ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ ఆస్తులు 200కోట్లు!
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:34 AM
రహదారులు, భవనాల శాఖలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. మంగళవారం ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) మోహన్‌నాయక్, ఆయన బంధువుల....
మోహన్‌నాయక్, ఆయన మిత్రులు, బంధువుల నివాసాల్లో ఏసీబీ సోదాలు
కిలోన్నర బంగారం బిస్కట్లు, మరో కిలో ఆభరణాలు
బ్యాంకులో రూ.1.44 కోట్లు.. ఇంట్లో నగదు రూ.55 లక్షలు
5చోట్ల 19.38 ఎకరాల భూమి.. 7 లగ్జరీ ఫ్లాట్లు.. ఖరీదైన విల్లా
గృహోపకరణాల విలువే రూ.1.26 కోట్లు
ఇంట్లో మినీ బార్.. విదేశీ మద్యం బాటిళ్లు
కొనసాగుతున్న తనిఖీలు.. ఈఎన్‌సీ మోహన్‌నాయక్ అరెస్టు
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): రహదారులు, భవనాల శాఖలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. మంగళవారం ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) మోహన్‌నాయక్, ఆయన బంధువుల నివాసాలపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు.. ఏకంగా రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. మోహన్ నాయక్‌ను అరెస్టు చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని, బినామీ ఆస్తులు, లాకర్లు ఇతర అంశాలపై విచారణ జరుపుతున్నామని ఏసీబీ డీజీ చారుసిన్హా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మోహన్‌నాయక్, ఆయన మిత్రులు, బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 15 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తనిఖీల్లో బయటపడ్డ నగదు, బంగారాన్ని, కోటికిపైగా విలువైన గృహోపకరణాలను, ఆస్తుల పత్రాలను చూసి నివ్వెరబోయారు. మోహన్ నాయక్ ఇంట్లో రూ.55 లక్షల నగదు, 15 బంగారు బిస్కట్లు సహా రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు, రూ.3,60,000 విలువైన ఆరు కిలోల వెండి వస్తువులు, రూ.1.26 కోట్ల విలువైన గృహోపకరణాలు, రూ.11,25,000 విలువైన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు, రూ.25 లక్షల విలువైన రెండు కార్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ముల్లంగి గ్రామంలో ఐదు చోట్ల 19.38 ఎకరాల భూమి. హైదరాబాద్‌లోని కొంపల్లిలో మూడు, గచ్చిబౌలిలో 4 ఖరీదైన ఫ్లాట్లు (డాక్యుమెంట్ల విలువ రూ.7,34,73,867), మియాపూర్‌లో రూ.2.50 కోట్ల విలువైన ట్రిప్లెక్స్ విల్లా, కూకట్‌పల్లిలో రూ.62,14,000తో నిర్మించిన కొత్త ఇల్లు, నిజామాబాద్‌లో కొత్తగా నిర్మించిన విల్లాకు రూ.1కోటి అడ్వాన్స్‌గా ఇచ్చిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మోహన్‌నాయక్ బ్యాంకు ఖాతాలో రూ.1.44 కోట్లు ఉన్నాయని.. కొన్నేళ్లుగా ఆయన బ్యాంకు ఖాతాలో పడిన జీతాన్ని ఖర్చు చేయలేదని అధికారులు పేర్కొన్నారు. ఆయన ఇంట్లోనే మినీ బార్ ఏర్పాటు చేసుకున్నారని, పదుల సంఖ్యలో విదేశీ మద్యం బాటిళ్లు ఉన్నాయని తెలిపారు. మోహన్‌నాయక్ ఆస్తుల డాక్యుమెంట్ల విలువ రూ.17,94,62,617గా ఉన్నప్పటికీ బహిరంగ మార్కెట్ విలువ అంతకు చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.
మంత్రి చెప్పినా.. నాయక్‌ను ప్రసన్నం చేసుకోవాల్సిందే!
రహదారులు భవనాల శాఖ ఈఎన్‌సీ మోహన్‌నాయక్‌పై చాలా కాలం నుంచి ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితమే ఏసీబీ ఫిర్యాదులు కూడా అందినట్టు సమాచారం. దీనితో పక్కాగా నిఘా పెట్టి మంగళవారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. రోడ్ల నిర్మాణ కాంట్రాక్టర్ల నుంచి ఆయన భారీగా కమీషన్లు వసూలు చేస్తారని, కొందరు కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉండేలా టెండర్ల నిబంధనలు మార్చేస్తుంటారని మోహన్‌నాయక్‌పై ఆరోపణలు ఉన్నట్టుగా ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాల వారీగా ఆయన అనుచరులు వ్యవహరాలను చక్కదిద్దుతూ ఉంటారని.. మంత్రి ఆదేశాలిచ్చినా మోహన్‌నాయక్‌ను ప్రసన్నం చేసుకోకపోతే ఫైలు కదలని పరిస్థితి ఉందని ఆర్‌అండ్‌బీ వర్గాలు పేర్కొంటున్నాయి.