పారిస్‌లో ఆలోచన.. హైదరాబాద్‌లో ఆచరణ !
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:10 AM
పీఆర్ వచ్చిందంటే చాలు, ‘ఇండియా మొహమే చూడాల్సిన అవసరం లేదురా భయ్..’ అన్నట్లుంటుంది చాలామంది ఆలోచన.
ఆధునిక వైద్యవిద్యకు కొత్తబాట.. ఏఐ వర్చువల్ పేషంట్లతో శిక్షణ
సైబర్ సెక్యూరిటీ మొదలు క్వాంటమ్ టెక్నాలజీ వరకూ ప్రతి రంగంలోనూ తనదైన ప్రస్థానం
సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ వైద్య విద్యార్థులకు చేరువ చేసే ప్రయత్నం
స్ఫూర్తిదాయకంగా రాకేశ్ గుంటి ప్రయాణం
హైదరాబాద్ సిటీ(ఆంధ్రజ్యోతి): పీఆర్ వచ్చిందంటే చాలు, ‘ఇండియా మొహమే చూడాల్సిన అవసరం లేదురా భయ్..’ అన్నట్లుంటుంది చాలామంది ఆలోచన. ఓ దేశ పౌరునిగా గుర్తింపు వచ్చిన తరువాత కూడా మాతృదేశంపై మమకారం వీడకుండా, తాను పుట్టిన గడ్డకు ఏదో ఒకటి చేయాలనే తలపు ఉన్న వారు అతి అరుదుగా ఉంటుంటారు. మరీ ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో! ఈ అరుదైన కోవకు చెందిన వ్యక్తి రాకేశ్ గుంటి. ఇంజినీరింగ్ పూర్తికాగానే అందరిలా విదేశాలకు క్యూ కట్టినా, ఏదో సాధించాలన్న తపన అతన్ని సొంత కంపెనీ పెట్టేలా చేసింది. ఏఐ ఆధారిత క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాలలో సేవలనందిస్తూనే, కొత్త సాంకేతికతలను అన్వేషించాలనే కోరిక, తాను నేర్చుకున్న అంశాలను భావితరాలకు ఉపయోగపడేలా మెరుగ్గా తీర్చిదిద్దాలనే ఆశయం.. ఇప్పుడతనిని వైద్య విద్యార్థుల కోసం వినూత్న ఆవిష్కరణలను చేసేలా చేసింది. ‘రేస్ హై’ అంటూ ఓ టెక్నాలజీ సంస్థను ప్రారంభించిన అతను, వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాల్టీ, క్లినికల్ స్టిమ్యులేషన్ పద్ధతుల ద్వారా హైదరాబాద్ కేంద్రంగా ఏఐ ఆధారిత వర్చువల్ పేషెంట్లతో వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అంతేనా, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న వైద్య సాంకేతికతపై అవగాహన పెంపొందించే ప్రయత్నాలనూ చేస్తున్నారు.
సాంకేతిక అభివృద్ధి అనేది సమాజానికి ప్రయోజనం చేకూర్చాలని చెప్పే రాకేశ్, తాను పుట్టిన నేల హైదరాబాద్ నుంచే ఆ సామాజిక ప్రయోజనం సాకారం కావాలనుకుంటున్నాడు. ఆ దిశగా తన ప్రయత్నాలనూ ముమ్మరం చేస్తోన్న రాకేశ్ ప్రయాణం మాత్రం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ఓ టెక్నాలజీ సంస్థకు సీఈఓనే కావొచ్చు కానీ, తాను నిత్య విద్యార్థినే అని చెప్పుకునే రాకేశ్ ప్రస్తుతం క్వాంటం టెక్నాలజీలో పీహెచ్‌డీ చేస్తూనే, క్రిప్టో, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, ఏఐ సహా రంగాలలో సేవలనూ ప్రపంచవ్యాప్తంగా తమ రేస్ హై సంస్థ ద్వారా అందిస్తున్నాడు, కొత్తగా డిజిటల్ వైద్య విద్య రంగంలో అడుగుపెట్టబోతున్న అతను, విజ్ఞానం మనం పొందడం కాదు, ఆ ప్రయోజనాలను ప్రతి ఒక్కరికీ చేరువచేయాలని తపిస్తోన్నారు.
అనుభవమే పునాది..!
రాకేశ్ గుంటి ప్రస్థానం సాంకేతిక రంగంలో సంపాదించిన అనుభవంతో మొదలైంది. అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్‌లో కుబెర్నెటీస్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న సమయంలోనే క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా నిర్వహణ వంటి విభాగాల్లో పనిచేసే అవకాశం ఆయనకు లభించింది. డిజిటల్ వ్యవస్థలను సమర్థంగా నిర్వహించడం, వాటి భద్రతను కాపాడడం, సంస్థల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిష్కారాలను రూపొందించడం వంటి అంశాలపై ఆయనకు అనుభవం ఏర్పడింది. ఆ అనుభవంతోనే రేస్‌హై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రారంభించారు. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవోగా సైబర్ భద్రత, క్లౌడ్ కంప్యూటింగ్ సేవలపై దృష్టి పెట్టారు. డిజిటల్ మౌలిక సదుపాయాలను సురక్షితంగా నిర్వహించడం, క్లౌడ్ సేవలను అవసరాలకు అనుగుణంగా విస్తరించడం వంటి అంశాలు రేస్‌హై కార్యకలాపాల్లో కీలకమైనవైతే, ఒక సంస్థకు నాయకత్వం వహిస్తూనే కొత్త సాంకేతికతలను నేర్చుకోవాలన్న తపన ఆయనను క్వాంటమ్ టెక్నాలజీలో పరిశోధనలకు పురికొల్పింది.
క్వాంటమ్.. అదే మూమెంటమ్..!
కంప్యూటింగ్ రంగంలో కొత్త అవకాశాలను తెరవగల సాంకేతికతగా క్వాంటమ్ కంప్యూటింగ్‌పై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. సాంప్రదాయ కంప్యూటర్లు పనిచేసే విధానానికి భిన్నమైన సూత్రాల ఆధారంగా ఇది పనిచేస్తుంది. కొన్ని సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే అవకాశం ఈ సాంకేతికతకు ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ సాంకేతికత విస్తృత వినియోగంలోకి రావడానికి ఇంకా అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంది. అది గుర్తించే తాను క్వాంటమ్ టెక్నాలజీలో పరిశోధనలు చేస్తున్నానన్నారు రాకేశ్. ముఖ్యంగా భవిష్యత్తులో కంప్యూటింగ్ సామర్థ్యాలు పెరిగే కొద్దీ డిజిటల్ సమాచారాన్ని రక్షించే విధానాలూ మరింత పటిష్ఠంగా ఉండాల్సిన అవసరం ఉందంటోన్న ఆయన, క్వాంటమ్-సేఫ్ క్రిప్టోగ్రఫీ వంటి భద్రతా విధానాలపై పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. క్రిఫ్టోకరెన్సీపై తనకు అమితాసక్తి ఉందని, ఆ ఆసక్తితోనే ఈ రంగంలో పరిశోధనలనూ చేస్తున్నానని వెల్లడించారు.
వైద్య రంగానికి సాంకేతిక భరోసా..
ఆసుపత్రుల్లో భద్రపరిచే వైద్య నివేదికలు, పరీక్షల ఫలితాలు, చికిత్స వివరాలు రోగులకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం. ఈ వివరాలు అనధికార వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినా, సైబర్ దాడులకు గురైనా రోగుల గోప్యతకు ముప్పు ఏర్పడుతుంది. టెలిమెడిసిన్, ఆన్‌లైన్ సంప్రదింపులు, డిజిటల్ రికార్డుల వినియోగం పెరుగుతున్న కొద్దీ వైద్య రంగంలో సమాచార భద్రతకు ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. సైబర్ భద్రత, క్లౌడ్ కంప్యూటింగ్‌లో తనకున్న పరిజ్ఞానాన్ని వైద్య రంగ అవసరాలతో అనుసంధానించాలన్నది రాకేశ్ ఆలోచన. ఆసుపత్రుల డిజిటల్ రికార్డులను సురక్షితంగా నిర్వహించడం, రోగుల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడం, ఆన్‌లైన్ వైద్య సేవల్లో గోప్యతను కాపాడడం వంటి అంశాలకు తాము ప్రాధాన్యతనిస్తున్నామంటున్నారు. సాంకేతికతను వైద్య రంగంలోకి తీసుకురావడమంటే కొత్త సాధనాలను అందుబాటులోకి తేవడమే కాదు.. వాటి వినియోగంలో రోగుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా అని చెప్పే రాకేశ్, కృత్రిమ మేధ (ఏఐ), వైద్య చిత్రాల విశ్లేషణ, క్వాంటమ్ అల్గారిథమ్‌ల వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు రోగ నిర్ధారణ, ఔషధ పరిశోధనల్లో ఎలాంటి అవకాశాలను అందించగలవన్న అంశాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. క్యాన్సర్ గుర్తింపు, ఎంఆర్‌ఐ, పీఈటీ స్కాన్ల విశ్లేషణ, కొత్త ఔషధాల రూపకల్పన వంటి రంగాల్లో వీటి సామర్థ్యాలను పరిశీలిస్తున్నారంటూనే, ఇవి ఇంకా పరిశోధన, అభివృద్ధి అవసరమైన రంగాలే అయినప్పటికీ, భవిష్యత్తులో వైద్య సేవలను మెరుగుపరిచే అవకాశాలున్నాయి. సాంకేతికత, వైద్యం మధ్య ఈ అనుసంధానాన్ని తాము చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
వైద్య విద్యార్థులకు కొత్త అభ్యాస పద్ధతులు..
వైద్య రంగంలో సాంకేతికత వినియోగం చికిత్సతోనే ఆగిపోదు. విద్యార్థుల శిక్షణలోనూ కొత్త పద్ధతులకు అవకాశం కల్పిస్తోంది. ఏఐ ఆధారిత వర్చువల్ పేషెంట్లు, వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), క్లినికల్ సిమ్యులేషన్ వంటి సాధనాల ద్వారా వైద్య విద్యార్థులు వాస్తవ పరిస్థితులను పోలిన సందర్భాలను అర్థం చేసుకోవచ్చు. రోగితో ఎలా వ్యవహరించాలి, వివిధ లక్షణాలను ఎలా విశ్లేషించాలి, వైద్య పరిస్థితుల్లో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి వంటి నైపుణ్యాలను అభ్యసించేందుకు ఇవి తోడ్పడగలవు.
రేస్‌హై ద్వారా వైద్య విద్యార్థులకు సాంకేతిక అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంపై తామిప్పుడు దృష్టి సారించామంటున్నారు రాకేశ్. ‘మెడికల్ అవతార్‘ కార్యక్రమాలు, క్విజ్‌లు, విద్యార్థుల పాడ్‌కాస్ట్‌లు, సెమినార్లు, వెబినార్లు, వర్క్‌షాప్‌లు, నిపుణులతో చర్చలు, పరస్పర బోధన వంటి కార్యక్రమాల ద్వారా కొత్త విషయాలను నేర్చుకునే వాతావరణాన్ని ప్రోత్సహించాలన్నది తమ ఆలోచనగా చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో వైద్య సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, వైద్యం- సాంకేతికతల మధ్య ఉన్న సంబంధాన్ని పరిచయం చేయడం ఈ ప్రయత్నాల్లో ముఖ్యమైన అంశాలుగా చెబుతున్న రాకేశ్, వైద్యుల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందన్నది ఈ సాంకేతికతల ఉద్దేశం కాదు. వైద్య సమాచారాన్ని విశ్లేషించడం, కొన్ని ప్రమాద సూచనలను గుర్తించడం, రికార్డుల నిర్వహణలో తోడ్పడడం వంటి పనులకు ఇవి ఉపయోగపడవచ్చన్నారు.
నేర్చుకున్నది ఉపయోగపడాలి..
ఎదగడం అంటే వ్యక్తిగత విజయాలను సాధించడమే కాదు, మనం నేర్చుకున్నది మరొకరికి ఉపయోగపడేలా చేయడం అని చెప్పే రాకేశ్, వైద్య, సాంకేతిక రంగాల్లోని సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలను అన్వేషిస్తున్నారు. కురేలా కాగ్నిటివ్, హెల్త్ నావిగ్, డాక్టిన్ ఇన్నోవేషన్స్ పైవ్రేట్ లిమిటెడ్, భూమి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్, కూరపాటి హాస్పిటల్స్ వంటి సంస్థలతో భాగస్వామ్య అవకాశాల కోసం కృషి చేస్తున్నామన్నారు ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే వైద్య విద్య, డిజిటల్ భద్రత, సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి సంబంధించిన కార్యక్రమాలను మరింత విస్తరించే అవకాశం ఉంటుందన్నది ఆయన అభిప్రాయం.
నిరంతరం నేర్చుకోవాలి.. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను గమనించాలి..
పారిస్‌లో నివసిస్తున్నా హైదరాబాద్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తున్న రాకేశ్ గుంటి, విద్యార్థులతో తన అనుభవాలను పంచుకోవడానికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే ఉస్మానియా వంటి యూనివర్శిటీల విద్యార్థులతో ముచ్చటించిన ఆయన, ఒకే రంగానికి ఎప్పుడూ పరిమితం కావద్దని సూచిస్తున్నారు. ఇతర విభాగాల సమస్యలను అర్థం చేసుకోవాలని, సాంకేతికతను సమాజానికి ఉపయోగపడే పరిష్కారాల కోసం వినియోగించాలని యువతకు సూచిస్తున్నారు.
నిరంతరం నేర్చుకోవడం, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను గమనించడం, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం, సమస్యలకు పరిష్కారాలు వెతకడం.. ఇవే మనల్ని ముందుకు తీసుకువెళ్తాయని ఉద్భోదించే ఈ 28 ఏళ్ల కుర్రాడు, ఒక సంస్థకు నాయకత్వం వహిస్తూనే క్వాంటమ్ టెక్నాలజీలో పరిశోధన కొనసాగించడం ద్వారా నేర్చుకోవడానికి వయసు, హోదా అడ్డంకులు కావనీ చెబుతున్నారు. నేర్చుకోవడం ఆపేశామంటే మనం పోటీలో వెనుకబడిపోతున్నామనే అని నమ్ముతాననే రాకేశ్, ఉద్యోగం సంపాదించడమే కాకుండా, కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని యువతనుప్రోత్సహిస్తున్నారు.