Share News

పెట్టుబడుల సదస్సుకు తరలిరండి!

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:21 AM

ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించనున్న 2వ తెలంగాణ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో పాల్గొనాలని కెనడాకు చెందిన కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.

పెట్టుబడుల సదస్సుకు తరలిరండి!

కెనడా కంపెనీలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం.. కెనడా హై కమిషనర్‌ క్రిస్‌ కూటర్‌తో భేటీ

ఫ్యూచర్‌సిటీల్లో కెనడా భాగస్వామ్యానికి అవకాశాలపై చర్చ

ఆయిల్‌పామ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం నేపథ్యంలో గోద్రేజ్‌ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించనున్న 2వ తెలంగాణ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో పాల్గొనాలని కెనడాకు చెందిన కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. పెట్టుబడులకు, వ్యాపార భాగస్వామ్యాలకు తెలంగాణ మంచి వేదికగా నిలుస్తుందన్నారు. భారత్‌లో కెనడా హై కమిషనర్‌ క్రిస్‌ కూటర్‌ బుధవారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెనడా-తెలంగాణ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటంపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్‌సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై మాట్లాడుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌, రక్షణ, ఏరోస్పేస్‌ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతిని క్రిస్‌ కూటర్‌కు వివరించారు. ఫార్చ్యూన్‌-500 కంపెనీల గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. మూసీ నది పునరుద్ధరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని, నదీ తీరాన్ని అభివృద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించాలన్న లక్ష్యంతో పని చేస్తోందని చెప్పారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నామన్నారు. పలు విదేశీ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ క్యాంప్‌సలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని, కెనడాకు చెందిన వర్సిటీలు కూడా ఈ అవకాశాన్ని పరిశీలించాలని రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో సౌర విద్యుత్‌ విస్తరణ, హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కెనడా సహకారం అందించాలని కోరారు.


క్రిస్‌ కూటర్‌ స్పందిస్తూ.. ఉద్యోగాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అనుసరిస్తున్న విధానం ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కెనడా అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ను కెనడా పర్యటనకు ఆహ్వానించారు. త్వరలో కెనడా వాణిజ్య ప్రతినిధుల బృందం తెలంగాణకు వచ్చి ఇంధనరంగం, పట్టణాభివృద్ధి, రక్షణ, ఏరోస్పేస్‌ తదితర రంగాల్లో పెట్టుబడులు, భాగస్వామ్య అవకాశాలపై చర్చిస్తుందని తెలిపారు. ఇటీవల కెనడాకు చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ క్రిస్‌ కూటర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.


ఖమ్మంలో 300 కోట్ల ప్రాజెక్టు..

సీఎం రేవంత్‌రెడ్డిని గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ రాకేష్ స్వామి, గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ ఆయిల్‌పామ్‌ బిజినెస్‌ సీఈవో సౌగతో నియోగి బుధవారం కలుసుకున్నారు. ఖమ్మం జిల్లాలో గోద్రేజ్‌ కంపెనీ రూ.300కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న సమీకృత ఆయిల్‌పామ్‌ కాంప్లెక్స్‌ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో దాని గురించి చర్చించారు. ఈ కాంప్లెక్స్‌ ద్వారా 700 మందికి పైగా ఉపాధి లభించనుందని కంపెనీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. ప్రాసెసింగ్‌ మిల్‌ కోసం రహదారిని విస్తరించాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. మరోవైపు, గ్రీన్‌ గ్రోత్‌ ఎకనామిక్‌ సమ్మిట్‌-2026లో పాల్గొనడానికి హైదరాబాద్‌కు వచ్చిన మలేషియా పార్లమెంటు సభ్యుడు శరవణన్‌, పలు విదేశీ కంపెనీల ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.


వైఎస్ఆర్‌కు సీఎం రేవంత్‌ నివాళి

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. సీఎం రేవంత్‌ నివాసంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పాల్గొన్నారు. గాంధీభవన్‌లో వైఎస్ఆర్‌ చిత్రపటానికి మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌ వెంకటస్వామి, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు, ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌, ఏఐసీసీ కార్యదర్శి కుసుమ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు ప్రేమ్‌ సాగర్‌రావు, నాయిని నివాళులర్పించారు.

Updated Date - Jul 09 , 2026 | 06:28 AM