జలమండలి జీఎం రూ.100 కోట్లు
ABN , Publish Date - May 20 , 2026 | 04:11 AM
రెండు కిలోల బంగారం, తొమ్మిది కిలోల వెండి.. గుట్టలుగా నోట్ల కట్టలు.. విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన ఫ్లాట్లు, ఎకరాల కొద్దీ పొలాలు.. హైదరాబాద్ మెట్రోపాలిటిన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు...
భారీగా ఆస్తులు కూడబెట్టిన అనంత లక్ష్మీకుమార్ వాటర్ ట్యాంకర్ల అక్రమ విక్రయంతో రోజుకు రూ.50,000 వసూళ్లు!
ఇంట్లో కరెన్సీ నోట్ల గుట్టలు.. 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి
సంగారెడ్డి. నిజామాబాద్‌లో 18 ఎకరాల వ్యవసాయ భూమి
హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు.. 3 ఫ్లాట్లు, 6 ఇళ్ల స్థలాలు
హైదరాబాద్, తార్నాక, మే 19(ఆంధ్రజ్యోతి): రెండు కిలోల బంగారం, తొమ్మిది కిలోల వెండి.. గుట్టలుగా నోట్ల కట్టలు.. విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన ఫ్లాట్లు, ఎకరాల కొద్దీ పొలాలు.. హైదరాబాద్ మెట్రోపాలిటిన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు(హెచ్‌ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) రెడ్ హిల్స్ డివిజన్‌లో జనరల్ మేనేజర్ ఎస్. అనంత లక్ష్మీకుమార్ అక్రమాస్తుల చిట్టా ఇది. ఇంతేనా.. అపార్ట్‌మెంట్‌లకు ఒక్కో వాటర్ ట్యాంకర్‌ను రూ.5,000 చొప్పున అక్రమంగా విక్రయిస్తూ ప్రతి రోజు రూ.50,000 మేర వసూళ్లు.. అనంత లక్ష్మీ కుమార్ తన పదవిని అడ్డుపెట్టుకొని ఇలా ఏకంగా రూ.100 కోట్లకుపైగా విలువైన ఆస్తులు కూడబెట్టారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు ఓ ప్రకటన చేశారు. అనంత లక్ష్మీకుమార్ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. హైదరాబాద్‌లోని లక్ష్మీకుమార్ ఇల్లు, కార్యాలయంతోపాటు ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. మంగళవారం రాత్రి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మల్లాపూర్‌లోని అనంత లక్ష్మీ కుమార్ నివాసం, అతని మిత్రులు, బినామీల ఇళ్లల్లో చేసిన సోదాలు చేశారు. ఈ తనిఖీలో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు బయటపడగా.. నగదును లెక్కించడం కోసం ఏకంగా కరెన్సీ లెక్కింపు యంత్రాలను తెప్పించారు. ప్రాథమిక సమాచారం మేరకు లక్ష్మీ కుమార్ దాదాపు రూ.100కోట్లకు పైగా ఆస్తులను సంపాదించినట్లు వెల్లడైంది. మల్లాపూర్‌లోని లక్ష్మీకుమార్ ఇంట్లో దాదాపు రూ1.10 కోట్ల నగదు, 2.1కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే, లక్ష్మీ కుమార్ భార్య పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించిన అధికారులు.. ఆమెను బ్యాంకుకు తీసుకెళ్లి వాటిని తెరిపించారు.
ఆ లాకర్లలోని విలువైన ఆస్తుల పత్రాలు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అనంత లక్ష్మీ కుమార్ హైదరాబాద్‌లోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టుల్లో మూడు ఫ్లాట్లు, ఆరు ఇళ్ల స్ధలాలు, ఒక విలాసవంతమైన ఇల్లు, నిజామాబాద్, సంగారెడ్డిలో 18ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన ఇంట్లో ఒక మారుతి రిట్జ్ కారు, బజాజ్ మోటార్ సైకిల్‌ను గుర్తించారు. ఏసీబీ గుర్తించిన అనంత లక్ష్మీ కుమార్ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం రూ.5,88,55,490 ఉంటుంది. కానీ ఆయా ఆస్తుల మార్కెట్ విలువ ఎన్నో రెట్లు అధికంగా ఉందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారుసిన్హా ప్రకటించారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ నేతృత్వంలో మంగళవారం రాత్రి కూడా మల్లాపూర్‌లో సోదాలు కొనసాగుతున్నాయి. అనంత లక్ష్మీ కుమార్‌కు బినామీగా వ్యహరించిన కొందరు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లోనూ జరిపిన సోదాల్లో ఏసీబీ అధికారులు స్ధిరాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ ఇంకా కొనసాగుతుందని, బ్యాంకు లాకర్ల వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు. ఇక, అనంత లక్ష్మీ కుమార్ తన పదవిని అడ్డుపెట్టుకొని హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్లకు ఒక్కోటి రూ.5,000 చొప్పున వాటర్ ట్యాంకర్లను అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దందా ద్వారా ఆయన రోజుకు రూ.50,000 వసూలు చేస్తుంటారని చెబుతున్నారు. కాగా, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవినీతికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు టోల్‌ఫ్రీ నెంబర్ 1064కి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరారు.