కులమతాలకు అతీతంగా కలిపే వేదిక.. అలాయ్ బలాయ్: బండారు దత్తాత్రే
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:46 PM
కులమతాలు, రాజకీయాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలందరినీ ఆత్మీయంగా కలిపే వేదిక అలాయ్ బలాయ్ అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. విభేదాలను పక్కనపెట్టి అందరూ కలిసిమెలిసి పండుగ శుభాకాంక్షలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 22: కులమతాలు, రాజకీయాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే కార్యక్రమమే అలాయ్ బలాయ్ అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తుల మధ్య ఎన్ని భిన్నాభిప్రాయాలు, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి ఆత్మీయంగా కలుసుకోవాలని, ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోవాలని పిలుపునిచ్చారు.
స్నేహభావం, ఐక్యతను పెంపొందించడమే అలాయ్ బలాయ్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ఈ పండుగ స్ఫూర్తితో సమాజంలో సోదరభావం, సామరస్యం మరింత బలపడాలని ఆకాంక్షించారు. వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ విభేదాలు ఏవైనా.. పండుగల వేళ అందరూ కలిసి ఆనందాన్ని పంచుకోవాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందిస్తుందని వివరించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతూ అభివృద్ధి చెందాలని బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని.. ప్రాంతీయ భేదాలకు తావులేకుండా ఐకమత్యంతో ప్రగతి సాధించాలని అన్నారు. ఈసారి ‘నషా ముక్త్ భారత్.. వికసిత్ భారత్’ నినాదంతో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణంతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పండుగలు కేవలం సంబరాలకే పరిమితం కాకుండా సమాజానికి మంచి సందేశాన్ని అందించే వేదికలుగా నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ, పరస్పర ప్రేమాభిమానాలను పంచుకుంటూ సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
స్థానిక ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం గొడ్డలి పార్టీకి లేదు: బోండా ఉమ
విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం
Read Latest AP News And Telugu News