బసవతారకం ఆస్పత్రి..క్యాన్సర్ బాధితులకు దేవాలయం
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:53 AM
ఒకే కుటుంబంలో ఒకరు తండ్రి పేరిట, మరొకరు తల్లి పేరిట సేవలనందిస్తుండటం నందమూరి కుటుంబంలోనే చూస్తున్నాను.
బాలకృష్ణ ఆధ్వర్యంలో మెరుగైన సేవలందిస్తోంది.. ఈ ఆస్పత్రి సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలి
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు
30 ఏళ్లు దాటినవారికి 3 క్యాన్సర్ పరీక్షలు
కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ
బాలకృష్ణ కృషి ప్రశంసనీయం: వెంకయ్య
క్యాన్సర్‌ను నోటిఫయబుల్ డిసీజ్‌గా గుర్తించాం: మంత్రి దామోదర
హైదరాబాద్ సిటీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ‘‘ఒకే కుటుంబంలో ఒకరు తండ్రి పేరిట, మరొకరు తల్లి పేరిట సేవలనందిస్తుండటం నందమూరి కుటుంబంలోనే చూస్తున్నాను. బాలకృష్ణ తమ మాతృమూర్తి బసవతారకం పేరిట నడుపుతున్న ట్రస్ట్ హాస్పిటల్‌ను దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రులో ఒకటిగా మలిస్తే.. నా శ్రీమతి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తగిన రీతిలో సేవలను అందిస్తున్నారు. వీరిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నప్పటికీ తమ తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తుండటం అభినందనీయం’’ అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఆ ఆస్పత్రి క్యాన్సర్ బాధితులకు దేవాలయం వంటిదని అభివర్ణించారు. ‘‘ఈ హాస్పిటల్ ఏర్పాటు వెనుక ఓ మహోన్నత ఆశయం ఉంది. మా అత్తమ్మకు క్యాన్సర్ అని తెలిసిన వెంటనే మేమంతా ఎంతో క్షోభించాం. అప్పట్లో మనదగ్గర వైద్యసేవలు కూడా పెద్దగా అందుబాటులో ఉండేవి కావు. ఆమె బాధను మేం ప్రత్యక్షంగా చూశాం. మెరుగైన చికిత్స కోసం అమెరికాకు తీసుకువెళ్లినప్పటికీ ఆమెను కాపాడుకోలేకపోయాం’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఆమె మరణం ఎన్టీఆర్‌ను తీవ్రంగా బాధించిందని.. ఆయన కోలుకోవడానికి చాలా సమయమే పట్టిందని.. అప్పట్లో ఎన్టీఆర్‌కు వచ్చిన ఆలోచనే ఈ హాస్పిటల్ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆస్పత్రి నిర్వహణలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా బాలకృష్ణ సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారని, ఆయన చేతుల్లో ఈ హాస్పిటల్ సురక్షితంగా ఉందని కొనియాడారు. తండ్రి (ఎన్టీఆర్) ఒక మొక్క నాటితే.. కొడుకు దానిని మహావృక్షం చేశాడంటూ బాలకృష్ణను ప్రశంసించారు. బసవతారకంలో ఇప్పుడు 250 మందికి పైగా నిష్ణాతులైన వైద్యులున్నారని.. ఈ ఆస్పత్రిలో ఏటా దాదాపు ఎనిమిది వేలకు పైగా శస్త్రచికిత్సలు చేయడంతోపాటు, 90వేల మందికి పైగా ఔట్‌పేషంట్లకు సేవలను అందిస్తున్నారని తెలిపారు. దేశంలో ఇంత పెద్ద స్ధాయిలో క్యాన్సర్ రోగులకు సేవలనందిస్తున్న అతి తక్కువ హాస్పిటల్స్‌లో ఇది ఒకటని కొనియాడారు. ఈ క్రమంలోనే.. త్వరలో అమరావతిలో 1000 పడకల హాస్పిటల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు బాలకృష్ణ చెప్పగానే తాను స్వాగతించానన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ట్రస్ట్ సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు.
దేశంలో క్యాన్సర్ భారం పెరుగుతోందని.. ఏటా 9 లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక్కటే అందరికీ వైద్య సేవలు అందించలేదని.. బసవతారకం లాంటి ట్రస్ట్‌లు మరింతగా ఆరోగ్య రంగంలోకి వస్తే అందరికీ వైద్య సేవలను అందించడం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక.. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే మహోన్నత కారణంతో ఏర్పాటైన బసవతారకం హాస్పిటల్ ఆ ప్రయత్నంలో రెండున్నర దశాబ్దాల పాటు సేవలను అందిచడం గొప్ప విషయమని ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ కొనియాడారు. దేశంలో 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ మూడు రకాల (నోటి, గర్భాశయ ముఖద్వారా, రొమ్ము) క్యాన్సర్ పరీక్షలను తప్పనిసరి చేస్తున్నామన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా ఈ సేవలను అందిస్తున్నామని తెలిపారు. కాగా.. జీవనశైలి మార్పుల కారణంగానే రాచపుండు (క్యాన్సర్) వస్తుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేవలం చికిత్సలకే పరిమితం కాకుండా క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేసి ముందస్తు పరీక్షలు నిర్వహించడం ద్వారా బసవతారకం ఆస్పత్రి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఓ అభిరుచితో బాలకృష్ణ దీనిని నిర్వహిస్తున్నారని.. ఆయన అంకితభావం, కృషి ప్రశంసనీయమన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలను..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్శింహ.. క్యాన్సర్ బాధితులకు బసవతారకం ఆస్పత్రి అందిస్తున్న సేవలు గొప్పవని కీర్తించారు. ఎన్‌టీఆర్ ఆశయాలను బాలకృష్ణ ముందుకు తీసుకువెళ్తున్నారని అభినందించిన ఆయన.. లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు ఓ ఆశను బసవతారకం హాస్పిటల్ కలిగిస్తోందన్నారు. మారిన జీవనశైలి కారణంగానే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని.. తెలంగాణలో ఏటా 50-55 వేల కొత్త కేసులు బయటపడుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలో వ్యాధి నివారణపైన, తొలి దశలోనే గుర్తించడంపైన, ప్రజలకు ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడంపైన ప్రత్యేకంగా దృష్టి సారించామని వివరించారు. క్యాన్సర్‌ను నోటిఫయబల్ డిసీజ్‌గా గుర్తించామని, క్యాన్సర్ రిజిస్ట్రీ, క్యాన్సర్ పోర్టల్ తీసుకువచ్చామని వెల్లడించారు. ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటుచేసి స్ధానికంగానే కీమోథెరపీ లాంటి సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యాన్సర్ కారణంగా ఏ ఒక్క కుటుంబమూ ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూడటానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. కాగా.. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్‌తోపాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, బసవతారకం వ్యవస్ధాపక ట్రస్టు సభ్యులు, వైద్యులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నటులు గౌతమి, మమతా మోహన్‌దాసులతో పాటుగా అనంతపురంకు చెందిన స్వప్నలు తమ క్యాన్సర్ పోరాటాల గురించి వివరించగా మాధవపెద్ది సురేష్ బృందగానంతో అలరించారు. బసవతారకం ట్రస్ట్ వ్యవస్ధాపక సభ్యులతో పాటుగా డాక్టర్లు, సహకారం అందించిన వ్యక్తులకు జ్ఞాపికలను అందజేశారు.
పేదలకు అండగా ఉండాలనే..ఆస్పత్రి ప్రారంభించాం
బసవతారకం ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ
డబ్బు లేక ఏ ఒక్కరూ క్యాన్సర్‌తో మరణించకూడదన్నది తమ లక్ష్యమని.. బసవతారకం ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. పేదలకు అండగా ఉండాలనే తపనతోనే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌ను ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో రోజు దాదాపు 35-40 క్లిష్టమైన శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయని, టాటా మెమోరియల్ తరువాత ఆ స్థాయిలో శస్త్ర చికిత్సలు జరిగేది ఇక్కడేనని తెలిపారు. ‘‘ఓ నటుడిగా, ఎమ్మెల్యేగా కాకుండా ఒక కొడుకుగా ఈ రోజు ఇక్కడ ఉన్నా. మా అమ్మ క్యాన్సర్ బారిన పడినప్పుడు ఎంతో క్షోభ అనుభవించాం. ఆ రోజు మా అమ్మ.. ‘డబ్బు ఉంది కాబట్టి మనం పోరాడుతున్నాం. డబ్బు లేని వారి పరిస్థితి ఏమిటి?’ అని ప్రశ్నించారు. అప్పుడే ఈ ట్రస్ట్ ఆలోచన వచ్చింది’’ అని బాలకృష్ణ తెలిపారు. బాధ, భయంతో బసవతారకం హాస్పిటల్‌కు వచ్చిన వారు చిరునవ్వుతో తిరిగి వెళ్లాలనే ఉదాత్త ఆశయంతో తాము సేవలనందిస్తున్నామని వివరించారు. భారతదేశంలోనే మొట్టమొదటి బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాన్ని 14 పడకలతో అప్పట్లోనే ఏర్పాటుచేశామన్న ఆయన తమ ఈ ప్రయాణంలో ఎంతోమంది అండగా నిలిచారన్నారు. త్వరలోనే అమరావతిలో 21 ఎకరాలలో 1000 పడకల ఆస్పత్రి నిర్మించనున్నామని, మొదటి దశలో 500 పడకలను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య సేవలను మరింతగా అందుబాటులోకి తెస్తామన్నారు.