Share News

భయపెడుతున్న ఏఐ ఆధారిత సైబర్‌ నేరాలు

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:04 AM

సీబీఐ అధికారిని అంటూ ఓ ప్రభుత్వ ఇంజనీర్‌కు ఇటీవల ఓ వ్యక్తి కాల్‌ చేశాడు. నకిలీ డాక్యుమెంట్లు పంపాడు. కృత్రిమ మేధ(ఏఐ)ని ఉపయోగించి వీడియో కాల్‌...

భయపెడుతున్న ఏఐ ఆధారిత సైబర్‌ నేరాలు

  • వ్యక్తులు, సంస్థలే కాదు...ప్రభుత్వ వ్యవస్థలకూ ముప్పు

  • డిజిటల్‌ లావాదేవీలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం

  • తాగునీరు, విద్యుత్తు, బ్యాంకింగ్‌, రైల్వేలకు ముప్పు

  • రాజకీయ అస్థిరతతోనూ సైబర్‌ దాడులు పెరిగే చాన్స్‌

  • ‘సైబర్‌ సెక్యూరిటీ’ నివేదిక

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): సీబీఐ అధికారిని అంటూ ఓ ప్రభుత్వ ఇంజనీర్‌కు ఇటీవల ఓ వ్యక్తి కాల్‌ చేశాడు. నకిలీ డాక్యుమెంట్లు పంపాడు. కృత్రిమ మేధ(ఏఐ)ని ఉపయోగించి వీడియో కాల్‌ బ్యాగ్రౌండ్‌ను సీబీఐ కార్యాలయంలా సృష్టించాడు. వీడియో కాల్‌లో అదంతా చూసి నిజమేనని భయపడిన సదరు ఇంజనీర్‌ ఆ సైబర్‌ నేరగాడికి రూ.1.33 కోట్లు సమర్పించుకున్నాడు. మరో ఘటనలో కోర్టు సెట్‌పతో ప్రభుత్వ ఉద్యోగిని వీడియో కాల్‌లో బెదిరించిన ఓ సైబర్‌ నేరగాడు రూ.46లక్షలు కొట్టేశాడు.

ఇంతేనా..!! ఫలానా పథకంలో పెట్టుబడి పెడితే పదింతలు లాభాలు చూస్తారంటూ సాక్ష్యాత్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెబుతున్నట్టుగా ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన డీప్‌ ఫేక్‌ వీడియో గుర్తుంది కదా..!! అది నకిలీ వీడియో అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ చాలా మంది దానిని చూసి మోసపోతూనే ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మోసాలు..

ఏఐతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అదే సమయంలో అంతే ముప్పు పొంచి ఉందనడానికి ఉదాహరణలు ఈ ఘటనలు. ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లకు ఏఐ బ్రహ్మాస్త్రంలా మారగా.. ఏఐ ఆధారిత సైబర్‌ నేరాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ తరహా మోసాల వల్ల బ్యాంకు ఖాతాలో డబ్బు, కంపెనీ సమాచారం, ప్రభుత్వ సమాచారం... ఏదైనా సరే ఒక్క క్షణంలో మాయమైపోయే ముప్పు పొంచి ఉంది. మొత్తంగా ఏఐ వినియోగం కత్తి మీద సాములాంటిదని.. ‘గ్లోబల్‌ సెక్యూరిటీ అవుట్‌లుక్‌-2026’ నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వేదిక, ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్‌ సాయంతో చేసిన ఈ సర్వే విస్తుపోయే విషయాలను వెల్లడించింది.


ముంచుకొస్తున్న ముప్పు

సైబర్‌ నేరగాళ్లు కేవలం వ్యక్తులనే కాదు దేశానికి వెన్నెముక నిలిచే రంగాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. గ్లోబల్‌ సెక్యూరిటీ అవుట్‌ లుక్‌ నివేదిక ప్రకారం.. తాగునీరు, విద్యుత్‌, బ్యాంకింగ్‌, రైల్వే, టెలికామ్‌ వ్యవస్థలపై భవిష్యత్తులో సైబర్‌ దాడులు జరిగే ఆస్కారం ఉంది. అలాగే, శత్రుదేశాల క్షిపణులను గుర్తించే రేడార్‌ వ్యవస్థలను తప్పు దోవ పట్టించే ప్రమాదం కూడా ఉంది. 2025లో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 73 శాతం మంది తాము ఏదో ఒక రూపంలో సైబర్‌ మోసాల బారిన పడ్డామని తెలిపారు. భవిష్యత్తులో ఈ సైబర్‌ దాడుల ముప్పు ముంచుకొస్తుందని, రాబోయే కాలంలో సైబర్‌ దాడులు ఏకంగా 87 శాతానికి పెరిగే అవకాశముందని నివేదిక తెలిపింది. భవిష్యత్తులో జరిగే ఏఐ ఆధారిత సైబర్‌ దాడులను ఎదుర్కోలేమని ప్రపంచంలోని 31 శాతం దేశాలు చేతులెత్తేశాయని పేర్కొంది. ఇక, డిజిటల్‌ లావాదేవీలు ఎక్కువగా జరిగే భారతదేశానికి ఈ సైబర్‌ దాడుల ప్రమాదం అధికంగా ఉందని ఈ నివేదిక హెచ్చరించింది. సైబర్‌ సెక్యూరిటీపై భారత్‌ వెచ్చిస్తున్న మొత్తం 2026లో 3.4 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని చెప్పింది.

భారత్‌కూఅతిపెద్ద ముప్పు

సైబర్‌ నేరగాళ్ల వల్ల భారత్‌కు అత్యధిక ముప్పు పొంచి ఉందని గ్లోబల్‌ సైబర్‌ సెక్యూరిటీ అవుట్‌ లుక్‌ నివేదిక వెల్లడించింది. డిజిటల్‌ లావాదేవీల్లో మోసాలు, ఓటీపీ అడిగే ఫేక్‌ కాల్స్‌, నకిలీ కస్టమర్‌ కేర్‌ నెంబరు, నకిలీ ఇన్వె్‌స్టమెంట్‌ యాప్‌లు, ఏఐ ఆధారిత డీప్‌ ఫేక్‌ స్కామ్‌లు, కీలక మౌలిక సదుపాయాలపై హ్యాకింగ్‌ జరిగే ప్రమాదం, అంతర్జాతీయ సైబర్‌ ముఠాల దాడులు పెరిగే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. సైబర్‌ నేరాల నియంత్రణకు భారత్‌కు తగినంత మంది సాంకేతిక నిపుణులు లేకపోవడం వల్లే ఈ ముప్పు అని నివేదిక వెల్లడించింది. దేశంలో పవర్‌ గ్రిడ్‌లు, ఎయిర్‌పోర్టులు, డిజిటల్‌ పేమెంట్‌ నెట్‌వర్క్‌లను సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటే భారీ నష్టం తప్పదని పేర్కొంది. దేశంలో ఏఐ ఆధారిత సైబర్‌ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, కీలక మౌలిక సదుపాయాల రంగాలకు భద్రత పెంచడం, సైబర్‌ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు, అంతర్జాతీయ సహకారాన్ని తీసుకోవాలని ప్రపంచ ఆర్థిక వేదిక నిపుణులు సూచించారు. ఇక, దేశంలో అంతర్జాతీయ సైబర్‌ ముఠాలు, డార్క్‌వెబ్‌ నెట్‌వర్క్‌ ముఠాల కార్యకలాపాలు పెరుగుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో దేశంలో ఏఐ ఆధారిత సైబర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ముఖ్యమైన మౌలిక వసతులకు ప్రత్యేక సైబర్‌ భద్రత కల్పించాలని, సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల తయారీపై దృష్టి సారించాలని నివేదిక సూచించింది.


సైబర్‌ దాడులు పెరిగే ప్రమాదం

ప్రపంచంలోని రాజకీయ అస్థిరత కూడా సైబర్‌ దాడులను ప్రోత్సహించేందుకు కారణమవుతుందని నివేదిక పేర్కొంది. వివిధ దేశాల మధ్య భౌగోళికంగా తలెత్తుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 91శాతం కంపెనీలు తమ సైబర్‌ సెక్యూరిటీ విధానాలను అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా జరిగే సైబర్‌ దాడులకు ప్రపంచంలోని 64 శాతం సంస్థలు భయపడుతున్నాయి. కాగా, 94 శాతం కంపెనీలు సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏఐనే ఆయుధంగా వాడుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. సైబర్‌ నేరాలను నిలువరించేందుకు 77 శాతం సంస్థలు ఏఐని సద్వినియోగం చేసుకుంటున్నాయి. 4 శాతం సంస్థలు భౌగోళిక రాజకీయ పరిణామాలు సైబర్‌ నేరాలకు కారణమవుతున్నాయని తెలిపాయి.

భారత్‌లో జరిగిన సైబర్‌ దాడులు

భారత్‌లో నాలుగేళ్లుగా సైబర్‌ దాడులు పెరుగుతున్నాయి. 2022లో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిపై జరిగిన సైబర్‌ దాడితో ఆస్పత్రిలోని రోగుల మెడికల్‌ రికార్డుల సర్వర్‌ హ్యాక్‌ అయింది. ఆస్పత్రి ఐటీ వ్యవస్థ దాదాపు 2వారాలు పని చేయలేదు. ఆరోగ్య వ్యవస్థపై జరిగిన అతిపెద్ద దాడిగా దీనిని అభివర్ణించారు. ఇక, కూడంకులం అణుప్లాంట్‌పై జరిగిన సైబర్‌ దాడులు దేశ రక్షణ వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేశాయి. అలాగే, ముంబై పవర్‌ గ్రిడ్‌లో అనుమానాస్పద సైబర్‌ చొరబాటు జరిగినట్లు గుర్తించారు. ఎయిర్‌ ఇండియా, బిగ్‌బాస్కెట్‌ లాంటి సంస్థలు కూడా హ్యాకింగ్‌కు గురయ్యాయి.

సైబర్‌ క్రైమ్‌ సేవ’ పేరుతో హ్యాకింగ్‌ సేవలు

అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇటీవల కాలంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. భారత్‌ లాంటి దేశాలు కూడా విదేశీ సంస్థలు నిర్వహించే క్లౌడ్‌ సిస్టమ్‌పై ఆధారపడకుండా.. సొంతంగా డేటా సెంటర్ల నిర్వహణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, డేటా సెంటర్లపై కూడా సైబర్‌ నేరగాళ్లు దాడులు చేసే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది. మరోపక్క, సైబర్‌ నేరాలు వ్యవస్థీకృత వ్యాపారంగా మారాయని గ్లోబల్‌ సైబర్‌ సెక్యూరిటీ అవుట్‌ లుక్‌ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ‘సైబర్‌ క్రైమ్‌ యాజ్‌ ఏ సర్వీస్‌’ పేరిట హ్యాకింగ్‌ సేవలు అందుబాటులోకి రావడం కలవరపెట్టే అంశమని హెచ్చరించింది.

Updated Date - Apr 12 , 2026 | 04:04 AM