంటున్నాయని, కొంతమంది చెరువులు, కుంటలను కబ్జా చేస్తే వేలాది కుటుంబాలు కష్టాలు, నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించారు.


ఢిల్లీ, ముంబై తరహా పరిస్థితులు రాకూడదనే..

‘‘మూసీ నదిని అభివృద్ధి చేస్తామంటే కొందరు అడ్డం పడుతున్నారు. మూసీ మురికిగానే ఉండాలని, అక్కడి వారు మురికిలోనే పొర్లాలని అనుకుంటున్నారు. మురికిలో పొర్లే పందులు కూడా ఈ మురికి మనకెందుకనే పరిస్థితి వచ్చింది. కానీ, ఈ ముర్ఖులకు ఎందుకు ఆ సంగతి అర్థమయిత లేదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. సబర్మతి, యమున, గంగానది రివర్‌ ఫ్రంట్‌ కంటే గండిపేట నుంచి గౌరెళ్లి వరకు 55 కిలోమీటర్లు అంతర్జాతీయ స్థాయిలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తనది, సహచర మంత్రులదని చెప్పారు. ఢిల్లీ, ముంబై తరహా పరిస్థితులు నగరానికి రాకూడదనే మూసీ పునరుజ్జీవ కార్యక్రమం పెట్టుకున్నామన్నారు. ‘‘భువనగిరి ప్రాంతంలో మూసీ పక్కన పండే వడ్లు, కూరగాయలు తినే పరిస్థితి లేదు. ఆ ప్రాంతంలో కొత్తగా పెళ్లయిన వారికి అవిటి పిల్లలు పుడతారనే ఆందోళనతో నగరానికి పంపుతున్నారు. వాళ్లు మనుషులు కాదా? వాళ్లు విషంలోనే బతకాలా? ఒకనాడు మూసీ రివర్‌ ఫ్రంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్నాయన మూసీ కట్టోద్దంటుండు. అమ్ముడుపోయి నాడు చైౖర్మన్‌ పదవి ఎందుకు తీసుకున్నావ్‌? ఎవ్వరిని ముంచడానికి తీసుకున్నావ్‌?’’ అంటూ పరోక్షంగా ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని విమర్శించారు.


ఫ్యూచర్‌ లేనోడే ఫ్యూచర్‌ సిటీ రద్దు చేస్తానంటుండు

‘‘ఎవ్వరు ఏడ్చినా.. ఎవ్వరూ అడ్డంపడి దొర్లినా.. ఎక్కువ తక్కువై ఎండ్రిన్‌ తాగి చచ్చినా.. భారత్‌ ఫ్యూచర్‌ సిటీని కడతా. అంతర్జాతీయ కంపెనీలు తెస్తా. పెట్టుబడులు తేవడమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉండే పర్యాటకులు తరలివచ్చేలా.. భవిష్యత్తు తరాలు గొప్పగా చర్చించుకునేలా తీర్చిదిద్దుతా’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచర్‌ లేనోడే ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తానని అంటున్నాడని, వచ్చేసారి సిద్దిపేటలో గెలిస్తే కదా ఈ ముచ్చట్లు.. అంటూ పరోక్షంగా బీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉపనేత హరీశ్‌ రావుపై మండిపడ్డారు. తాము ఫ్యూచర్‌ సిటీని కడతామంటుంటే.. ఒకాయన కాలుష్య, ఫార్మా కంపెనీలను తీసుకొస్తామని చెబుతున్నారని, తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామని అంటున్నారని మండిపడ్డారు. వాళ్ల ఫ్యూచర్‌ను ప్రజలు ఎప్పుడో రద్దు చేశారని, అందుకే ఒకాయన ఫామ్‌హౌస్‌కు పోతే, ఇంకొకాయన చెట్ల వెంబడి తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఒక్క సిరీస్‌ కంపెనీతోనే బతుకులు ఆగమయ్యాయని, దాన్ని వదిలించుకోవడానికి దేవుడు దిగివచ్చినంతా పనైందని, అట్లాంటి వందల ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి ఫ్యూచర్‌ సిటీలో పెడతామని చెబుతున్నారని మండిపడ్డారు. గాలి, నీళ్లు కాలుష్యమైతే జీవితాలు ఆగమవుతాయని, దవాఖానలకు లక్షలు, కోట్లు సరిపోవని, ఆ డబ్బులను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ప్రశ్నించారు. ‘‘అందుకే 30 వేల ఎకరాల ఫ్యూచర్‌ సిటీలో 15 వేల ఎకరాలను ఫారెస్టు ల్యాండ్‌గా అభివృద్ధి చేస్తున్నాం. 60 శాతం పచ్చదనంతో వనమే మనం.. మనమే వనం అని గొప్ప నగరాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ, కొందరు ఎన్‌జీటీలో, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారు’’ అని విమర్శించారు.

Updated Date - Jun 19 , 2026 | 03:43 AM