Share News

600 గజాలకే సెల్లార్‌!

ABN , Publish Date - Sep 11 , 2026 | 02:35 AM

రాష్ట్రంలో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు నిర్మించుకునేవారికి శుభవార్త. సెట్‌బ్యాక్‌ల తగ్గింపు.. తక్కువ స్థలమున్నా సెల్లార్‌ నిర్మించుకునేందుకు అనుమతించడం.. చిన్న నిర్మాణాలకు మార్టగేజ్‌ లేకుండా చేయడం, పెద్ద స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకూ మార్టగేజ్‌ శాతాన్ని ఇప్పుడున్న దానికంటే తగ్గించడం వంటి వెసులుబాట్లు కల్పించేందుకు సర్కారు సిద్ధమవుతోంది.

600 గజాలకే సెల్లార్‌!
CELLAR

  • సెట్‌బ్యాక్‌ల తగ్గింపు.. మార్టగేజ్‌ 10 నుంచి 5 శాతానికి తగ్గింపు

  • భవన నిర్మాణ నిబంధనలను సులభతరం చేయనున్న సర్కారు

  • సెట్‌బ్యాక్‌ల తగ్గింపుతో ఎక్కువ ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌కు చాన్స్‌

  • డేటా సెంటర్లు, హాస్టళ్లు, గోదాంల నిర్మాణానికి ప్రత్యేక నిబంధనలు

  • ఉల్లంఘనులపై చర్యలకు అన్ని శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్‌

  • టీడీఆర్‌ డేటా బ్యాంకు ఏర్పాటు.. అమ్మినా, కొన్నా రికార్డుల్లోకి

  • నగరాలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకీకృత నిబంధనలు

  • యూనిఫైడ్‌ బిల్డింగ్‌ రూల్స్‌తో నిర్మాణ రంగంలో కీలక మార్పులు

  • ఈ నెల 24 నాటికి సిద్ధమవనున్న ముసాయిదా

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు నిర్మించుకునేవారికి శుభవార్త. సెట్‌బ్యాక్‌ల తగ్గింపు.. తక్కువ స్థలమున్నా సెల్లార్‌ నిర్మించుకునేందుకు అనుమతించడం.. చిన్న నిర్మాణాలకు మార్టగేజ్‌ లేకుండా చేయడం, పెద్ద స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకూ మార్టగేజ్‌ శాతాన్ని ఇప్పుడున్న దానికంటే తగ్గించడం వంటి వెసులుబాట్లు కల్పించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఈమేరకు.. భవన నిర్మాణాలకు సంబంధించి ఇప్పుడున్న నిబంధనల్లో కీలక మార్పులు తేవాలని భావిస్తోంది. తద్వారా ప్రజలకు మేలు జరగడమే కాకుండా.. నిర్మాణాల్లో ఉల్లంఘనల సంఖ్య బాగా తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. అధికారులు, నిపుణులు దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించి, పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 24వ తేదీనాటికి ముసాయిదా నిబంధనలు తయారుకానున్నాయి.

భవన నిర్మాణాల కోసం ప్రస్తుతం ఉన్న జీవోనెం.168.. ఎప్పుడో 2012లో వచ్చింది. అనంతరం నిబంధనల్లో కొన్ని మార్పులు జరిగినా మూల జీవోకు సవరణలు చేయకుండా విడిగా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో కొన్ని విషయాల్లో సందేహాలు ఏర్పడుతున్నాయన్న అభిప్రాయం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడంతోపాటు.. ప్రజలకు మేలు చేసేలా కొంత వెసులుబాటు కల్పించేందుకు సర్కారు సిద్ధమైంది. అన్ని నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలు, పంచాయతీలు.. ఇలా అన్నింటికీ వర్తించేలా ఏకీకృత భవన నిర్మాణ నిబంధనలను రూపొందిస్తోంది.


ఇవీ వెసులుబాట్లు..

ప్రస్తుతం 750 చదరపు మీటర్లు...అంటే 900గజాలు ఉంటేనే సెల్లార్‌ నిర్మాణానికి అనుమతి లభిస్తోంది. అంతకంటే తక్కువ విస్తీర్ణం ఉన్న వాటికి స్టిల్ట్‌ ఫ్లోర్‌ మాత్రమే అనుమతి ఇస్తున్నారు. రాబోయే ఏకీకృత నిబంధనల్లో 500చదరపు మీటర్లు...అంటే 600గజాలు ఉంటే చాలు.. సెల్లార్‌కు కూడా అనుమతి ఇవ్వనున్నారు. దీనివల్ల పార్కింగ్‌ స్పేస్‌ పెరుగుతుంది. భవన యజమానులు ఇతరత్రా అవసరాలకు వాడుకోవడానికి ఎక్కువ స్థలం అందుబాటులోకి వస్తుంది.

భవన నిర్మాణం చేసేటప్పుడు నాలుగు వైపులా వదలాల్సిన ఖాళీ స్థలం(సెట్‌బ్యాక్‌)లనూ కుదించనున్నారు. ఈ సెట్‌బ్యాక్‌ల కుదింపు వల్ల నిర్మాణదారులకు ఎక్కువ ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్ఎస్ఐ) లభిస్తుంది. అంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు, భవనాలు నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

ప్రస్తుతం 75 గజాల వరకూ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టవచ్చు. ఇప్పుడు దానికి మించి.. ఒక పరిమితికి లోబడిన స్థలాల్లో కూడా అనుమతులు సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి భవనాలకు.. నిర్మాణ ప్రణాళికలు సరిగానే ఉన్నాయని అనుమతి ఉన్న ఇంజనీరు, కన్సల్టెంట్‌ ధ్రువీకరిస్తే సరిపోతుంది. మునిసిపల్‌ అధికారులు, సంబంధిత అధికారులు దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉండదు. అయితే అనుమతి తీసుకున్న ప్రకారమే సదరు భవనాలను నిర్మించేలా చూడాల్సిన బాధ్యత కూడా ఆ ఇంజనీర్లు, కన్సల్టెంట్ల మీదే ఉండేలా పెడితే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చ జరుగుతోంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ ఇంజనీర్లు, కన్సల్టెంట్లపై చర్యలు తీసుకోవడం, వారి లైసెన్సు రద్దు చేయడం లాంటి చర్యలు చేపట్టేలా ఏకీకృత నిబంధనల్లో మార్పులు తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.ట్రాన్స్‌ఫరబుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌(టీడీఆర్‌) బాండ్ల అమ్మకాలు, కొనుగోళ్లు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఆ లావాదేవీ ఒక చోట ప్రతిఫలించేలా ఏర్పాటుచేస్తారు. దీనికోసం ఒక టీడీఆర్‌ బ్యాంకును ఏర్పాటుచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులకు నిర్దేశించారు. జరిగిన లావాదేవీలు ఎప్పటికప్పుడు అందులో కనిపించేలా ఒక ఏర్పాటు చేయనున్నారు


ఐటీ డేటా సెంటర్లు, విపరీతంగా వస్తున్న హాస్టళ్లు, గోదాంలు లాంటివాటికి ప్రత్యేక నిబంధనలు తీసుకురావాలనే యోచనలో సర్కారు ఉంది. ఎక్కడపడితే అక్కడ.. ఎలా పడితే అలా నిర్మించిన భవనాల్లో హాస్టళ్లు పెట్టకుండా కట్టడి చేయనున్నారు.

మార్టగేజ్‌ నిబంధనలు ఇలా..

ప్రస్తుతం 240 చదరపు మీటర్లు.. అంతకంటే ఎక్కువ స్థలంలోగానీ కట్టిన నిర్మాణాల్లో 10 శాతం మునిసిపాలిటీ/ సంబంధిత ప్రభుత్వ విభాగానికి మార్టగేజ్‌ చేసేలా నిబంధనలున్నాయి. నిబంధనలకు అనుగుణంగా భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే ఈ మార్టగేజ్‌ను విడుదల చేస్తారు. అంటే నిర్మాణం పూర్తయ్యేవరకూ ఈ మార్టగేజ్‌ ఫ్లాట్లను నిర్మాణదారులు అమ్ముకోవడానికి వీలులేని పరిస్థితి. దీంతో పెట్టుబడిలో కొంత భాగం ఇరుక్కుపోతుందనే భావన ఉంది. ఈ నేపథ్యంలో.. మార్టగేజ్‌ నిబంధనల్లో మార్పులు తేవాలనే చర్చ అంతర్గతంగా నడుస్తోంది. 500 చదరపు మీటర్ల స్థలం వరకు నిర్మించే భవనాలకు అసలు మార్టగేజ్‌ అన్నదే లేకుండా చేయాలన్న అభిప్రాయం ఉంది. మరి మార్టగేజ్‌ లేకుంటే దాన్ని అలుసుగా తీసుకుని భవనాలను ఇష్టారాజ్యంగా కడితే? అనే ప్రశ్న తలెత్తుతోంది. అందుకే మార్టగేజ్‌ చేయాల్సిన అవసరం లేదుగానీ.. భవన నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేయాలని, ఆ సర్టిఫికెట్‌ చూపిస్తేనే విద్యుత్‌, నల్లా కనెక్షన్లు ఇచ్చేలా నిబంధనలు పెట్టాలని యోచిస్తున్నారు. 500 చదరపు మీటర్లకు మించిన స్థలాల్లో నిర్మించే భవనాలకు మార్టగేజ్‌ 10 నుంచి 5శాతానికి తగ్గించనున్నారు. అంటే ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం.. 20 ఫ్లాట్లు ఉన్న అపార్ట్‌మెంట్‌లో 10 శాతం (అంటే రెండు ఫ్లాట్లు) మునిసిపాలిటీకి మార్టగేజ్‌ చేయాల్సి ఉండగా.. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక ఒక ఫ్లాట్‌ మార్టగేజ్‌ చేస్తే సరిపోతుంది.

Updated Date - Sep 11 , 2026 | 02:35 AM