నిమ్స్‌లో ఏసీబీ సోదాల కలకలం
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:57 AM
నిమ్స్ ఆసుపత్రి కేంద్రంగా 2014 నుంచి పదేళ్ల పాటు సాగిన అక్రమార్కుల దందాపై దృష్టిసారించిన ఏసీబీ సెంట్రల్ ఇన్విస్టిగేషన్ యూనిట్(సీఐయూ) అధికారులు నిమ్స్‌లోని పలు విభాగాల్లో సోదాలు నిర్వహించారు.
క్యాంటీన్, సర్జికల్ స్టోర్స్‌లో కూడా తనిఖీలు
నేడు కూడా సోదాలు కొనసాగే అవకాశం
హైదరాబాద్, నిమ్స్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): నిమ్స్ ఆసుపత్రి కేంద్రంగా 2014 నుంచి పదేళ్ల పాటు సాగిన అక్రమార్కుల దందాపై దృష్టిసారించిన ఏసీబీ సెంట్రల్ ఇన్విస్టిగేషన్ యూనిట్(సీఐయూ) అధికారులు నిమ్స్‌లోని పలు విభాగాల్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ, టీజీ సేఫ్‌కు చెందిన 30 మందికిపైగా అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నిమ్స్ క్యాంటిన్‌లో ఫుడ్ ఇన్ స్పెక్టర్లు తనిఖీలు చేయగా, సర్జికల్ స్టోర్‌లో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు ఫైళ్లను పరిశీలించారు. 2014 నుంచి జరిగిన అన్ని టెండర్లకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. ప్రధానంగా స్టోర్స్, మ్యాన్‌పవర్ రిక్రూట్‌మెంట్, సెక్యూరిటీ, క్యాంటీన్, మెడికల్ షాపు టెండర్లను నిశితంగా పరిశీలించారు. ఏసీబీ అధికారులు అడిగిన ఫైళ్లను నిమ్స్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ ఆధ్వర్యంలోని డాక్డర్ల బృందం అందచేసినట్లు సమాచారం. నిమ్స్ స్టోర్స్ విభాగం ద్వారా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడం, భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అప్పట్లో స్టోర్స్ విభాగానికి బాధ్యత వహించిన ఇద్దరు ప్రముఖ వైద్యుల వివరాలను ఏసీబీ పరిశీలించినట్లు తెలుస్తోంది. అప్పటి డైరెక్టర్ల కనుసన్నల్లో జరిగిన అవినీతి వందల కోట్లలో ఉండవచ్చని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. నిమ్స్‌లో అవినీతిని ప్రక్షాళన చేసి పూర్తి స్ధాయిలో క్లీన్ చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించిన క్రమంలో టెండర్ల క్రమాన్ని ఏసీబీ అధికారులు పరిశీలించారు. నిమ్స్ క్యాంటీన్ పరిశీలించిన పలువురు ఫుడ్ ఇన్‌స్సెక్టర్లు ఇక్కడి అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి ఖంగుతిన్నారు.
శుభ్రత పాటించకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్స్ పరిపాలన విభాగం సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్‌ను ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్టు చేసిన తర్వాత ఐదుగురు నిమ్స్ ఉద్యోగుల ఇళ్లు, సీఐయూ విభాగంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా నిమ్స్ సర్జికల్ స్టోర్స్, సెక్యూరిటీ, మ్యాన్ పవర్ కాంట్రాక్టులు, రిక్రూట్‌మెంట్లు, క్యాంటీన్, మెడికల్ షాపు టెండర్లపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు అన్ని ఫైళ్లను పరిశీలించారు. తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగుతాయని తెలుస్తోంది.