రాష్ట్రంలో బీజేపీ ఆట మొదలైంది!
ABN , Publish Date - Nov 21 , 2026 | 04:28 AM
తెలంగాణలో బీజేపీ ఆట మొదలైందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తాం.. ఆ పార్టీలకు తెలంగాణ బిడ్డలెవరూ ఓటెయ్యరు
రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తాం
రాహుల్‌ది దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే అజెండా
ప్రధానిపై ద్వేషంతో దేశంపై విషం చిమ్ముతున్నారు:కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ ఆట మొదలైందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తామని చెప్పారు. ఆ రెండు పార్టీల కుటుంబ, అవినీతి, దోపిడీ పాలన గురించి తెలిసిన ఏ తెలంగాణ బిడ్డా ఇకపై వారికి ఓటు వేయరని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అవినీతి పాలనకు చరమగీతం పాడి, నిజమైన అభివృద్ధి, సంక్షేమాన్ని బీజేపీ మాత్రమే అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 ఎంపీ, 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచి తెలంగాణలో బీజేపీ లేదన్న వారికి గట్టి సమాధానం చెప్పామని గుర్తుచేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీనే గెలుస్తుందన్నారు.
మెరుగైన విద్యుత్, ఉచిత బియ్యం, ఉచిత వైద్యం, మెరుగైన శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాల కల్పనతో తెలంగాణను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రధాని మోదీపై ద్వేషంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కుట్రపూరిత ఆలోచనతో దేశంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ప్రజలు వరుసగా మూడుసార్లు ఓడించినా, వంద ఎన్నికల్లో ఓడి ‘సెంచరీ డిఫీటెడ్ లీడర్’గా మారినా రాహుల్ గాంధీలో పశ్చాత్తాపం, మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. రాబోయే వంద ఎన్నికల్లోనూ కాంగ్రె్‌సకు చిరునామా ఉండదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని చెప్పారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని రాహుల్ మాట్లాడడం విడ్డూరమని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ నివేదికలు భారత్ వృద్ధిని ప్రశంసిస్తుంటే, రాహుల్ అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘తుక్డే తుక్డే గ్యాంగ్’తో చేతులు కలిపి దేశంలో అశాంతిని రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో భారత ప్రధాని విదేశాలకు వెళ్తే అప్పుల కోసమే వచ్చారనే భావన ఉండేదని కిషన్‌రెడ్డి చెప్పారు. నేడు మోదీ నాయకత్వంలో జీ20, బ్రిక్స్, క్వాడ్, ఎస్‌సీవో వేదికల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తూ ప్రపంచ గౌరవాన్ని పొందుతోందని తెలిపారు. నెహ్రూ హయాంలో 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని (అక్సాయ్‌చిన్) చైనాకు అప్పగించిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు.