సంజయ్.. తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలి
ABN , Publish Date - May 16 , 2026 | 04:55 AM
కుమారుడి విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ తీరు నైతికంగా తప్పు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన తన కుమారుడిని స్వయంగా తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాలని సూచించారు.
ఆయనకుసహాయం చేయాలనుకుంటే పోక్సో కేసు పెట్టం కదా!
నైతికంగా సంజయ్ తీరు తప్పు.. ధైర్యంగా ఎదుర్కోవాలి: సీఎం రేవంత్
కుమారుడి విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ తీరు నైతికంగా తప్పు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన తన కుమారుడిని స్వయంగా తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాలని సూచించారు. కుమారుడి తప్పిదం వల్ల సంజయ్‌కు తలవంపులు వచ్చాయన్నారు. సంజయ్ ధైర్యంగా నిలబడి విచారణ ఎదుర్కోవాలి తప్ప.. పారిపోకూడదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలపై జరుగుతున్ననేరాలను నియంత్రించామని సీఎం చెప్పారు. ఈ నెల 8 రాత్రి మైనర్ బాలిక తల్లి పేట్ బషీరాబాద్ ేస్టషన్‌లో ఫిర్యాదు ఇచ్చారని, 9న విచారణ ప్రారంభించి సెక్షన్లు మార్చి కేసు నమోదు చేసినట్లు వివరించారు. ప్రధాని మోదీ పర్యటనకు భద్రత కోసం 10 వేల మంది పోలీసులు పనిచేశారని, పర్యటన ముగిసిన తరువాత 11వ తేదీన సెక్షన్లు సవరించి వెంటనే నోటీసులు జారీ చేశారని తెలిపారు. సంజయ్ కుమారుడి ఫిర్యాదు, అమ్మాయి తల్లి ఫిర్యాదును బేరీజు వేసుకుని.. అమ్మాయి స్టేట్‌మెంట్‌ను తీసుకొని పోలీసులు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం తొందరపడి ఉంటే.. వెయ్యి మంది పోలీసులతో ఇంటిమీద పడ్డారంటూ అంతా విమర్శించే వారని అన్నారు. మైనర్ బాలిక కేసులో ఎటా పడితే అలా చేయడానికి వీల్లేదన్నారు. ‘బండికి సహాయం చేయాలంటే పోక్సో కేసు పెట్టం కదా! పోక్సో కేసు పెట్టామంటేనే మా కమిట్మెంట్ ఏంటో తెలుస్తుంది కదా!’ అని సీఎం వ్యాఖ్యానించారు. బండి సంజయ్, బీఆర్‌ఎస్ మధ్య ఎక్కడ చెడిందో తనకు తెలియదన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనాన్ని వ్యతిరేకించడం వల్లనే సంజయ్‌పై కేటీఆర్ కోపంతో ఉన్నట్లున్నారని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇప్పుడు పోలీసు ఆఫీసర్ కాదని గుర్తుంచుకోవాలన్నారు. పోక్సో కేసు పెడితే బెదిరించినట్లా? లేక బాధితురాలి పక్షాన ఉన్నట్లా? అని ప్రశ్నించారు. డిసెంబరుకు ముందు జరిగిన ఘటనపై ఫిర్యాదు వచ్చిందని, 4 నెలలు వెనక్కి వెళ్లి అప్పటి ఘటనలను విచారించాలంటే సమయం పడుతుందని చెప్పారు. నోటీసులపై స్పందించకపోతే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్నారు. తనను జైల్లో పెట్టిన కేసీఆర్ కుటుంబం పట్ల తాను కఠినంగా వ్యవహరించలేదని తెలిపారు. తాను సత్రం నడపడం లేదని, ప్రభుత్వాన్ని నడుపుతున్నానని వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు.. ఎవరైనా తనకు మినహాయింపులు లేవని స్పష్టం చేశారు.