Share News

ఏసీబీ కేసులు.. సర్కారు బ్రేకులు

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:55 AM

ఏసీబీ వలలో తిమింగలం.. ఏసీబీకి చిక్కిన అవినీతి అనకొండ.. అంటూ పేపర్లలో తరచుగా వార్తలు వస్తాయి! ఏసీబీ దాడుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన సదరు అవినీతి అనకొండలు సంపాదించిన రూ.వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తుల వివరాలు.. కట్టలుకట్టలుగా పేర్చిన డబ్బులు, బంగారు, వజ్రాభరణాల ఫొటోలు చూసి జనం 2-3 రోజులు వాటి గురించే మాట్లాడుకుంటారు

ఏసీబీ కేసులు..  సర్కారు బ్రేకులు
acb

వడ్డె సురేందర్‌.. 2020లో ఈయన మహబూబ్‌నగర్‌

మునిసిపల్‌ కమిషనర్‌గా ఉన్నప్పుడు రూ.1.65 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) చిక్కారు! దర్యాప్తు పూర్తి అయిన తర్వాత.. ప్రాసిక్యూషన్‌ అనుమతి కోరారు. కానీ.. సంబంధిత పురపాలక శాఖ నుంచి క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు అనుమతి రాలేదు. ఆయనపై తాము శాఖాపరమైన చర్యలకు ఆదేశించామని జవాబు వచ్చింది. దీంతో.. ఈ ఏడాది ఆగస్టులో ఆ కేసు క్లోజ్‌ అయ్యింది.

2018లో.. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న పురుషోత్తం రెడ్డిపై ఏసీబీ అధికారులు అక్రమార్జన కేసు నమోదు చేశారు. ప్రాసిక్యూషన్‌ అనుమతి కోసం పలుమార్లు లేఖలు రాసినా ఉపయోగం లేకపోయింది. పురుషోత్తంరెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామంటూ గత ఏడాది ఆ శాఖ నుంచి లేఖ రావడంతో ఈ కేసును ఏసీబీ అధికారులు కోర్టులో క్లోజ్‌ చేసుకోవాల్సి వచ్చింది.

వీరే కాదు.. పోలీసు శాఖకు సంబంధించి వై.నర్సింహారెడ్డి, ఉమామహేశ్వరరావు, పంచాయితీ రాజ్‌ డిప్యూటీ ఈఈ సుదర్శన్‌రెడ్డిలపై నమోదైన డీఏ (డిస్‌ప్రపోర్షనేట్‌ అసెట్‌-ఆదాయానికి మించిన ఆస్తుల) కేసుల్లో ప్రభుత్వం శాఖాపరమైన చర్యలకు మొగ్గు చూపడంతో ఆయా కేసులను ఏసీబీ అధికారులు క్లోజ్‌ చేసుకున్నారు. రూ.143కోట్ల ఈఎ్‌సఐ మెడికల్‌ స్కామ్‌లో నాటి డైరెక్టర్‌ దేవికారాణితోపాటు, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మను 2019లో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరిపై ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కోణంలో విచారణ చేపట్టారు. ఐనా, ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి రాకపోవడంతో నిరుడు నవంబరులో ఏసీబీ అధికారులు ఆ కేసును క్లోజ్‌ చేశారు. వీరంతా లంచం తీసుకోవడం నిజం. ఏసీబీ పట్టుకోవడం నిజం. జైలుకు వెళ్లడం నిజం. బెయిల్‌పై బయటకు రావడం నిజం. కానీ, చార్జ్‌షీట్‌ దశలో ప్రాసిక్యూషన్‌ అనుమతి నిరాకరణ సైతం నిజం కావడంతో ఈ కేసులు క్లోజ్‌ అయ్యాయి.

  • ప్రాసిక్యూషన్‌కు అనుమతుల నిరాకరణతో చిక్కులు

  • శాఖాపరమైన విచారణతో ఏసీబీ దర్యాప్తుకు చెల్లుచీటీ

  • ఒక కేసులో ప్రాసిక్యూషన్‌ అనుమతి కోరుతూ సర్కారుకు

  • 2014 నుంచి 19 లేఖలు రాసిన అవినీతి నిరోధక శాఖ

  • చివరికి 2024లో అందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం

  • 2021నాటికి 323 కేసుల్లో ఐదింటికే ప్రాసిక్యూషన్‌ అనుమతి

  • 2025కి 650 కేసులు.. 115 కేసుల ప్రాసిక్యూషన్‌కు ఓకే

  • 2023 నుంచి కోర్టుల్లో 20 కేసులను డ్రాప్‌ చేసుకున్న ఏసీబీ

(హైదరాబాద్‌-ఆంధ్రజ్యోతి)

ఏసీబీ వలలో తిమింగలం.. ఏసీబీకి చిక్కిన అవినీతి అనకొండ.. అంటూ పేపర్లలో తరచుగా వార్తలు వస్తాయి! ఏసీబీ దాడుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన సదరు అవినీతి అనకొండలు సంపాదించిన రూ.వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తుల వివరాలు.. కట్టలుకట్టలుగా పేర్చిన డబ్బులు, బంగారు, వజ్రాభరణాల ఫొటోలు చూసి జనం 2-3 రోజులు వాటి గురించే మాట్లాడుకుంటారు! కానీ.. వాటిల్లో చాలా కేసులు అక్కడితోనే సరి!! మెజారిటీ కేసుల్లో ప్రాసిక్యూషన్‌కు అనుమతులు రావట్లేదు. ఉదాహరణకు.. ఒక కేసులో అవినీతికి పాల్పడిన ఓ అధికారి ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ ఏసీబీ ఉన్నతాధికారులు 19 సార్లు ప్రభుత్వానికి లేఖలు రాయాల్సి వచ్చింది. ఇలా చాలా కేసుల్లో ప్రాసిక్యూషన్‌ అనుమతి రాక.. ఏసీబీ అధికారులు కోర్టులో వాటిని డ్రాప్‌ చేసుకోవాల్సిన పరిస్థితి. గణాంకాలు చూస్తే.. రెవెన్యూ శాఖకు సంబంధించి 2014 నాటికి ప్రాసిక్యూషన్‌ అనుమతులు 101 పెండింగ్‌లో ఉన్నాయి. 2021 నాటికి ఆసంఖ్య 323కి చేరగా.. కేవలం 5 కేసుల్లో మాత్రమే ఏసీబీ ప్రాసిక్యూషన్‌ అనుమతి పొందింది. 2025 ముగిసే సమయానికి 650 కేసులకు గాను.. 115 కేసుల్లో మాత్రమే ప్రాసిక్యూషన్‌ అనుమతులు వచ్చాయని ఏసీబీ డీజీ తెలిపారు. చాలా కేసుల్లో.. సదరు ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామనే సమాధానంతో వివిధ శాఖలు ప్రాసిక్యూషన్‌ అనుమతులను తిరస్కరిస్తుండడం గమనార్హం. 2023 నుంచి ఇప్పటివరకూ దాదాపు 20 కేసుల్లో శాఖాపరమైన చర్యలకే ఆయా విభాగాల ఉన్నతాధికారులు మొగ్గుచూపడంతో ఆయా కేసులను కోర్టులో ఏసీబీ అధికారులు డ్రాప్‌ చేసుకోవాల్సి వచ్చింది.


ఆ నిబంధనే ఆయుధంగా..

అజ్మీరా కైలాస్‌ 2010లో విద్యుత్‌శాఖలో ఏడీఈగా పనిచేస్తున్న సమయంలో ఆయనపై ఏసీబీ అధికారులు అక్రమార్జన కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్‌ కోసం ప్రభుత్వానికి లేఖ పంపించారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మరోసారి ఏసీబీ డీజీ నుంచి ప్రభుత్వానికి లేఖ వెళ్లింది. ఒక లేఖ, మరో లేఖ ఇలా 19 లేఖలు రాయగా.. చివరకు ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ అనుమతిని కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ఇచ్చారు. అంటే 14 ఏళ్లకు!! అదీ 19 లేఖలు రాశాక అనుమతి వచ్చింది. అవినీతికి పాల్పడ్డ అధికారులపై ఏసీబీ దర్యాప్తు పూర్తి చేశాక.. కోర్టులో చార్జ్‌షీట్‌ వేయడానికి ప్రభుత్వ అనుమతి కావాలన్న నిబంధనే సదరు అక్రమార్కులకు ఆయుధంగా మారుతోంది. వారు దీన్నొక అవకాశంగా వాడుకుని.. ఆయా శాఖల ఉన్నతాధికారుల వద్ద పైరవీలు చేసి, ఆ ఫైళ్లు ముందుకు కదలకుండా చూసుకుంటూ శాఖాపరమైన చర్యలకు మాత్రమే సిఫారసు చేసేలా చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి.

ఏళ్ల తరబడి

అక్రమార్కులపై ఏసీబీ అధికారులు దాడులు చేసి, వారి అక్రమార్జన గుట్టుమట్లను వెలికితీసి, దర్యాప్తు పూర్తిచేసినా.. ఆ కేసుల్లో చాలా వరకూ కోర్టు ముందుకు చేరుకోవడానికి నెలలు, ఏళ్లు, కొన్ని సందర్భాల్లో దశాబ్దాలు పడుతున్నాయి. ట్రాప్‌, అక్రమార్జన కేసుల్లో ఏసీబీ దర్యాప్తు పూర్తి అయిన తర్వాత సదరు అధికారిపై కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. అందుకోసం ఏసీబీ పంపిన అధికారిక లేఖలు సచివాలయంలో ఆయా శాఖల ఉన్నతాధికారుల వద్ద ఆగిపోతున్నాయి. కొన్ని కేసుల్లో ప్రాసిక్యూషన్‌ శాంక్షన్‌ నిరాకరణ, మరికొన్నింటిలో శాఖాపరమైన విచారణకు ఆ కేసుల మళ్లింపు, ఇంకొన్ని కేసుల్లో సుదీర్ఘ జాప్యం చోటుచేసుకోవడం ఏసీబీ కేసుల దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏసీబీ కేసుల్లో ప్రాసిక్యూషన్‌ అనుమతుల నిరాకరణలో రెవెన్యూ శాఖ ఉండగా.. ఆ తర్వాత స్ధానాల్లో విద్యుత్‌, పోలీసు, పౌరసరఫరాల శాఖ, మునిసిపల్‌ విభాగాలు ఉన్నాయి..


ఈ ఏడాది.. కొన్ని

‘పెద్ద’ కేసులు!అక్రమార్జన కేసులపై గట్టిగా దృష్టి సారించిన

ఏసీబీ అధికారులు.. ఈ ఏడాది ఇప్పటి వరకు

19 డీఏ కేసులను నమోదు చేసి, సదరు అవినీతి తిమింగలాల వద్ద ఉన్న రూ.వందల కోట్ల మేర

‘ఆదాయానికి మించిన ఆస్తుల’ను గుర్తించారు. ఈ ఏడాది ఏసీబీ నమోదు చేసిన కొన్ని కేసుల వివరాలు

అధికారి

హోదా

వారి ఆస్తుల

రిజిస్ట్రేషన్‌ విలువ

(రూ.కోట్లలో)

వెంకటరెడ్డి

హన్మకొండ డిప్యూటీ కలెక్టర్‌

7.69

మధుసూదన్‌రెడ్డి

జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌

7.8

సుందరి కిరణ్‌కుమార్‌

అసిస్టెంట్‌ డైరెక్టర్

వ్యవసాయశాఖ

4

శ్రవణ్‌ కుమార్‌

గజ్వేల్‌ తహస్దీలార్‌

4

అనంత లక్ష్మీకుమార్‌

వాటర్‌బోర్డు జీఎం

5.88

వంశీమోహన్‌

డిప్యూటీ కలెక్టర్‌

6.22

మోహన్‌ నాయక్‌

ఆర్‌అండ్‌బీ ఈసీ

17.94

సుంకరి నరహరి

సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌

17

భీమ్‌రెడ్డి

డీఎస్పీ

25

Updated Date - Oct 03 , 2026 | 03:55 AM