Share News

తవ్విన కొద్దీ కాసుల పంట

ABN , Publish Date - Aug 28 , 2026 | 04:37 AM

గనులశాఖలో అవినీతి తిమింగలం బయటపడింది. ఇసుక అక్రమ రవాణా దారులతో కుమ్మక్కై గనులశాఖ జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) బొజ్జ జయరాజ్‌ రూ.25 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ తనిఖీల్లో తేలింది

తవ్విన కొద్దీ కాసుల పంట
AD jayaraju

  • భూపాలపల్లి గనులశాఖ ఏడీ జయరాజ్‌ అవినీతి లీలలు

  • ఇసుక అక్రమ రవాణా దారుల నుంచి మామూళ్లు

  • కారు డ్రైవర్‌ ద్వారా వసూళ్లు.. కూతురు ఖాతాకు బదిలీ

  • హైదరాబాద్‌ సహా 8 చోట్ల ఏసీబీ తనిఖీలు

  • 25 కోట్ల విలువైన అక్రమార్జన గుర్తింపు

హైదరాబాద్‌/ భూపాలపల్లి/ తాండూరు, ఆగస్టు 27 (ఆంధ్ర జ్యోతి): గనులశాఖలో అవినీతి తిమింగలం బయటపడింది. ఇసుక అక్రమ రవాణా దారులతో కుమ్మక్కై గనులశాఖ జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) బొజ్జ జయరాజ్‌ రూ.25 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ తనిఖీల్లో తేలింది. ఆయనపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ.. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లోని జయరాజ్‌ ఇల్లు, భూపాలపల్లి కలెక్టరేట్‌ సహా 8 ప్రాంతాల్లో గురువారం ఏక కాలంలో సోదాలు జరిపింది. అక్రమార్జనలో కొత్త పుంతలు తొక్కిన జయరాజ్‌.. ఇసుక అక్రమ రవాణాదారుల నుంచి తన కారు డ్రైవర్‌ యాదయ్య మామూళ్లు వసూలు చేయించాడు. ఆ మామూళ్లు పలు దఫాల్లో యాదయ్య బ్యాంకు ఖాతా నుంచి జయరాజ్‌ కూతురు ఖాతాకు రూ.24.80 లక్షలు బదిలీ అయ్యాయని గుర్తించినట్లు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ చారు సిన్హా తెలిపారు. ఇసుక అక్రమ రవాణా దారులు, తదితరుల నుంచి జయరాజ్‌ ఆదేశాలకు అనుగుణంగా డబ్బు వసూలు చేసి ఆయన కూతురు బ్యాంకు ఖాతాకు ఆన్‌లైన్‌లో బదిలీ చేశానన్న డ్రైవర్‌ యాదయ్య వాంగ్మూలం ఆధారంగా మరింత నిశితంగా దర్యాప్తు జరుగుతుందని ఏసీబీ అధికారులు చెప్పారు.


2.09 కోట్ల విలువైన పత్రాలు

తమ దర్యాప్తులో కారు డ్రైవర్‌ వాంగ్మూలం కీలకమైందన్న ఏసీబీ అధికారులు.. జయరాజ్‌ ఇంట్లో రూ.10.03 లక్షల నగదు, రూ.19.86 లక్షల ఎల్‌ఐసీ, మ్యాక్స్‌ లైఫ్‌ పొదుపు పాలసీలు, రూ.40 లక్షల విలువైన మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను గుర్తించారు. ఇంకా రూ.37.23 లక్షల విలువైన 629 గ్రాముల బంగారం ఆభరణాలు, రూ.10.67 లక్షల విలువ గల గృహోపకరణాలు, పోస్టాఫీసు పొదుపు పధకాల్లో రూ.20.86 లక్షల పెట్టుబడులు, 3 బ్యాంకు ఖాతాల్లో రూ.71.27 లక్షల నిల్వలున్నట్లు తేలిందని ఏసీబీ అధికారులు తెలిపారు.

స్థిరాస్తులుగా అక్రమార్జన మార్పిడి

జయరాజ్‌ తన అక్రమార్జనను స్తిరాస్తులుగా మార్చుకున్నారు. బోడుప్పల్‌లో రూ.40. లక్షల విలువైన జీ ప్లస్‌ టూ భవనం, కేపీహెచ్‌బీ కాలనీలో రూ. 32.81 లక్షల విలువైన ఫ్లాట్‌, కీసరలో రెండు ఫ్లాట్లతోపాటు తుంగతుర్తి, తుప్రాన్‌, సూర్యాపేటల్లో ఐదు ఇళ్ల స్ధలాలు.. 3.21 ఎకరాల వ్యవసాయ భూమి ఆయన కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువ రూ.3.06 కోట్లు కాగా, మార్కెట్‌ విలువ పలు రెట్లు ఎక్కువ అని చెప్పారు. ఇటీవల భూపాలపల్లి జిల్లా ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం అందుకున్న జయరాజ్‌.. 2009-16 మధ్య రంగారెడ్డి జిల్లా గనులశాఖ ఏడీగా పని చేశారు. తాండూరులోని ల్యాట్‌రైట్‌ వ్యాపారితో 2012లో వాటాదారుడిగా ఉన్నట్లు భూపాలపల్లి కలెక్టరేట్‌లో దొరికిన రికార్డులు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ములుగు జిల్లాకూ ఇన్‌చార్జిగా ఉన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఈ10 పెట్రోల్‌పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు: బీపీసీఎల్

కైలాస మానస సరోవర యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

Updated Date - Aug 28 , 2026 | 04:37 AM