అప్రూవర్‌గా అర్వింద్‌కుమార్?
ABN , Publish Date - Mar 01 , 2026 | 02:35 AM
ఫార్ములా- ఈ రేసు కేసుకు సంబంధించి కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ అప్రూవర్‌గా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఫార్ములా- ఈ రేసు కేసులో కీలక పరిణామం
హైదరాబాద్, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఫార్ములా- ఈ రేసు కేసుకు సంబంధించి కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ అప్రూవర్‌గా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అర్వింద్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో ఈ కేసుకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో కొద్ది రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ఏసీబీ సిద్ధమౌతోంది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్, అర్వింద్‌కుమార్, పదవీ విరమణ చేసిన మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డితో పాటు మరో ముగ్గురి పేర్లను నిందితులుగా ఏసీబీ అధికారులు చేర్చనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ కేసులో తనను అప్రూవర్‌గా మార్చుకోవాలని అర్వింద్‌కుమార్ వివిధ వర్గాల ద్వారా ఏసీబీ ఉన్నతాధికారులను సంప్రదించినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడం, ఆ తర్వాత అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర డీఓపీటీ కూడా లైన్ క్లియర్ చేయడంతో ఏసీబీ అధికారులు తుది చర్యలకు సన్నద్ధమవుతున్నారు. ఫార్ములా- ఈ రేసు కేసులో ఇప్పటికే మనీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ పూర్తి చేయడంతో ఏసీబీ తర్వాత ఈడీ కూడా న్యాయస్ధానంలో ఛార్జిషీట్ దాఖలు చేయవచ్చని తెలుస్తోంది.