కస్తూర్బా విద్యాలయం విద్యార్థిని మృతి
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:38 AM
సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌లోని కస్తూర్బా గాంధీ విద్యాలయానికి చెందిన లాస్య(15) అనే పదో తరగతి విద్యార్థిని మరణించడం తీవ్ర కలకలం రేపింది
సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ పాఠశాలలో ఘటన
సిద్దిపేట రూరల్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌లోని కస్తూర్బా గాంధీ విద్యాలయానికి చెందిన లాస్య(15) అనే పదో తరగతి విద్యార్థిని మరణించడం తీవ్ర కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన లాస్య దసరా సెలవులకు ఇంటికి వెళ్లి ఈ నెల 24న తిరిగి పాఠశాలకు చేరుకున్నది. అయితే, రుతుక్రమం రావడంతో లాస్య అస్వస్థతకు గురైందంటూ ఆమె తండ్రి సంతో్‌షకు పాఠశాల సిబ్బంది బుధ వారం సమాచారం ఇచ్చారు. లాస్య తీవ్ర అస్వస్థతకు గురైందని, సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నామని గురువారం తెల్లవారుజామున మరోమారు చెప్పారు. ఈ మేరకు తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకోగా.. లాస్య అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. అయితే, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే లాస్య చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మరణ వార్త తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఆస్పత్రి మార్చురీ వద్ద నిరసన చేపట్టారు. తమ కుమార్తె మరణానికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ లాస్య తల్లిదండ్రులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.