ఈ10 పెట్రోల్‌పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు: బీపీసీఎల్
ABN , Publish Date - Aug 27 , 2026 | 07:50 PM
ఈ20తో పాటు ఈ10ను కూడా అందుబాటులో ఉంచే అంశంపై ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు చర్చిస్తున్నాయని బీపీసీఎల్ ఛైర్మన్, ఎమ్‌డీ సంజయ్ ఖన్నా తెలిపారు. ఈ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో పాత మోడల్ వాహనాల కోసం ఈ10 పెట్రోల్ అందుబాటులో ఉండాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ20 పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పెట్రోల్‌తో పాత వాహనాలు దెబ్బతింటాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లోని రెండో అతిపెద్ద రిటైల్ ఇంధన సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ20తో పాటు ఈ10ను కూడా అందుబాటులో ఉంచే అంశంపై ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు చర్చిస్తున్నాయని బీపీసీఎల్ ఛైర్మన్, ఎమ్‌డీ సంజయ్ ఖన్నా తెలిపారు. ఈ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అయితే, ఈ20 స్థానంలో ఈ10 పెట్రోల్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు.
ఈ10 పెట్రోల్‌నూ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తమకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని సంజయ్ ఖన్నా తెలిపారు. ‘ఈ20 పెట్రోల్‌ను ఇప్పటికే సరఫరా చేస్తున్నాము. కాబట్టి ఈ10కి మారడం మాకు సమస్య కాదు. ఇతర కంపెనీలు వేటికి ఇది సవాలు కాబోదు’ అని ఆయన అన్నారు.
దేశంలోని పాత వాహనాలకు అనువుగా ఉండేందుకు ఈ10 పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ ఇటీవల అభిప్రాయపడ్డారు. ఈ20లో 20 శాతం ఇథనాల్, ఈ10లో 10 శాతం ఇథనాల్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే, బీఎస్-6 కంటే ముందుతరం వాహనాలు ఉన్న వారు ఈ20తో మైలేజీ పడిపోతోందని, వాహనాలు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
నేపాల్ వరదల్లో మాజీ కేంద్ర మంత్రి కోడలి గల్లంతు..
భార్య పుట్టింటికి వెళ్లాలంటే భర్త అనుమతి అవసరం లేదు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు