అప్పటి వరకూ ఏఐ జోలికెళ్లొద్దు.. స్టూడెంట్స్‌కు శ్రీధర్ వెంబు వార్నింగ్
ABN , Publish Date - Jun 04 , 2026 | 10:17 PM
మౌలిక అంశాలపై పట్టు సాధించే వరకూ విద్యార్థులు ఏఐ వినియోగించకపోవడమే మంచిదని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అన్నారు. ఏఐ వినియోగించే విద్యార్థుల మేధో సామర్థ్యాలు తగ్గుతాయని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐపై ఆధారపడే విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా స్కూల్ పిల్లల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తుండటంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వాడే విద్యార్థుల్లో మేధో సామర్థ్యాలు తగ్గుతున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు రుజువు చేశాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను ఉద్దేశిస్తూ జోహో కార్పొరేషన్ అధినేత శ్రీధర్ వెంబు హెచ్చరిక చేశారు.
‘విద్యార్థుల్లో ఏఐ వాడకం పెరిగే కొద్దీ వారి మార్కులు తగ్గుతున్న వైనాన్ని ప్రొఫెసర్లు గుర్తిస్తున్నారు. ఇలాంటి విద్యార్థుల గణిత సామర్థ్యాలు తగ్గుతున్నట్టు యూసీ బర్క్‌లీ నివేదికలో వెలుగులోకి వచ్చింది. ఏఐతో మీరు త్వరితగతిన మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ మేధో సామర్థ్యాలు అంతే వేగంగా తగ్గుతాయి. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు ఏఐ వాడకపోవడమే మంచిదనేది నా అభిప్రాయం. మౌలిక సూత్రాలపై పట్టు సాధించే వరకూ విద్యార్థులు ఏఐ జోలికి వెళ్లకూడదు’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఏఐ సామర్థ్యాలు పెరిగే కొద్దీ కెరీర్ అనేది అర్థరహితంగా మారొచ్చని కూడా శ్రీధర్ వెంబు గతంలో ఒకసారి కామెంట్ చేశారు. మానవసంబంధాలే కేంద్రంగా సాగే ఉద్యోగాలకే భవిష్యత్తులో విలువైనవిగా మారతాయని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏఐతో టెకీలకు జాబ్స్ పెరుగుతున్నాయ్: ఎన్‌విడియా సీఈఓ
వాడకం అంటే ఇదీ.. ఏఐతో పావురాల బెడదకు చెక్