హ్యామ్ రోడ్లకు నేడే శ్రీకారం
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:17 AM
రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో చేపట్టబోయే రోడ్ల పనులకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో హ్యామ్ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో....
శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
నల్లగొండ జిల్లా కనగల్ వద్ద పైలాన్ ఆవిష్కరణ
రూ.13,006 కోట్లతో 6,092 కిలోమీటర్ల మేర 441 ప్యాకేజీలుగా పనులు
నల్లగొండలో రూ.83 కోట్లతో తాగునీటి పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన
ఎన్‌జీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ
హైదరాబాద్/నల్లగొండ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో చేపట్టబోయే రోడ్ల పనులకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో హ్యామ్ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. కనగల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘హ్యామ్ ప్రాజెక్టు పైలాన్’ను ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. వాటిని సాధారణ విధానంలో కాకుండా హైబ్రిడ్ యాన్యునిట్ మోడ్‌లో నిర్మించేందుకు, ఆ రోడ్ల నిర్వహణను 15 ఏళ్లపాటు కాంట్రాక్టర్లే చేపట్టే విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఆర్‌అండ్‌బీలో ప్రత్యేకంగా హ్యామ్ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆర్‌అండ్‌బీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్ని రోడ్లు నిర్మించాలో నిర్ణయించింది. దాని ప్రకారం ఉమ్మడి జిల్లాల వారీగా కలిపి 6,092 కిలోమీటర్లను 441 ప్యాకేజీలుగా విభజించింది. రూ.13,006 కోట్లతో ఈ పనులు చేపట్టనుంది. ప్యాకేజీల వారీగా ఈ పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం డిప్యూటీసీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదివారం మధ్యాహ్నం కనగల్‌కు చేరుకోనున్నారు. పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం నల్లగొండ పట్టణంలోని ఎన్‌జీ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. నల్లగొండ మునిసిపల్ కార్పొరేషన్‌లో 24 గంటల కృష్ణాజలాల సరఫరాకు సంబంధించి రూ.83 కోట్లతో చేపట్టే పనులకు అక్కడే శంకుస్థాపన చేయనున్నారు.

ఆటంకాలు దాటుకుని హ్యామ్ రోడ్లు..
హ్యామ్ విధానంలో పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి.. గతేడాది జూన్‌లో అందుకు అనుమతులు మంజూరు చేసింది. కానీ, సాంకేతికంగా తలెత్తిన పలు ఇబ్బందులతో ఈ పనులు ఒక పట్టాన ముందుకు సాగలేదు. పనుల నిర్వహణకు కాంట్రాక్టర్లు వేసిన టెండర్లలో అధిక ధరలు ఉండడం రాజకీయంగా కొంత దుమారం రేపింది. తాము నిర్మించిన రోడ్లకు చెల్లించే నిధుల విషయంలో సాంకేతిక ఇబ్బందులున్నాయని కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు వెనకడుగువేశారు. దీంతో ఏడాది కాలంగా ఈ పనుల వ్యవహారం ఒకడుగు ముందుకు, పది అడుగులు వెనక్కి అన్నట్టు మారింది. అయితే హ్యామ్ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ ఈ ఏడాది మార్చి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. టెండర్లలో వచ్చిన అధిక ధరల విషయంతోపాటు కాంట్రాక్టర్లు లేవనెత్తిన పేమెంట్ల విషయంలోనూ అధికారులతో మాట్లాడి.. ఆ రెండు సమస్యలను పరిష్కరించారు. అంతేకాకుండా కాంట్రాక్టర్లకు ఆర్‌బీఐ నుంచి గ్యారెంటీలు ఇప్పించేలా ఆర్థిక శాఖతో ఏర్పాటు చేయించారు. ఫలితంగా మొదట పిలిచిన టెండర్లలో వచ్చిన అధిక ధరలు తగ్గడంతోపాటు నిబంధనల ప్రకారం 5శాతం లోపే టెండర్ కొటేషన్లు వచ్చాయి. దాంతో పనుల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఇటీవల కాంట్రాక్టర్లతో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్‌లకు సంబంధించిన పనిని అధికారులు దాదాపు పూర్తిచేశారు. కాంట్రాక్టర్లు రుణాల కోసం బ్యాంకర్లతో ఒప్పందాలు చేసుకున్న తరువాత లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లలో పేర్కొన్న మేరకు పనులను ప్రారంభించనున్నారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్‌లు, బ్యాంకుల్లో రుణాల దశలు త్వరలోనే పూర్తికానున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన మేరకు హ్యామ్ పనులు పూర్తయితే మండల కేంద్రాల నుంచి జిల్లాలకు, జిల్లా నుంచి రాష్ట్ర రహదారుల అనుసంధానం పూర్తికానుంది. అలాగే రవాణా రంగం మరింత బలోపేతమవుతుందని ఆర్‌అండ్‌బీ అధికారులు పేర్కొంటున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానం
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆదివారం హ్యామ్ పనుల శంకుస్థాపనకు హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురూ కాసేపు మాట్లాడుకున్నారు. కాగా, నల్లగొండలోని ఎన్‌జీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగసభకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్రపవార్ ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. సభకు మహిళలు అధిక సంఖ్యలో వస్తుండటంతో 600 ప్రత్యేక బస్సులను అన్ని గ్రామాలకు పంపనున్నారు. వర్షాకాలం కావడంతో సభకు అంతరాయం కలగకుండా జర్మన్ హ్యాంగర్ టెంట్లను ఏర్పాటు చేశారు.