స్టార్ల జోరు
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:29 AM
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్‌లో స్టార్ల జోరు కొనసాగుతోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టాప్ ర్యాంకర్లు సబలెంక, అల్కారజ్, మూడో సీడ్లు కొకొ గాఫ్, జ్వెరెవ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు...
ఆస్ట్రేలియన్ ఓపెన్
మూడో రౌండ్‌కు అల్కారజ్, సబలెంక
గాఫ్, ఆండ్రీవా, పౌలినీ ముందుకు
మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్‌లో స్టార్ల జోరు కొనసాగుతోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టాప్ ర్యాంకర్లు సబలెంక, అల్కారజ్, మూడో సీడ్లు కొకొ గాఫ్, జ్వెరెవ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు. బుధవారం జరిగిన రెండో రౌండ్లో అల్కారజ్ 7-6(4), 6-3, 6-2తో యానిక్ హన్మాన్‌పై, గతేడాది రన్నరప్ జ్వెరెవ్ 6-3, 4-6, 6-3, 6-4తో ముల్లర్‌పై, 6వ సీడ్ అలెక్స్ డిమినార్ 6-7(7), 6-2, 6-2, 6-1తో హమాద్‌పై, 10వ సీడ్ బబ్లిక్ 7-5, 6-4, 7-5తో ఫుస్కోవిక్స్‌పై, 11వ సీడ్ మెద్వెదెవ్ 6-7(9), 6-3, 6-4, 6-2తో క్వెంటిన్‌పై గెలిచి మూడోరౌండ్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు చాంపియన్ సబలెంక 6-3, 6-1తో జోగ్జువాన్‌పై, అమెరికా యువతార గాఫ్ 6-2, 6-2తో డానిలోవిచ్‌పై, 7వ సీడ్ జాస్మిన్ పౌలినీ 6-2, 6-3తో మగ్దలీనాపై, 8వ సీడ్ మిర్రా ఆండ్రీవా 6-0, 6-4తో సక్కారిపై, 12వ సీడ్ స్విటోలినా 7-5, 6-1తో క్లిమోవికోవాపై అలవోకగా నెగ్గి మూడో రౌండ్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. ఇక, అనస్తేసియా పొటపోవా 7-6(3), 6-2తో రదుకానును చిత్తు చేసి మూడో రౌండ్లో సబలెంకతో అమీతుమీకి సిద్ధమైంది. ఇక.. భారత ఆటగాడు యుకీ భాంబ్రీ డబుల్స్‌లో శుభారంభం చేశాడు. పురుషుల డబుల్స్‌లో ఆరంభ రౌండ్లో 10వ సీడ్ యుకీ/ఆండ్రీ గోరాన్సన్ (స్వీడన్) జోడీ 6-3, 6-4తో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ, స్వీడన్ జంట జేమ్స్ డక్‌వర్త్/క్రజ్ హెవిట్‌పై గెలిచింది.
‘రికార్డు’స్థాయిలో హాజరు
మెల్‌బోర్న్ పార్క్‌లో స్టార్ల ఆటను వీక్షించేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు. నాలుగో రోజు రికార్డుస్థాయిలో ప్రేక్షకులు స్టేడియాలకు హాజరయ్యారు. సబలెంక, అల్కారజ్, గాఫ్‌లాంటి స్టార్ల మ్యాచ్‌లు ఉండడంతో బుధవారం ఏకంగా 1,03,720 మంది ప్రత్యక్షంగా హాజరై పోటీల (డే, నైట్ సెషన్)ను వీక్షించారు. ఒకరోజు ఇంతమంది అభిమానులు స్టేడియానికి రావడం ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ నాలుగు రోజుల్లోనే 4,04,000కు పైగా ప్రేక్షకులు మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించారని టోర్నీ నిర్వాహకులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..