కాంస్యం.. మురిపెం!
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:46 AM
భారత వర్ధమాన డబుల్స్ జోడీ గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ మరోసారి అసాధారణ పోరాట పటిమ ప్రదర్శించింది..ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌ప క్వార్టర్‌ఫైనల్లో మూడు గేమ్‌లపాటు...
సెమీఫైనల్లో గాయత్రి జోడీ పరాజయం
భారత జంట ఖాతాలో తొలి పతకం
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌ప
భారత వర్ధమాన డబుల్స్ జోడీ గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ మరోసారి అసాధారణ పోరాట పటిమ ప్రదర్శించింది..ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌ప క్వార్టర్‌ఫైనల్లో మూడు గేమ్‌లపాటు పోరాడి నాలుగో సీడ్, చైనా ప్రత్యర్థిని మట్టి కరిపించిన గాయత్రి జంట.. సెమీఫైనల్‌లోనూ అదే స్థాయిలో సత్తా చాటింది.. టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ లియు షెంగ్‌షూ/టాన్ నింగ్ ద్వయానికి ముచ్చెమటలు పట్టించింది..తొలి గేమ్ గెలిచి ప్రత్యర్థికి సవాలు విసిరింది..అయితే అనుభవాన్ని రంగరించిన చైనా జోడీ మిగతా రెండు గేములు గెలిచి ఫైనల్ చేరింది. దాంతో సెమీస్ ప్రదర్శనతో లభించిన కాంస్య పతకం మురిపెంతో భారత జోడీ మెగా టోర్నీ నుంచి వెనుదిరిగింది.
న్యూఢిల్లీ: వరల్డ్ బ్యాడ్మింట్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల డబుల్స్ యువ జంట గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ జోరు సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ్‌సలో అన్‌సీడెడ్ గాయత్రి ద్వయం 21-18, 13-21, 8-21తో మేటి చైనా జోడీ లియు షెంగ్‌షూ/టాన్ నింగ్ చేతిలో పరాజయం చవిచూసింది. దాంతో కాంస్య పతకంతో భారత జోడీ ఈ పోటీలను చిరస్మరణీయం చేసుకుంది. గంటా 11 నిమిషాల మ్యాచ్‌లో గాయత్రి/ట్రీసా జోడీ తొలి గేమ్ నెగ్గి చైనా జంటను ఒత్తిడిలోకి నెట్టింది. కానీ తర్వాతి రెండు గేముల్లో అదే దూకుడును ప్రదర్శిం చడంలో భారత ద్వయం విఫలమై మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో బేక్/లీ (దక్షిణ కొరియా) జోడీతో షెంగ్/టాన్ తలపడుతుంది. పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో కడాయ్ నరోక (జపాన్)-అలెక్స్ లానియర్ (ఫ్రాన్స్) అమీతుమీ తేల్చుకుంటారు. మహిళల సింగిల్స్ టైటిల్ కోసం అన్ సే యంగ్ (కొరియా), అకానె యమగూచి (జపాన్) ఢీకొంటారు. పురుషుల డబుల్స్‌లో టైటిల్ ఫైట్‌లో వాంగ్/లియాంగ్ (చైనా)-లీ/యాంగ్ (తైపీ) తలపడతారు. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో ఫెంగ్ యాంగ్/హువాంగ్ డాంగ్ (చైనా)-థామ్ గిక్వెల్/డెల్ఫిన్ డెల్రూ (ఫ్రాన్స్) ఢీకొంటారు.

సరిలేరు మీకెవ్వరు!
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
ఇద్దరి వయసు 23 ఏళ్లే. గాయత్రీ గోపీచంద్, ట్రీసా జాలీ ఆటలో క్లాస్, మాస్ కనిపిస్తుంది. ట్రీసా దూకుడుగా, అటాకింగ్ గేమ్‌తో అదరగొడుతుంది. మ్యాచ్ గెలవగానే సింహనాదం చేస్తుంది. గాయత్రి గెలిచినా, ఓడినా స్థిరచిత్తంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరంగా ఉంటూ ఏకాగ్రత చెదరనీయదు. పాయింట్లు రాబట్టడంపైనే దృష్టి పెడుతూ, అవసరమైనప్పుడు మాత్రమే దూకుడు ప్రదర్శిస్తుంది. భిన్న ధ్రువాలుగా ఉన్న వీళ్లిద్దరు కలిసి ఇప్పుడు మహిళల డబుల్స్‌లో భారత నెంబర్‌వన్ జోడీగా మారారు. నైపుణ్యాల పరంగా ఇద్దరూ ఒక్కటే. కోర్టులో ప్రత్యర్థి కదలికలను బట్టి ట్రీసా ఆడితే, పరిస్థితికి తగ్గట్టుగా గాయత్రి ముందుకెళుతుంది. కేరళకు చెందిన ట్రీసా 2020లో గోపీచంద్ అకాడమీలో ప్రవేశించింది. 2021లో గాయత్రితో జతకట్టింది. ఇద్దరూ కలిసి తొలిసారిగా పోలిష్ ఓపెన్‌లో ఆడి రన్నర్‌పగా నిలిచారు. ఆ వెంటనే ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్‌లో స్వర్ణం, వేల్స్ టోర్నీలో రజతం గెలిచారు. 2022లో ఆలింగ్లండ్ ఓపెన్ సెమీఫైనల్ చేరి ఈ ఘనత సాధించిన భారత మహిళల డబుల్స్ జోడీగా నిలిచారు. అదే ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం కొల్లగొట్టి ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకెళ్లారు. 2024లో సయ్యద్ మోడీ టోర్నీ నెగ్గిన ఈ జోడీ.. మరుసటి ఏడాది టైటిల్ నిలబెట్టుకొని సత్తా చాటింది. ఈ ఏడాది ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్‌లో విజేతగా నిలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రపంచ చాంపియన్‌షి్‌పలో అడుగుపెట్టింది. సింగిల్స్‌లో సింధు, లక్ష్యసేన్‌లాంటి భారత స్టార్లు విఫలమైనా, డబుల్స్‌లో గాయత్రి, ట్రీసా జోడీ వరుస విజయాలతో పతకంపై ఆశలు రేపింది. రౌండ్ రౌండ్‌కూ మెరుగవుతూ, ఆధిపత్యాన్ని చాటుకుంటూ ముందుకెళ్లిన ఈ జంట క్వార్టర్స్‌లో చైనాకు చెందిన నాలుగో సీడ్‌ను చిత్తుచేసి పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్ చేరలేకపోయినా, సెమీ్‌సలో డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నెంబర్‌వన్ జంటకు గట్టి పోటీ ఇచ్చి వెనుదిరిగింది. గెలిచింది కాంస్యమైనా.. మహిళల డబుల్స్‌లో సుదీర్ఘ విరామం తర్వాత లభించిన ఈ పతకం భారత్‌కు బంగారంతో సమానం. ఏళ్ల తరబడి చైనా, మలేసియా షట్లర్లకు పెట్టని కోటగా ఉన్న మహిళల డబుల్స్‌లో గాయత్రి, ట్రీసా సంచలన విజయాలు సాధించడం, తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం కొల్లగొట్టడం అద్భుతం.
2
ప్రపంచ చాంపియన్‌షిప్ మహిళల డబుల్స్‌లో పతకం సాధించిన రెండో భారత జోడీగా గాయత్రి-ట్రీసా జాలీ. అంతకుముందు 2011లో జ్వాల-అశ్విని జంట కాంస్యం నెగ్గింది.
16
ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత షట్లర్లు సాధించిన మొత్తం పతకాలు. వీటిలో ఓ స్వర్ణం, 4 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. అత్యధికంగా సింధు 5 పతకాలు (ఓ స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) అందుకుంది.
ఇవి కూడా చదవండి
ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్