తక్షణ మరమ్మతులు
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:45 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎన్డీఎస్ఏ సూచనల మేరకు 3 బ్యారేజీలకు పనులు
నిధులకు ఇబ్బంది లేదు.. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు.. నిత్యం పర్యవేక్షణ
నేనే వచ్చి పరిశీలిస్తా.. అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ సూచనల మేరకు పనులను చేపట్టి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గురువారం మంత్రి ఉత్తమ్‌తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ సంస్థలను అప్రమత్తం చేయాలన్నారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) ఆధ్యర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, బ్యారేజీల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టేషన్ సంస్థలతో బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సభ్యులు ఉండేలా చూడాలని నిర్దేశించారు. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లర్లే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజీని అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఇంజనీర్లు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తవ్వాల్సి ఉందని పేర్కొనగా.. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సీఎం ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకుని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. మరమ్మతులకు సంబంధించిన డిజైన్లు సిద్ధం చేయాలని, డిసెంబరు దాకా చేయాల్సిన పనులపై షెడ్యూల్ సిద్ధం చేయాలన్నారు. పనుల్లో జాప్యం జరగడానికి వీలు లేదని, నిధుల విషయంలో ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభమయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, నీటిపారుదశాఖ కార్యదర్శి శ్రీధర్ , సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.