Share News

బీడీఎల్‌ టెండరు.. గోల్‌మాల్‌!

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:53 AM

ప్రభుత్వరంగ రక్షణ సంస్థ ‘భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌’ (బీడీఎల్‌).. తాము రూపొందించే క్షిపణులకు అవసరమైన ‘ఆప్టికల్‌ సైట్స్‌’ సరఫరా టెండరును ఏకపక్షంగా ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టటం తీవ్ర సంచలనం రేపుతోంది.

బీడీఎల్‌ టెండరు.. గోల్‌మాల్‌!
bdl

  • క్షిపణుల కోసం 300 ఆప్టికల్‌ సైట్స్‌ కొనుగోలు

  • కాంట్రాక్టు మాజీ సీఎండీ కంపెనీకి అప్పగింత

  • ఇతర సంస్థలు పాల్గొనకుండా ‘సింగిల్‌ టెండర్‌’

  • ‘అయిండ్రి డిఫెన్స్‌ అడ్వైజరీ’ కంపెనీకి దక్కిన అవకాశం

  • ఆ కంపెనీ యజమాని బీడీఎల్‌ మాజీ సీఎండీ సిద్ధార్థ

  • మిశ్రా భార్య శాంభవి.. టెండరు విలువ 56.8 కోట్లు

  • ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పరిశోధనాత్మక కథనం

హైదరాబాద్‌, అక్టోబరు 15: ప్రభుత్వరంగ రక్షణ సంస్థ ‘భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌’ (బీడీఎల్‌).. తాము రూపొందించే క్షిపణులకు అవసరమైన ‘ఆప్టికల్‌ సైట్స్‌’ సరఫరా టెండరును ఏకపక్షంగా ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టటం తీవ్ర సంచలనం రేపుతోంది. ఆ ప్రైవేటు కంపెనీ బీడీఎల్‌ మాజీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)కు సంబంధించినది కావటం గమనార్హం. ఇంగ్లిష్‌ దినపత్రిక ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ తాజాగా ఈ టెండరు వివరాలను బయటపెట్టింది. వాటి ప్రకా రం.. హైదరాబాద్‌కు చెందిన బీడీఎల్‌ తాము తయారుచేసే క్షిపణులకు అవసరమైన 300 ఆప్టికల్‌ సైట్స్‌ను సరఫరా చేసే బాధ్యతను ఈ ఏడాది మేలో ‘అయిండ్రి డిఫెన్స్‌ అడ్వైజరీ ప్రైవేటు లిమిటెడ్‌’ అనే కంపెనీకి అప్పగించింది. ఏడు నెలల వ్యవధిలో ఆప్టికల్‌ సైట్స్‌ను సరఫరా చేయాలన్నది ఒప్పందం. ఈ టెండరు విలువ రూ.56.8 కోట్లు. సదరు కంపెనీ తొలుత సరఫరా చేసిన 5 శాంపిల్‌ యూనిట్లను పరీక్షించి ఈ టెండరు కట్టబెట్టారు. అయితే, ఈ టెండరు కోసం ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలను బీడీఎల్‌ ఆహ్వానించలేదు. పోటీ లేకుండా కేవలం ‘అయిండ్రి డిఫెన్స్‌’ కంపెనీకి మాత్రమే దక్కేలా సింగిల్‌ టెండర్‌ను జారీ చేసింది. ఆప్టికల్‌ సైట్స్‌ను వీలైనంత త్వరగా సమకూర్చుకోవాల్సిన ‘అత్యవసరం’ నేపథ్యంలోనే సింగిల్‌ టెండర్‌కు వెళ్లినట్లుగా బీడీఎల్‌ పేర్కొంది. కేంద్రప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్‌ పోర్టల్‌ ప్రకారం.. ఈ ఆర్డర్‌కు సంబంధించి అయిండ్రి డిఫెన్స్‌ కంపెనీకి సాంకేతిక మదింపులో ఇప్పటికే అనుమతి లభించింది. ప్రస్తుతం ఆర్థిక మదింపులో ఉంది.


రిటైరైన మరుసటి ఏడాదే కంపెనీ ఏర్పాటు

అయిండ్రి డిఫెన్స్‌ అడ్వైజరీ కంపెనీని 2024 మే నెలలో సిద్ధార్థ మిశ్రా, ఆయన భార్య శాంభవి చెరో 50 శాతం వాటాతో ఏర్పాటు చేశారు. సిద్ధార్థ మిశ్రా అంతకు ముందు ఏడాది 2023 మార్చిలో బీడీఎల్‌ సీఎండీగా నాలుగేళ్లపాటు పని చేసి రిటైరయ్యారు. సొంత కంపెనీని నెలకొల్పాక దాంట్లో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2025 జనవరిలో కోల్‌కతాలోని ‘నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌’లో సభ్యుడు (టెక్నికల్‌)గా సిద్ధార్థ మిశ్రా నియమితులయ్యారు. దాంతో, సొంత కంపెనీ నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచీ ఆ కంపెనీలో 95 శాతం వాటా శాంభవి పేరు మీద, మిగిలిన 5 శాతం కౌశికి నందన్‌ వాత్సాయన పేరు మీద కొనసాగుతోంది. కాగా, ప్రస్తుత బీడీఎల్‌ ఏకపక్ష టెండరు నేపథ్యంలో సిద్ధార్థ మిశ్రా, శాంభవిలను సంప్రదించటానికి తాము ప్రయత్నించినా స్పందించలేదని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ తెలిపింది. ఈమెయిల్‌ అడ్రస్‌కు ప్రశ్నలు పంపించినా స్పందన రాలేదని పేర్కొంది. హైదరాబాద్‌ కుషాయిగూడలో ఉన్న ‘జాతీయ చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్‌’ క్యాంపస్‌లో ఉన్న అయిండ్రి కంపెనీ ఆఫీసుకు వెళ్తే అది తాళం వేసి ఉందని వెల్లడించింది. కాగా, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లోని వివరాల ప్రకారం.. అయిండ్రి ఆఫీసు తొలుత మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోని యాప్రాల్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉండేదని, దానిని ఈ ఏడాది ఏప్రిల్‌లో కుషాయిగూడకు మార్చారని తెలిసింది. యాప్రాల్‌ ఫ్లాటు సిద్ధార్థమిశ్రా, శాంభవి పేర్ల మీద ఉన్నట్లు వెల్లడైంది. ఆ ఫ్లాటు వద్దకు వెళ్లినప్పుడు అది ఖాళీగా ఉందని, దాంట్లో మరమ్మతులు జరుగుతున్నాయని అక్కడి సెక్యూరిటీ గార్డు వెల్లడించినట్లు ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేర్కొంది. అయిండ్రి కంపెనీ 2024-25 బ్యాలెన్స్‌ షీట్‌ ప్రకారం కంపెనీ ఆదాయం రూ.44.43 లక్షలని, దాంట్లో రూ.2.89 లక్షలు లాభం గడించినట్లు పేర్కొన్నట్లు తెలిపింది.


మరోవైపు, అయిం డ్రి కంపెనీకి టెండరు ఇచ్చిన బీడీఎల్‌ కూడా తమ ప్రశ్నలకు స్పందించలేదని వెల్లడించింది. కౌశికి నందన్‌ వాత్సాయన మాత్రం.. బీడీఎల్‌ టెండరుకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్నీ వెల్లడించలేనని తెలిపారని పేర్కొంది. కాగా, ట్యాంకు విధ్వంసక క్షిపణుల్లో ఆప్టికల్‌ సైట్స్‌ను వాడుతారు. ఇవి క్షిపణికి కన్నులా పని చేస్తాయి. ఆప్టికల్‌ సైట్‌లో లెన్సులు ఉంటాయి. క్షిపణిని ప్రయోగించే ఆపరేటర్‌.. లక్ష్యాన్ని గుర్తించి, దానిని సరిగ్గా గురి పెట్టటంలో ఆప్టికల్‌ సైట్‌ పాత్ర కీలకం.

ఈసారి వైఖరి మార్చుకొని..

క్షిపణులకు అవసరమైన ఆప్టికల్‌ సైట్స్‌ను బీడీఎల్‌ 2024, 2025లలో కూడా కొనుగోలు చేసింది. ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే పోటీ పడేలా నాడు టెండరు జారీ చేసింది. ఆ రెండేళ్లలోనూ రక్షణశాఖ పరిధిలోని మినీరత్న ప్రభుత్వరంగ సంస్థ ‘ఇండియా ఆప్టెల్‌ లిమిటెడ్‌’ టెండరును దక్కించుకుంది. కానీ, ఈ ఏడాది మాత్రం బీడీఎల్‌ తన వైఖరి మార్చుకొని.. ఎలాంటి పోటీ లేకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనే అవకాశం కూడా ఇవ్వకుండా, ప్రైవేటు కంపెనీ అయిన అయిండ్రి డిఫెన్స్‌ అడ్వైజరీకి టెండరును కట్టబెట్టింది.

ఈ వార్తలు కూడా చదవండి

ధరణి, భూభారతిలో లక్షల ఎకరాల దోపిడీ: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఉద్యోగం ఊడుద్ది.. జాగ్రత్త!

Updated Date - Oct 16 , 2026 | 01:53 AM