Share News

మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ ఇదే గతి!

ABN , Publish Date - Sep 19 , 2026 | 06:42 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతపై తెలంగాణ హైకోర్టు తీర్పును కేటీఆర్‌, హరీశ్‌రావు స్వాగతించారు; మిగతా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు తెలంగాణ భవన్‌ వద్ద సంబరాలు నిర్వహించాయి.

మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ ఇదే గతి!
Harish Rao reaction

  • కేటీఆర్‌ హెచ్చరిక.. హైకోర్టు తీర్పుపై హర్షం..

  • హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్‌ ద్వంద్వ నీతి బట్టబయలైంది

  • మిగతా ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ స్పందించాలి: హరీశ్‌

  • తెలంగాణ భవన్‌ వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల సంబరాలు

హైదరాబాద్‌, బంజారాహిల్స్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి.. కాంగ్రెస్‌ గూటికి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలందరికీ.. దానం నాగేందర్‌కు పట్టిన గతే పడుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చి తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘సత్యమేవ జయతే’ అని తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేల స్థానాల్లోనూ ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఇక.. తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్‌పై అనర్హతవేటు విధిస్తూ ఇచ్చినతీర్పు.. రాజ్యాంగం పట్ల అధికార కాంగ్రెస్‌ ద్వంద్వ నీతిని బట్టబయలు చేసిందని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ఈ వ్యవహారంలో స్పీకర్‌ తీరుపై హైకోర్టు తీర్పు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని ‘ఎక్స్‌’ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు.


ప్రజల తీర్పును, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన స్పీకర్‌ వ్యవస్థ.. అందుకు విరుద్థంగా దానం నాగేందర్‌కు రక్షణ కవచంగా నిలవడం దురదృష్టకరమన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్‌ కనీసం ఇప్పుడైనా స్పందించాలని.. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించిన ఇతర ఎమ్మెల్యేలందరిపై ఉన్న అనర్హత పిటిషన్ల మీద రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. దేశమంతా తిరిగి తానేదో రాజ్యాంగాన్ని రక్షించే చాంపియన్‌ని అని చెప్పుకొనే రాహుల్‌ గాంధీ కపట నాటకాలు ఈ ఘటనతో బహిర్గతమయ్యాయన్నారు.


‘‘ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయిస్తే ఆటోమేటిక్‌గా అనర్హత వేటు పడేలా 10వషెడ్యూల్‌ను సవరిస్తామని కాంగ్రెస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో గొప్పలు చెప్పింది. అదే పార్టీ.. తెలంగాణ కాంగ్రె్‌సలో ఫిరాయింపులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉంది?’’ అని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌కు నిజంగా రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే.. పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలందరితో వెంటనే రాజీనామా చేయించి, మళ్లీ ప్రజల తీర్పుకోరేలా సీఎం రేవంత్‌ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.


ఇక.. దానంపై హైకోర్టు తీర్పు బీఆర్‌ఎ్‌సకు దక్కిన విజయమని, కాంగ్రెస్‌ పార్టీకి చెంపపెట్టు అని ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దానం లాగానే పార్టీ ఫిరాయించిన మిగిలిన 8 మంది పైనా అనర్హత వేటు పడేవరకూ పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా.. దానంపై అనర్హత వేటువేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం తెలంగాణ భవన్‌ వద్ద సంబరాలు నిర్వహించారు. బాణాసంచా పేలుస్తూ దానం నాగేందర్‌, కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

సాయం చేస్తూ మృత్యుఒడికి..
వ్యవసాయంతోనే ప్రపంచ గమనం

Updated Date - Sep 19 , 2026 | 06:50 AM