రైతుల భూ సమస్యలకు భూ భారతి పరిష్కారం: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:35 PM
రైతుల భూములకు భద్రత కల్పించడమే లక్ష్యంగా భూ భారతి సర్వే చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రైతులతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి.. భూ సమస్యలను తెలుసుకుని, గతంలో ధరణి వ్యవస్థలో జరిగిన తప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం, ఆగస్టు 20: జిల్లాలోని సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో భూ రీ-సర్వేపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని మొత్తం ఏడు గ్రామాల్లో భూ భారతి కార్యక్రమం కింద భూ సర్వే ప్రారంభమైనట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భూమి లేకపోయినా బోగస్ పాస్‌పుస్తకాలు సృష్టించి రైతుబంధు నిధులు స్వాహా చేసిన ఘటనలు ఉన్నాయని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా భూ భారతి ద్వారా సర్వే చేపడుతున్నామని స్పష్టం చేశారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 70 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నామని, ప్రతి ఆరు నెలలకు 70 గ్రామాల చొప్పున సర్వే కొనసాగించి ఏడాదిన్నర కాలంలో ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.
సర్వే ప్రక్రియలో రెవెన్యూ అధికారులు నిరంతరం కష్టపడుతున్నారని.. పూర్తయిన భూ వివరాలను కంప్యూటరీకరణ చేస్తున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. భూ భారతి చట్టాన్ని రైతులకు ఉపయోగపడేలా రూపొందించామని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ధరణి వ్యవస్థలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, వాటికి స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. రంగులు వేరైనా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనంటూ రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయ బంధాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రైతుల భూములకు భద్రత కల్పించడంతో పాటు భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే భూ భారతి సర్వే ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.