Share News

యూరియా అధిక వినియోగంపై కేంద్రం చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Aug 26 , 2026 | 05:13 AM

రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారని, నేల ఆరోగ్యం దెబ్బతింటున్నదని, ఎరువుల ధరల వ్యత్యాసం వల్లే రైతులు యూరియా వైపు మొగ్గుచూపుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా యూరియా వినియోగం అసాధారణ స్థాయిలో పెరుగుతున్నదని తెలిపారు.

యూరియా అధిక వినియోగంపై కేంద్రం చర్యలు చేపట్టాలి

  • ఎరువుల ధరల వ్యత్యాసంతో యూరియా వైపు రైతుల మొగ్గు: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారని, నేల ఆరోగ్యం దెబ్బతింటున్నదని, ఎరువుల ధరల వ్యత్యాసం వల్లే రైతులు యూరియా వైపు మొగ్గుచూపుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా యూరియా వినియోగం అసాధారణ స్థాయిలో పెరుగుతున్నదని తెలిపారు. యూరియా అధిక వినియోగంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన యూరియా వినియోగం లెక్కలు వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. 2015-16 రాష్ట్రంలో యూరియా వినియోగం 14 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉంటే.. పదేళ్లలో 20.70 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగిందని తెలిపారు. యూరియా, డీఏపీకి అధిక సబ్సిడీ ఉండటమే వాడకం పెరగటానికి ప్రధాన కారణమని తెలిపారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి, రేషనలైజేషన్‌ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, స్పందన కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.

మిగిలిన జిల్లాల్లో ఎఫ్‌ఎఫ్ఎస్‌ యాప్‌

రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్‌(ఎఫ్ఎఫ్ఎస్‌) యాప్‌ అందుబాటులోకి వచ్చిందని, ఈనెలాఖరుకు మిగిలిన 10 జిల్లాల్లో కూడా యాప్‌ అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ బి. గోపి తెలిపారు. నిజమైన సాగుదారులు, సబ్సిడీపై అందించే అన్నిరకాల ఎరువులను బుక్‌ చేసుకునేందుకు ఈ యాప్‌ దోహదపడుతున్నదని, కేంద్ర ప్రభుత్వం యాప్‌ను ప్రతిష్ఠాత్మంగా అమలుచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.


వ్యవసాయ, ఉద్యానశాఖలు సమన్వయంతో పనిచేయాలి: కోదండరెడ్డి

కేంద్ర ప్రభుత్వ పథకాలు రైతులకు పూర్తిస్థాయిలో అందాలని, వ్యవసాయ, ఉద్యానశాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండరెడ్డి సూచించారు. బీఆర్‌కే భవన్‌లో మంగళవారం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో అమలు చేస్తున్న పథకాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పథకాల అమలు కాగితాలకే పరిమితం కాకూడదని, క్షేత్ర స్థాయిలో అమలవుతున్నాయా? లేదా? అని చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 05:16 AM