సైమన్ గో బ్యాక్ తరహాలో..సర్ గో బ్యాక్!
ABN , Publish Date - Sep 29 , 2026 | 02:29 AM
ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఓటర్లను తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలను అడ్డుకొనేందుకు దేశ ప్రజలంతా ఏకమయ్యే రోజు వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వందేళ్ల క్రితం సైమన్ కమిషన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ దేశ ప్రజలంతా ఉద్యమించిన తీరునే మళ్లీ ‘సర్ గో బాక్’ పేరుతో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉద్యమించడం తథ్యమని చెప్పారు

దేశంలో ఉద్యమం తథ్యం..
బ్రిటీషోడి తరహాలో నరేంద్ర మోదీ పాలనఈసీని అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యానికి ఎసరు
ఓట్లపై కలెక్టర్ అధికారాల్నీ లాక్కున్నారు
జనాభా పెరుగుతుంటే ఓట్లు తగ్గుతున్నాయి
ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించారు
మొత్తం 30 కోట్ల ఓట్లకు ఎసరు పెట్టారు
గతంలో ఏ ‘సర్’లోనూ ఇలా చేయలేదు
తెలంగాణ ప్రాజెక్టుల్ని మోదీ తొక్కిపట్టారు
సెమీ కండక్టర్‌ను గుజరాత్‌కు తీసుకెళ్లారు
డీలిమిటేషన్‌ను మళ్లీ ఫ్రీజ్ చేయాల్సిందే
సంఖ్యాబలం పెత్తనం వల్లే తెలంగాణ వచ్చింది
శివుడు పేదల దేవుడు.. రాముడు సంపన్నుల
దేవుడు..
‘ప్రతిదిన్’ సదస్సులో సీఎం రేవంత్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఓటర్లను తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలను అడ్డుకొనేందుకు దేశ ప్రజలంతా ఏకమయ్యే రోజు వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వందేళ్ల క్రితం సైమన్ కమిషన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ దేశ ప్రజలంతా ఉద్యమించిన తీరునే మళ్లీ ‘సర్ గో బాక్’ పేరుతో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉద్యమించడం తథ్యమని చెప్పారు. ఓట్ల తొలగింపు కేవలం కాంగ్రెస్ పార్టీ సమస్య కాదని, మొత్తం దేశానికి సంబంధించిన సమస్య అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్ తదితర విపక్ష నేతలంతా ఏకమౌతారని అన్నారు.
సోమవారం ఆయన ఢిల్లీలో అస్సాం దినపత్రిక ప్రతిదిన్ పత్రిక నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. స్వాతంత్రోద్యమ సమయంలో ఏకపక్షంగా భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించే ప్రయత్నాన్ని అడ్డుకొనేందుకు లాలా లజపతి రాయ్ సైమన్ గోబ్యాక్ ఉద్యమాన్ని నిర్మించారని రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఏకపక్షంగా సైమన్ కమిషన్ తరహాలో ఎన్నికల సంఘం నిర్మాణాన్ని మార్చి సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ ’బ్రిటిష్ జనతా పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగ సభలో సుదీర్ఘంగా చర్చించి ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారని, ఆ తర్వాత జరిగిన అన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లలో ప్రతీ పౌరుడికి ఓటుహక్కు కల్పించడమే లక్ష్యంగా పని చేశారని, మొదటిసారి ఓట్లను తొలగించడానికి దీన్ని దుర్మార్గంగా వాడుతున్నారని మండిపడ్డారు.
దేశంలో జనాభా పెరుగుతుంటే ఓట్లు మాత్రం ఎందుకు తగ్గుతున్నాయని రేవంత్ ప్రశ్నించారు. మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కలిసి కోట్ల కొద్దీ ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు దేశంలో 81 కోట్ల ఓట్లు ఉండగా 2019 నాటికి 91 కోట్లకు, 2024 నాటికి 97 కోట్లకు చేరాయన్నారు. తాజాగా ఏకంగా 13 కోట్ల ఓట్లు తొలగించారని చెప్పారు. వీటితో పాటు కొర్రీల ద్వారా మొత్తం 30 కోట్ల ఓట్లు తొలగించడం లక్ష్యంగా పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే వారిని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని ఓట్లు తొలగిస్తున్నారని చెప్పారు. మోదీజీకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు ఉండేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బూత్ స్థాయి అధికారికి, కలెక్టర్‌కు ఉండే అధికారాలను సైతం ఢిల్లీలో కూర్చున్న ఎన్నికల సంఘం తన గుప్పిట్లోకి తీసుకుందని, ఏఐ టెక్నాలజీని వాడి ఓట్లను తొలగిస్తోందని అన్నారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దర్ని పక్కన బెట్టి జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాతలు దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ప్లాన్ చేస్తే మోదీ ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం ప్రజాస్వామ్యానికే ఎసరు పెడుతున్నారని అన్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను పది రోజులు ఉత్తర కొరియాకు పంపించాలని, ఆయన కిమ్ దగ్గర శిక్షణ తీసుకొచ్చి, ప్రధాని మోదీకి దేశంలో వందకు వంద శాతం ఓట్లు వేయిస్తారని రేవంత్ ఎద్దేవా చేశారు. .
’సైమన్ గో బ్యాక్‘ తరహాలో సర్ గో బ్యాక్‘ నినాదం కింద దేశమంతా ఏకమవడం తథ్యమని చెప్పారు
అసెంబ్లీలో కన్నా జైల్లోనే ఎక్కువ కాలం గడిపా
కేసీఆర్ పాలనలో తాను అసెంబ్లీలో కన్నా జైలులోనేఎక్కువ సమయం గడిపానని, కేసీఆర్ తనను అనేకసార్లు జైలుకు పంపడం ద్వారా అణచివేయాలని చూశారని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో తెలుగుదేశానికి తెలంగాణలో ప్రాధాన్యం తగ్గిపోయిందని రేవంత్ చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు కేసీఆర్‌కు, రేవంత్‌రెడ్డికి మధ్య పోరుగా మారాయన్నారు. ‘‘మీరు మంచి నాయకుడు, మీరు నాయుడుతో కలిసిపనిచేస్తే ఇక్కడ ఇబ్బంది అవుతుంది’’ అని తెలంగాణ ప్రజలు చెప్పడంతో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. తన శ్రేయోభిలాషులు ఎక్కువ మంది కాంగ్రె్‌సలోనే ఉన్నారని చెప్పారు. రాహుల్‌గాంధీని కలిసినపుడు 20 నిమిషాలు మాట్లాడుకున్నామని, ఆయనే తన నాయకుడని అప్పుడే నిర్ణయించుకున్నానని తెలిపారు. రాహుల్‌గాంధీకి ఎలాంటి వ్యక్తిగత అజెండాలు లేవన్నారు. ఆయనకు దేశమే ముఖ్యమని చెప్పారు. తానుకూడా విద్యార్థి సంఘం నేతగా, టీడీపీ నేతగా ఎప్పుడూ దేశం, రాష్ట్రం కోసం ఏదైనా చేయాలనే తపించిన వాడిని కావడంతో కనెక్ట్ అయ్యానన్నారు. తెలంగాణలో విద్యార్థి రాజకీయాల్లో లెఫ్ట్, ఏబీవీపీలు చురుగ్గా ఉన్నా రెగ్యులర్ రాజకీయాల్లో కాంగ్రెస్ దే పైచేయి అని రేవంత్‌రెడ్డి అన్నారు.
స్కిల్‌కే ప్రాధాన్యం
తెలంగాణలో ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ ఏటా 50 వేల మంది విద్యార్థులు చదువు మానేస్తున్న విషయం గుర్తించి దీనిపై అధ్యయనం కోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి నేతృత్వంలో విద్యా కమిషన్‌ను నియమించామని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవడం, పైవ్రేటు పాఠశాలల్లో మాదిరిగా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు లేకపోవడమే ప్రధాన కారణమని తేలిందని వెల్లడించారు. వాటిని సరిదిద్దే చర్యలు చేపడుతున్నామన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కింద ఏటా రూ.2,500 కోట్లు ఇస్తున్నప్పటికీ పైవ్రేటు కాలేజీల్లో నాణ్యత, సరైన అధ్యాపకులు లేకపోవడాన్ని సరిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 12వ తరగతి వరకు భాష, నైపుణ్యాలు నేర్పుతున్నామని, ఆ తర్వాత నైపుణ్యాల కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టామని వివరించారు. ఇచ్చిన హామీలు 90 ు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తామంటే అప్పుడు రాజకీయ పార్టీల ప్రణాళిక సక్రమంగా ఉంటుందని సీఎం అన్నారు. వేతనాలు, పింఛన్లు, కార్యాలయాల నిర్వహణ, సంక్షేమ పథకాల మీద ఖర్చు తర్వాత అభివృద్ధికి నిధులు తగ్గిపోయాయని చెప్పారు. అందుకే, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేమని అనేకసార్లు మొహమాటం లేకుండా చెబుతున్నామన్నారు.
అణిచేస్తే విప్లవం
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అనేది కేవలం రాజకీయ అంకెల ఆట మాత్రమేనని రేవంత్ వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా డీలిమిటేషన్ చేపట్టొద్దని, 1976, 2001 మాదిరిగానే ప్రస్తుత లోక్‌సభ సీట్ల సంఖ్యను మరో 25 ఏళ్లు ఫ్రీజ్ చేయాలని ప్రధానిని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ చేపడితే బీమారు రాష్ట్రాల సీట్లు విపరీతంగా పెరిగి, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాభవం పూర్తిగా కనుమరుగవుతుందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రా ప్రాంతానికి 175 శాసనసభ స్థానాలు ఉంటే, తెలంగాణ ప్రాంతంలో 119 స్థానాలున్నాయని, అప్పట్లో వారు ఎప్పుడూ తమపై పెత్తనం చేసేవారని, ఆధిపత్యాన్ని చూసీ చూసీ పోరాడి తెలంగాణ సాధించుకున్నామని స్పష్టం చేశారు. సమాజంలో మైనారిటీలను అణిచివేస్తే విప్లవం వస్తుందని హెచ్చరించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హయాంలో దక్షిణాదికి రాష్ట్రపతి పదవులతో పాటు రక్షణ, ఆర్థిక, హోంశాఖ వంటి కీలక పదవులు దక్కేవని చెప్పారు. మోదీ కోరుకున్న పద్దతిలో డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి కేంద్రంలో ప్రాధాన్యం పూర్తిగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
శివుడు పేదల దేవుడు..
రాముడు సంపన్నుల దేవుడు
దక్షిణాది వాళ్లు ద్రావిడులని, ఉత్తరాది వారు ఆర్యులని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాము శివ భక్తులమని, వారు రామ భక్తులని చెప్పారు. ప్రధాని మోదీ ఎప్పుడైనా హరహర మహాదేవ్ అంటారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు వేదికలపై కేవలం జై శ్రీరామ్ మాత్రమే అంటారని ప్రస్తావించారు. శివుడు పేదల దేవుడని, శ్రీరాముడు సంపన్నుల దేవుడని, బీజేపీ సంపన్నుల పార్టీయేనని వ్యాఖ్యానించారు. అవకాశం వస్తే మోదీని నిలదీస్తా ప్రధానిగా మన్మోహన్‌సింగ్ ప్రతిపక్ష పాలనలో ఉన్న గుజరాత్‌కు ఇచ్చిన మద్దతులో పదో వంతు కూడా మోదీ తెలంగాణకు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
రీజినల్ రింగు రోడ్డు, మెట్రో రైలు, జాతీయ రహదారుల విస్తరణ ఫైళ్లు రెండేళ్లుగా పీఎంఓలోనే ఆగిపోయాయని తెలిపారు. నితిన్ గడ్కరీని అడిగినా ఫైల్ మోదీ వద్దే ఉందని చెబుతున్నారని వెల్లడించారు. తెలంగాణకు అన్ని హంగులు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో సెమీకండక్టర్ ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు. మోదీ సంస్థలను బెదిరించి మరీ ప్రాజెక్టులను అక్కడికి తరలిస్తున్నారని మండిపడ్డారు. అవకాశం వస్తే మోదీని ఎదురుగా కూర్చోబెట్టి ఈ విషయాలపై నిలదీస్తానని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
నేరుగా ప్రధాని మోదీ రాజీనామాను అడగండి.. సీజేపీకి కేజ్రీవాల్ సలహా
ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు