Share News

ఇదికదా కిక్‌!

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:10 AM

‘ఈసారి ఫిఫా వరల్డ్‌క్‌పను స్పెయిన్‌ జట్టు గెలుచుకుంటుంది..’ రెండు నెలల క్రితం గోల్డ్‌మన్‌ సాక్స్‌ అనే సంస్థ ఆయా జట్ల ఆటగాళ్ల ప్రదర్శన, నిలకడను ఆధారంగా చేసుకుని తేల్చి చెప్పిన విషయమిది...

ఇదికదా కిక్‌!

‘ఈసారి ఫిఫా వరల్డ్‌క్‌పను స్పెయిన్‌ జట్టు గెలుచుకుంటుంది..’ రెండు నెలల క్రితం గోల్డ్‌మన్‌ సాక్స్‌ అనే సంస్థ ఆయా జట్ల ఆటగాళ్ల ప్రదర్శన, నిలకడను ఆధారంగా చేసుకుని తేల్చి చెప్పిన విషయమిది. ఆ సమయంలో ఈ అంచనాను ఎవరూ సీరియ్‌సగా తీసుకోకపోయినా.. మెగా టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడింది మొదలు చాంపియన్‌గా నిలిచేంత వరకు స్పెయిన్‌ సాగించిన అప్రతిహత జైత్రయాత్రకు ప్రత్యర్థి జట్లు నివ్వెరపోయాయి. వాస్తవానికి తాజా టోర్నీపై ఆ జట్టు ముద్ర అత్యంత బలీయమైంది. స్పానియార్డ్‌ పటిష్టమైన రక్షణ శ్రేణిని దాటుకుని ప్రత్యర్థి జట్లు కేవలం ఒక్క గోల్‌ మాత్రమే చేయగలిగాయి. క్వార్టర్‌ఫైనల్లో బెల్జియం ఆ ఘనత సాధించగలిగింది. మెస్సీ, రొనాల్డో, ఎంబాపె మాదిరి స్పెయిన్‌ జట్టులో చెప్పుకోదగ్గ స్టార్లు ఎవరూ లేకపోయినా.. సమష్టి ఆటతీరే తమ బలమని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ టోర్నీని గెలిచేందుకు తమ వ్యూహాలను కూడా మార్చుకుంది. బంతిని ఎక్కువసేపు తమ వద్దే ఉంచుకుని ప్రత్యర్థి అవకాశాలను వమ్ము చేసింది. అలాగే మిడిల్‌ గ్రౌండ్‌లో పూర్తి ఆధిపత్యంతో పాటు శక్తివంతమైన పాసింగ్‌, క్రమశిక్షణతో కూడిన డిఫెన్స్‌ స్పెయిన్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా నిలబెట్టాయి. గతంలో పలుమార్లు స్పెయిన్‌ ఎక్కువ పాసింగ్‌ చేసినా ఫలితం రాకపోయేది. కానీ ఈసారి మెగా టోర్నీలో పాసింగ్‌తో పాటు ఫినిషింగ్‌లోనూ మెరుగ్గా కనిపించింది.

టికి-టాకాను మెరుగు

పరిచి..: స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది వారి టికి-టాకా శైలి ఆటతీరే. ‘బంతి మన వద్ద ఉన్నంత వరకు ప్రత్యర్థి జట్టు గోల్‌ కొట్టలేదు’ అనే సిద్ధాంతమే ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. అందుకే స్పెయిన్‌ ఆటగాళ్లు ఎక్కువగా చిన్న చిన్న పాసులు ఇచ్చుకుంటూ బంతిని ఎక్కువ సమయం తమ అధీనంలోనే ఉంచుకుంటారు. అంతేకాకుండా మైదానంలో ముగ్గురు ఆటగాళ్లు ట్రయాంగిల్‌ ఆకారంలో ఉంటూ వన్‌ టు వన్‌ పాస్‌లు ఇచ్చుకుంటారు. ప్రత్యర్థి జట్ల డిఫెండర్లను తమ స్థానాల నుంచి బయటికి రప్పించి, గోల్స్‌ అవకాశాలను సృష్టించుకుంటారు. ఇదే రీతిన 2008-2012 వరకు ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఏలిందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో రెండు సార్లు (2008, 2012) యూరో కప్‌, 2010 వరల్డ్‌కప్‌ టైటిల్‌ కూడా నెగ్గింది. కానీ ఆ తర్వాత ఇతర జట్లు తమ డిఫెన్స్‌ను బలంగా మార్చుకుని ఈ శైలిపై ఆధిపత్యం చూపాయి. అయితే ప్రస్తుత కోచ్‌ లూయిస్‌ పుయెంటె బాధ్యతలు తీసుకున్నాక టికి-టాకా 2.0 రూపుదిద్దుకుంది. పాసులకే పరిమితం కాకుండా.. తమ ప్రత్యర్థుల మోహరింపుల్లో ఖాళీలను గుర్తించి దాడులు చేయడం ఆరంభించింది. ఇందుకు యువ వింగర్స్‌ యమాల్‌, విలియమ్స్‌లను రంగంలోకి దింపింది. ఈ మార్పులు పనిచేయగా తాజా టోర్నీలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో స్పెయిన్‌ 14 గోల్స్‌ చేయగలిగింది. అంతేకాకుండా అత్యధిక పాస్‌ల జాబితాలో టాప్‌-3లో స్పెయిన్‌ ఆటగాళ్లే ఉన్నారు. కెప్టెన్‌ రోడ్రి ఏకంగా 747 పాస్‌లు చేయడం విశేషం.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ఇవి కూడా చదవండి:

యమాల్ విజయం వెనుక నానమ్మ త్యాగం.. కష్టాల నుంచి ప్రపంచ స్టార్‌గా..!

రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ సూచన

Updated Date - Jul 21 , 2026 | 05:10 AM