Share News

ఏసీబీ వలలో ఐదుగురు

ABN , Publish Date - Oct 16 , 2026 | 02:58 AM

కాదేది కవితకనర్హం అని ఓ కవి అన్నట్లు ఇక నుంచి కాదేది లంచానికనర్హం అని అనుకోవాలేమో. తమ విద్యుక్త ధర్మం ప్రకారం ప్రజలకు సర్వీసు అందించాల్సిన ప్రభుత్వోద్యోగులు, అధికారులు ప్రతిదానికీ లంచం డిమాండ్‌ చేస్తున్నారు.

ఏసీబీ వలలో   ఐదుగురు
acb catches

  • మాదన్నపేట ఏఈ, కీసర డీటీ,

  • వేములవాడ తహసీల్దార్‌, అక్కడి

  • భూభారతి ఆపరేటర్‌ అరెస్టు

హైదరాబాద్‌/ సంతోష్‌నగర్‌/ కీసర రూరల్‌/ వేములవాడ రూరల్‌, అక్టోబరు 15: (ఆంధ్రజ్యోతి): కాదేది కవితకనర్హం అని ఓ కవి అన్నట్లు ఇక నుంచి కాదేది లంచానికనర్హం అని అనుకోవాలేమో. తమ విద్యుక్త ధర్మం ప్రకారం ప్రజలకు సర్వీసు అందించాల్సిన ప్రభుత్వోద్యోగులు, అధికారులు ప్రతిదానికీ లంచం డిమాండ్‌ చేస్తున్నారు. అలా లంచం తీసుకుంటూ గురువారం రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఓ తహసీల్దార్‌ సహా ఐదుగురు ప్రభుత్వ సిబ్బంది, ఒక ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కారు. హైదరాబాద్‌లోని మాదన్నపేట వాసి తన ఇంట్లో గల 6 పాత విద్యుత్‌ మీటర్ల స్థానే కొత్త మీటర్ల కోసం ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించాడు. అటుపై మాదన్నపేట సెక్షన్‌ సంతో్‌షనగర్‌ సబ్‌ డివిజన్‌లోని ఎ్‌సపీడీసీఎల్‌ ఏఈ పండాల సందయ్య రాకేశ్‌ను సదరు వినియోగదారుడు కోరారు. ఆన్‌లైన్‌లో డబ్బు కట్టగానే మీటర్లు రావని, ఒక్కో మీటర్‌కు రూ.20 వేలు తమకు ఇస్తేనే పని జరుగుతుందని ఏఈ తేల్చి చెప్పారు. దీంతో లంచం ఇవ్వడానికి ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ హైదరాబాద్‌ సిటీ రేంజ్‌-2 అధికారులు రంగంలోకి దిగి ట్రాప్‌ ఏర్పాటు చేశారు. బాధితుడి వద్ద నుంచి రూ.1.20లక్షల నగదు తీసుకుంటున్న ఏఈ రాకేశ్‌ను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లాలోని కీసర మండల కేంద్ర గిరిధర్‌ రెడ్డి తల్లి సుశీల మరణం తర్వాత 184వ సర్వే నంబర్‌లోని అర ఎకరం భూమిని తన పేరు మీదకు మార్చాలని దరఖాస్తు చేసుకున్నాడు. కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా.. పని కాకపోవడంతో అధికారులను నిలదీయడంతో రూ.5 లక్షల లంచం ఇస్తేనే పని అవుతుందని డీటీ సందీప్‌ కుమార్‌ రెడ్డి తేల్చి చెప్పారు.


దీంతో గిరిధర్‌ రెడ్డి.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు డబ్బు సిద్ధంగా ఉందని జీపీవో విజయ్‌కుమార్‌ రెడ్డికి సమాచారం ఇవ్వగా, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి బాలకృష్ణకు ఇవ్వాలని చెప్పాడు. బాలకృష్ణకు బాధితుడు రూ.2.50 లక్షల నగదు ఇవ్వగానే పట్టుకున్న ఏసీబీ అధికారులు.. అతడితోపాటు డిప్యూటీ తహసీల్దార్‌, జీపీవోలను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే, రాజన్న-సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం చెక్కపల్లి గ్రామ మహిళ ఒకరు తన భూమిని ఆమె సోదరుడికి గిఫ్ట్‌ డీడ్‌గా ఇవ్వడానికి గత నెలలో స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. కానీ, ఈ భూమి గిఫ్ట్‌ డీడ్‌ చేయడానికి రూ.10వేల లంచం అడిగిన తహసీల్దార్‌ అబూబాకర్‌.. చివరకు రూ.8,000కు ఒప్పుకుని కార్యాలయంలోని భూభారతి ఆపరేటర్‌ అనిల్‌కివ్వాలని సూచించారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అనిల్‌కు డబ్బు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ..అతడి వాంగ్మూలంతో తహసీల్దార్‌ అబూబాకర్‌ను అదుపులోకి తీసుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి

ధరణి, భూభారతిలో లక్షల ఎకరాల దోపిడీ: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఉద్యోగం ఊడుద్ది.. జాగ్రత్త!

Updated Date - Oct 16 , 2026 | 02:59 AM