Share News

సాధారణ ఖైదీలతోనే భగీరథ్‌

ABN , Publish Date - May 18 , 2026 | 03:36 AM

పోక్సో కేసులో జ్యుడీషియల్‌ కస్టడీకి వచ్చిన బండి సాయి భగీరథ్‌ను చర్లపల్లి సెంట్రల్‌ జైలు అధికారులు సాధారణ ఖైదీలతోనే ఉంచారు.

సాధారణ ఖైదీలతోనే భగీరథ్‌

  • విచారణ ఖైదీలు ఉండే బ్యారక్‌ కేటాయింపు

  • ప్రత్యేక సౌకర్యాలేవీ లేవన్న జైలు అధికారులు

  • మాంసాహార భోజనానికి భగీరథ్‌ నిరాకరణ

  • పాలు, బ్రెడ్డుతో సరిపెట్టుకున్న తీరు!

  • ఆదివారం కావడంతో ములాఖత్‌లోనూ ఎవరూ కలవడానికి రాలేదన్న జైలు సిబ్బంది

  • భగీరథ్‌ ఫోన్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు

  • బాధితురాలి తల్లి ఇచ్చిన ఆధారాలు కూడా..

  • పది రోజులు కస్టడీ కోరనున్న పోలీసులు

  • బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో..బండి సంజయ్‌ వాంగ్మూలం తీసుకునే చాన్స్‌!

హైదరాబాద్‌/ కుషాయిగూడ, మే 17 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో జ్యుడీషియల్‌ కస్టడీకి వచ్చిన బండి సాయి భగీరథ్‌ను చర్లపల్లి సెంట్రల్‌ జైలు అధికారులు సాధారణ ఖైదీలతోనే ఉంచారు. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలూ కల్పించకుండా.. విచారణ ఖైదీలు ఉండే బ్యారక్‌నే ఆయనకు కేటాయించారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్‌కు కోర్టు రెండు వారాలు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు శనివారం అర్ధరాత్రి తర్వాత రెండు గంటల సమయంలో భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తీసుకువెళ్లారు. జైలు అధికారులు దాదాపు గంటపాటు ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు, ఇతర ఫార్మాలిటీలు పూర్తి చేశారు. తర్వాత నేరుగా విచారణ ఖైదీలు ఉండే బ్యారక్‌కు తరలించారు. భగీరథ్‌కు ఎలాంటి ‘ప్రత్యేక’ సదుపాయాలు కల్పించలేదని చర్లపల్లి జైలు అధికారులు తెలిపారు. అయితే భగీరథ్‌ను ఉంచిన బ్యారక్‌లోని విచారణ ఖైదీలు కాకుండా ఇతర ఖైదీలెవరూ అటువైపు వెళ్లకుండా ఏర్పాటు చేశారని, జైళ్లశాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చారని సమాచారం. ఇక జైలులో ఖైదీలకు రోజువారీగా ఇచ్చే అల్పాహారం తీసుకోలేదని, ఆదివారం పెట్టే మాంసాహార భోజనాన్ని తినలేదని సమాచారం. జైలు క్యాంటీన్‌ నుంచి తెప్పించుకున్న పాలు, బ్రెడ్డు తిని సరిపెట్టుకున్నట్టు తెలిసింది. కాగా, భగీరథ్‌ కేసులో దర్యాప్తు, సేకరించిన ఆధారాలు, నిందితుడి నుంచి తెలుసుకోవాల్సిన అంశాలు, సేకరించాల్సిన ఆధారాలపై సిట్‌ అధికారి రితిరాజ్‌, ఇతర ఉన్నతాధికారులు ఆదివారం సమీక్షించారు.


భగీరథ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌ను సాంకేతిక ఆధారాల కోసం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్ఎల్‌)కు పంపించాలని నిర్ణయించారు. బాధిత బాలిక తల్లి వాంగ్మూలం నమోదు సమయంలో న్యాయస్థానంలో అందచేసిన సాక్ష్యాధారాలను కూడా ఎఫ్‌ఎ్‌సఎల్‌కు పంపిస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక బండి భగీరథ్‌ను పది రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. దీనిపై కసరత్తు జరుగుతోందని, 19న కోర్టులో కస్టడీ పిటిషన్‌ వేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. భగీరథ్‌ అరెస్టు, రిమాండ్‌ హడావుడిగా జరిగిన నేపథ్యంలో.. ఆయన నుంచి అవసరమైన వివరాలు సేకరించకపోయామని, కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కీలక వివరాలు, ఆధారాలు లభించే అవకాశం ఉందని వివరించారు. బాధితురాలు ఫిర్యాదులో ఆరోపణలు చేసిన ప్రదేశాలకు నిందితుడిని తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సైతం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న మాజీ జర్నలిస్టు సంగప్ప, కేంద్రమంత్రి బండి సంజయ్‌ నుంచీ దర్యాప్తు అధికారులు వాంగ్మూలాలు సేకరించే అవకాశం ఉందని సమాచారం.

Updated Date - May 18 , 2026 | 03:36 AM