విద్యార్థి సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు: బల్మూర్ వెంకట్
ABN , Publish Date - Jul 23 , 2026 | 03:42 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని, గత ఘటనలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జులై 23: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థులపై జరిగిన దాడిని బీఆర్ఎస్ ఖండించలేదని, బీజేపీని ప్రశ్నించే ధైర్యం కూడా ఆ పార్టీకి లేదని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ మహాధర్నా చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. శాంతియుతంగా నిరసనలు చేపడితే ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించదని, కానీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
CO-EMT సంస్థ తెలంగాణలోనే పుట్టిందని, ఆ సంస్థతో కేటీఆర్‌కు సంబంధాలున్నాయని బల్మూర్ వెంకట్ ఆరోపించారు. ఆ సంస్థ నిర్మించిన ఫామ్‌హౌస్‌లోనే కేటీఆర్ ఉంటున్నారని, సంస్థకు సంబంధించిన భూములు కూడా ఆయన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే 2019లో ఇంటర్ పరీక్షల నిర్వహణకు గ్లోబరీనా సంస్థకు అక్రమంగా టెండర్లు కేటాయించారని, ఆ సంస్థపై జేఎన్‌టీయూ హైదరాబాద్, జేఎన్‌టీయూ కాకినాడలో కేసులు నమోదైనా చర్యలు తీసుకోలేదన్నారు. 26 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వ్యవస్థపై అప్పటి ప్రభుత్వం స్పందించలేదని, దీనిపై కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. CO-EMT కొత్త పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేసి సీబీఎస్‌ఈతో కూడా వ్యవహరిస్తోందని బల్మూర్ వెంకట్ ఆరోపించారు. ఇప్పుడు విద్యార్థుల కోసం పోరాడుతున్నట్లు కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కూడా కేటీఆర్ ప్రమేయంపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో పేపర్ లీకేజీలు ఎక్కువగా జరిగాయని విమర్శించారు.
బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం పదిరోజుల ముందే దుబాయ్ ట్రిప్..
ఇదిలా ఉంటే.. కేటీఆర్ బర్త్‌డే వేడుకలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బల్మూర్ వెంకట్. కేటీఆర్ తన పుట్టిన రోజు కోసం పదిరోజుల ముందే దుబాయ్ వెళ్లారని, అక్కడ సినీ పరిశ్రమకు చెందిన కొందరితో కలిసి బర్త్‌డే పార్టీ జరుపుకున్నారని అన్నారు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మూడు రోజుల పాటు పూర్తిగా రెస్ట్ మోడ్‌లో ఉన్నారని, ఆ తర్వాత ఒక్కసారిగా విద్యార్థుల ధర్నా పేరుతో డ్రామా ప్రారంభించారని బల్మూరి వెంకట్ విమర్శించారు. విద్యార్థుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
నెతన్యాహు ఓ వార్ క్రిమినల్.. అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేయాలి: న్యూయార్క్ మేయర్
పసిడి ధరలు మరికొంత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..