‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’పై గులాబీ గూండాల దాడి
ABN , Publish Date - Feb 02 , 2026 | 02:40 AM
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల కెమెరా జర్నలి్‌స్టపై గులాబీ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్....
బీఆర్‌ఎస్ ఆఫీసు వద్ద కవరేజీకి వెళ్లిన కెమెరా జర్నలిస్టుపైకి కుర్చీ విసిరిన కార్యకర్త
దాడిలో కెమెరా ధ్వంసం.. జర్నలిస్టుకు స్వల్ప గాయాలు
ఇదేం సంస్కృతి? బాధ్యతాయుతంగా ఉండాలి: కిషన్‌రెడ్డి
గులాబీ గూండాల తీరును చూస్తూ ఊరుకోం: సంజయ్
దాడిని ఖండించిన మంత్రులు తుమ్మల, పొన్నం, అడ్లూరి
సీఎం దిష్టిబొమ్మ దహనాలు, బైక్ ర్యాలీలతో నిరసనలు
కేసీఆర్‌ను ఇబ్బంది పెడితే అగ్నిగుండమే: శ్రీనివాస్ గౌడ్
సిట్ విచారణ కక్ష సాధింపు చర్యే: సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, బంజారాహిల్స్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల కెమెరా జర్నలి్‌స్టపై గులాబీ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద పరిస్థితులను కవర్ చేసేందుకు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కెమెరా జర్నలిస్ట్ పవన్ వెళ్లారు. కేసీఆర్‌కు సిట్ నోటీసుల జారీని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగా అప్పటికే బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రత్యేక వాహనాల్లో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయం గేటు బయట కెమెరా జర్నలిస్టు పవన్ విఽధులు నిర్వహిస్తుండగా ఆయనపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన నేత అయిన కేసీఆర్‌ను ఎలా విచారిస్తారు? అంటూ నినాదాలు చేస్తూ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలు, సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. వారంతా కార్యాలయం గేటు దాటి బయటకు రాగానే అక్కడే ఉన్న పోలీసులు నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కెమెరామన్ పవన్‌పై ఓ కార్యకర్త కుర్చీని విసిరాడు. ఈ ఘటనలో పవన్ చేతుల్లోని కెమెరా ధ్వంసమైంది. ఆయనకు స్వల్పగాయాలయ్యాయి. బీఆర్‌ఎస్ కార్యక్రమాలను ఆంధ్రజ్యోతి ప్రతినిధులు కవర్ చేయొద్దంటూ వెనుక నుంచి మరికొందరు కార్యకర్తలు బెదిరింపులకు దిగారు. ఆంఽధ్రజ్యోతి సంస్థల జర్నలిస్టులు కనిపిస్తే దాడులు చేస్తామని బెదిరించారు. అంతకుముందు.. పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తల కోసం మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే వివేకానంద వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు.. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలు మార్లు కార్యాలయం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొని వారిని తిరిగిలోపలికి పంపారు. కొంత మంది నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
దాడిని ఖండించిన కేంద్ర మంత్రులు
‘ఏబీఎన్-ఆంద్రజ్యోతి’ కెమెరా జర్నలిస్టు పవన్‌పై బీఆర్‌ఎస్ శ్రేణుల దాడిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. మీడియా ప్రతినిధిపై దాడి మంచి సంప్రదాయం కాదని కిషన్‌రెడ్డి అన్నారు. ఇది మంచి సంస్కృతి అనిపించుకోదని, పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. దాడి చేసిన వారిని గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ గుండాల తీరు బాధాకరం అని బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియాది కీలక పాత్ర అని, ప్రజల కోసమే పనిచేసే ఫోర్త్ ఎస్టేట్‌పై బీఆర్‌ఎస్ దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఒక ప్రకటనలో హెచ్చరించారు. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ కెమెరా జర్నలిస్టుపై దాడిని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. నిజాలు వెలికితీసే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సిబ్బందిపై దాడులు సరికాదన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల చర్య అప్రజాస్వామికం అని పొన్నం మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్‌ఎస్ ఖూనీ చేస్తోందని, మీడియాపై దాడులు సరికావని అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ కూడా దాడి ఘటనను తీవ్రంగా ఆక్షేపించారు. ఫోర్త్ ఎస్టేట్ అంటే బీఆర్‌ఎ్‌సకున్న గౌరవం ఇదేనా? అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ వెంకట్ డిమాండ్ చేశారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కెమెరా జర్నలి్‌స్టపై జరిగిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.దశరథ్ ఖండించారు. దాడికి పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలన్నారు.
సీఎం, మంత్రుల నివాసాల ముట్టడికి యత్నం
కేసీఆర్‌ను సిట్ విచారణ నేపథ్యంలో ఆదివారం జూబ్లిహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. దీన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు.. వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం నివాస పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి అనుమానితులను ఆ ప్రాంతాల నుంచి పంపించేశారు. కాగా గులాబీ పార్టీ నేతలు పలువురు మూకుమ్మడిగా మంత్రుల నివాసాల ముట్టడికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్వీ) నాయకులు నల్ల జెండాలతో మినిస్టర్ క్వార్టర్స్ లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. 15 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత సీఎం నివాసం, మంత్రుల క్వార్టర్స్ వద్ద పోలీసులు భద్రత పెంచారు. కాగా ఆదివారం ఉదయం నుంచే బంజారాహిల్స్ రోడ్డు నంబరు 14 నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి దారి తీసే అన్ని రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానికులు మినహా ఎవ్వరినీ ఆ దారిలో వెళ్లేందుకు అనుమతించలేదు. నందినగర్ గ్రౌండ్ చుట్టూ ఉన్న దుకాణాలను కూడా మూసివేయించారు. నందినగర్‌లోని ఇంటికి కేసీఆర్ చేరుకునే సమయంలో అక్కడ కార్యకర్తలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి తలసానిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఆయన పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. చివరకు కొద్దిసేపు మాత్రమే కేసీఆర్ నివాసం వద్ద ఉండేందుకు అనుమతినిచ్చి అక్కడి నుంచి పంపిచేశారు. కొంతమంది కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేసేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేశారు.
బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
కేసీఆర్‌కు సిట్ నోటీసులను నిరసిస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతల ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించడం, నల్లజెండాలతో బైక్ ర్యాలీలు నిర్వహించడం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాటలతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించి, ఇల్లెందు క్రాస్‌రోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు పెట్రోలు పోసి, నిప్పు పెట్టగా.. ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. అక్కడే ఉన్న టూటౌన్ సీఐ కరుణాకర్ మంటల నుంచి తప్పించుకునేందుకు వెనక్కి జరిగారు. ఈ క్రమంలో పట్టుతప్పి కింద పడిపోవడంతో ఆయన చేయి విరిగింది. కొత్తగూడెం జిల్లా మణుగూరులో సీఎం దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోగా బీఆర్‌ఎస్ నేత రేగా కాంతారావు కర్రతో వారిపై దాడికి యత్నించారు. పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి స్పహతప్పి పడిపోయారు. ఆదిలాబాద్ జిల్లా బోరోజ్ లో మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఇబ్బంది పెడితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కేసీఆర్‌ను సిట్ విచారించడం కక్ష సాధింపు చర్యేనని మీర్‌పేటలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు.