‘22ఏ’ పేరిట వ్యవస్థీకృత భూదోపిడీ
ABN , Publish Date - Oct 16 , 2026 | 02:39 AM
రాష్ట్రంలో 22-ఏ (నిషేధిత జాబితా) పేరుతో వ్యవస్థీకృత భూదోపిడీ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అవినీతి సంపాదనకు ప్రధాన ఆదాయ వనరు అదే..
లక్షల మంది భూ యజమానులు, రైతులకు తీవ్ర వేధింపులు
బాధితులందరికీ న్యాయం చేయాల్సిందే: రాంచందర్‌రావు
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలున్నాయి: ఏలేటి
రేవంత్ ఉద్యోగం ఊడగొట్టేందుకు ప్రజలు సిద్ధం: రఘునందన్
హైదరాబాద్/తొగుట, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 22-ఏ (నిషేధిత జాబితా) పేరుతో వ్యవస్థీకృత భూదోపిడీ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు దుయ్యబట్టారు. లక్షలాది మంది భూ యజమానులు, రైతులు తీవ్ర వేధింపులకు గురవుతున్నారన్నారు. పట్టా భూము లు, వ్యవసాయ క్షేత్రాలు, ప్లాట్లను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ, వాటి తొలగింపు పేరుతో భారీ అవినీతి దందాకు తెరలేపారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో భూ కుంభకోణాలు జరిగాయంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. 22-ఏ నిషేధిత జాబితా అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి సంపాదనకు ప్రధాన వనరుగా మారిందని ఆరోపించారు. క్రమబద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగి.. 20-30 ఏళ్లుగా ప్రజల ఆధీనంలో ఉన్న వ్యవసాయ భూములు, ప్లాట్లను సైతం 22-ఏ జాబితాలో చేరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 22-ఏ నిషేధిత జాబితాలో భూముల చేర్పు, తొలగింపుల ప్రక్రియలో ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అన్నీ కుంభకోణాలే: ఏలేటి
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు కొనసాగుతున్నాయని ఏలేటి ధ్వజమెత్తారు. అందుకే.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూదందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం లేదన్నారు. ధరణి నుంచి భూభారతి వరకు సాగిన భూకుంభకోణాలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఫోరెన్సిక్ ఆడిట్లో భయంకర వాస్తవాలున్నట్లు ప్రకటించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి.. ఆ వివరాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదని నిలదీశారు. ‘రాష్ట్రంలో 66,33,313 ఎకరాల అటవీ భూమి ఉండాల్సి ఉండగా, 42,53,532 ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉందని మంత్రి చెప్పారు. ఆ మిగిలిన 23,79,781 ఎకరాల అటవీ భూమి ఏమైంది..? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కోటి 79 లక్షల ఎకరాల విలువైన భూదాన్ భూములుండగా, వాటిని 22ఏ జాబితాలో ఎందుకు ప్రదర్శించలేదో స్పష్టత ఇవ్వడం లేదు?’ అని ప్రశ్నించారు. ‘పూలగూడలోని సర్వే నం.285, 286, 287 పరిధిలోని భూమిని ఎవాక్యూ ప్రాపర్టీ అని పేర్కొంటూ 2025 నవంబరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించింది. కానీ, రెవెన్యూ మంత్రి కుటుంబానికి చెందిన ‘నోవా బై రాఘవ’ ఎంట్రీ ఇవ్వగానే తిరస్కరించిన భూమికే ల్యాండ్ కన్వర్షన్, హైరైజ్ బిల్డింగ్ అనుమతులన్నీ రాత్రికి రాత్రే వచ్చేయడం.. అధికార దుర్విని యోగం కాదా?’ అని నిలదీశారు. ‘కరెంటు ఇయ్యకపోతే ఉద్యోగాలు తీసేస్తామని కాంగ్రెస్ నాయకత్వం హైదరాబాద్‌లో కూర్చోని అధికారులను బెదిరిస్తోంది.. వాళ్ల ఉద్యోగాలు పోతాయో లేదో కానీ.. ఇంకో ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ నేతలతో పాటు రేవంత్‌రెడ్డి ఉద్యోగం ఊడగొట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు’ అని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు.
24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రజలను అరిగోసలు పెడుతోందని ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఎల్.బంజర్‌పల్లి, చందాపూర్, వరదరాజుపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు, భూమి పూజతో పాటు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ పల్లెటూరుకు పోయినా కనీసం 12 గంటల కరెంటు వస్తలేదని, ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోతున్నాయని రైతులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు లేవు, పింఛన్లు పెంచలేదు, రోడ్లు బాగు చేయలేదు.. ఇదేనా మూడేళ్ల కాంగ్రెస్ పాలన అని నిలదీశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ధరణి, భూభారతిలో లక్షల ఎకరాల దోపిడీ: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి