Share News

నీట్‌ రద్దు.. నోట్ల రద్దు లాంటిదే!

ABN , Publish Date - May 15 , 2026 | 04:30 AM

నీట్‌-యూజీ 2026 పరీక్ష రద్దు నిర్ణయం దేశ ప్రజలను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిన పెద్ద నోట్ల రద్దు లాంటిదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

నీట్‌ రద్దు.. నోట్ల రద్దు లాంటిదే!

  • ఇది నియంతృత్వ, నిరంకుశ నిర్ణయం

  • యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన మోదీ సర్కారు

  • పేపర్‌ లీకైతే సంబంధిత మంత్రిపై చర్యలు తీసుకోరా?

  • మోదీ పదేళ్ల పాలనలో 93 పేపర్లు లీక్‌!

  • కేంద్రం తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్ర జ్యోతి): నీట్‌-యూజీ 2026 పరీక్ష రద్దు నిర్ణయం దేశ ప్రజలను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిన పెద్ద నోట్ల రద్దు లాంటిదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మోదీ సర్కారు నియంతృత్వ, నిరంకుశ నిర్ణయమని ఆరోపించారు. పదేళ్ల మోదీ పాలనలో 93 పేపర్లు లీకయ్యాయని తెలిపారు. పేపర్‌ లీక్‌ అయితే కనీసం సంబంధిత మంత్రిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వ్యవస్థీకృతంగా పేపర్‌ లీకులు, ప్రభుత్వ వైఫల్యాలు దేశ యువతను అనిశ్చితి, నిరాశలోకి నెట్టాయని చెప్పారు. ఏళ్ల తరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థుల కలలు కల్లలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది తల్లిదండ్రులు అప్పులు చేసి, నగలు అమ్ముకొని పిల్లలను నీట్‌ పరీక్ష కోసం సిద్ధం చేస్తారని, వారి ఆశలన్నీ గల్లంతవడం బాధాకరమని అన్నారు. 2019 నుంచి 15 రాష్ట్రాల్లో ప్రధాన నియామక పరీక్షల పేపర్లు లీక్‌ అయినా, ఒక్క కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ లీక్‌లకు ప్రధాన కేంద్రాలుగా మారాయని ఆరోపించారు.

ప్రభుత్వ పరీక్షా వ్యవస్థలోనే లోపాలు..

2014 మేలో మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దేశంలో ప్రభుత్వ పరీక్షా వ్యవస్థలో లోపాలు బహిర్గతం అయ్యాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ విడుదల చేసిన ‘ది పేపర్‌ లీక్‌ డికేడ్‌’ శ్వేత పత్రం ప్రకారం కేంద్ర, రాష్ట్ర పరీక్షల్లో 93 పేపర్‌ లీక్‌ ఘటనలు జరిగాయని తెలిపారు. వీటి వల్ల సుమారు రెండు కోట్ల మంది విద్యార్థులు ప్రభావితం అయ్యారని చెప్పారు. 2024లో కేవలం 8 వారాల్లోనే నాలుగు ప్రధాన జాతీయ పరీక్షలు రద్దయ్యాయని గుర్తుచేశారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో 14 లీక్‌లు జరిగాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా వంటి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయని వివరించారు. నీట్‌ రద్దు నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని.. రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Updated Date - May 15 , 2026 | 04:30 AM