Municipal Elections: 38 మునిసిపాలిటీలు బీసీలకే..
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:15 AM
రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వార్డులతోపాటు చైర్‌పర్సన్లు, మేయర్ పదవులకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను...
మూడు మునిసిపల్ కార్పొరేషన్లు కూడా..
డెడికేటెడ్ కమిషన్ సిఫారసులతో 34ు కోటా ఖరారు
జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు..
అన్ని క్యాటగిరీల్లోనూ మహిళలకు 50శాతం సీట్లు
జీవో జారీ చేసిన మునిసిపల్ పరిపాలన శాఖ
హైదరాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వార్డులతోపాటు చైర్‌పర్సన్లు, మేయర్ పదవులకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను నిర్ణయించింది. బీసీలకు 38 చైర్‌పర్సన్, 3 మేయర్ పదవులను (34 శాతం) స్థానాలు బీసీలకు కేటాయించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు (జీవో నంబర్ 14) జారీ చేశారు. 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు అగునుణంగా బీసీ రిజర్వేషన్లను, జనాభా దామాషా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను నోటిఫై చేసినట్టు ఉత్తర్వులలో వెల్లడించారు. అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50శాతం సీట్లను రిజర్వు చేసినట్టు వివరించారు. తెలంగాణ మున్సిపల్ చట్టం-2019లోని సెక్షన్ 7, 28, 29 ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం, అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ జీవోను ఆధారంగా తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
జీహెచ్‌ఎంసీలో 122 వార్డులు బీసీలకు..
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ వివిధ కేటగిరీల వారీగా రిజర్వేషన్లను జీవోలో వెల్లడించారు. స్థానికంగా ఉన్న జనాభా ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కేటగిరీల వారీగా వార్డుల రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. బీసీలకు అత్యధికంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 60 వార్డులకుగాను 26 వార్డులు (43శాతం), నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 వార్డులకుగాను 24 (40శాతం) దక్కాయి. అత్యల్పంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 వార్డులకుగాను 7 వార్డులు (11శాతం), రామగుండం కార్పొరేషన్‌లో 60 వార్డులకుగాను 16 వార్డులు (26శాతం) దక్కాయి. కొత్తగూడెంలో ఎస్టీ జనాభా, రామగుండంలో ఎస్సీ జనాభా అధికంగా ఉండటంతో.. ఆయా కేటగిరీలకు ఎక్కువ వార్డులు రిజర్వు అయ్యాయి. బీసీలకు తగ్గాయి. ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న చోట బీసీలకు వార్డులు పెరిగాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లోని మొత్తం 300 వార్డులకుగాను 122 వార్డులు (40శాతం) బీసీలకు కేటాయించారు. ఎస్టీలకు 5, ఎస్సీలకు 23, మహిళలకు 76 రిజర్వు చేయగా.. 74 వార్డులు అన్ రిజర్వుడ్‌గా ఉన్నాయి.