Share News

రెండోసారి చిక్కేదెవరికి?

ABN , Publish Date - May 31 , 2026 | 04:35 AM

కళ్లు చెదిరే మెరుపు ఇన్నింగ్స్‌లు.. ఔరా అనిపించిన అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసాలు.. కట్టిపడేసిన బౌలర్ల మాయాజాలానికి ఆదివారంతో తెర పడనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-19వ సీజన్‌లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది.....

రెండోసారి చిక్కేదెవరికి?

రెండు నెలల ధనాధన్‌ క్రికెట్‌ సమరం చివరి దశకు చేరింది. ఐపీఎల్‌-19 పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలిచిన డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ మరోమారు ఢీ కొనబోతున్నాయి. అయితే ఈసారి ఎవరికీ మరో చాన్స్‌ లేదు. ఎందుకంటే ఇదే అంతిమ సమరం. గెలిచిన జట్టే సగర్వంగా కప్‌ అందుకుంటుంది. రెండు జట్ల ఖాతాలో ఇప్పటికే ఒక్కో టైటిల్‌ ఉంది. చేజింగ్‌లో దుమ్ము రేపే బెంగళూరు టైటిల్‌ను కాపాడుకుంటుందా? లేక బౌలింగ్‌ బలగంతో గుజరాత్‌ దెబ్బకు దెబ్బ తీసి సొంతగడ్డపై అదుర్స్‌ అనిపిస్తుందా? తమ ఖాతాలో రెండో ట్రోఫీ వేసుకునేదెవరు ? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

ముంబై: ళ్లు చెదిరే మెరుపు ఇన్నింగ్స్‌లు.. ఔరా అనిపించిన అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసాలు.. కట్టిపడేసిన బౌలర్ల మాయాజాలానికి ఆదివారంతో తెర పడనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-19వ సీజన్‌లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకు ప్రపంచంలోనే అతిపెద్ద నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియం వేదిక కానుంది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఇరు జట్లు నాలుగోసారి తలపడబోతున్నాయి. లీగ్‌ దశలో తమ సొంతగడ్డపై చెరో జట్టు నెగ్గగా, తొలి క్వాలిఫయర్‌లో టైటాన్స్‌ను ఆర్‌సీబీ 92 పరుగులతో చిత్తుచేసి ఫైనల్‌ చేరింది. తాజాగా నాలుగు రోజుల విశ్రాంతి తర్వాత రజత్‌ పటీదార్‌ సారథ్యంలోని ఆర్‌సీబీ టైటిల్‌ సమరానికి సై అంటోంది. అటు టైటాన్స్‌ రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ను ఓడించి తుది పోరులో ప్రవేశించింది. 2025లో ఆర్‌సీబీ, 2022లో గుజరాత్‌ విజేతలుగా నిలిచాయి. గిల్‌ ఆధ్వర్యంలో టైటాన్స్‌కిదే తొలి ఫైనల్‌. ఈ సీజన్‌లో టైటాన్స్‌ ఇక్కడ ఏడు మ్యాచ్‌లాడగా, ఐదింట్లో నెగ్గింది.

జోష్‌లో బెంగళూరు

వరుసగా రెండో టైటిల్‌ను పట్టేసేందుకు ఆర్‌సీబీ పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధంగా ఉంది. ఈనేపథ్యంలో జట్టు మళ్లీ గుజరాత్‌తోనే తలపడబోతోంది. తొలి క్వాలిఫయర్‌లో ఆర్‌సీబీ బౌలర్లు టైటాన్స్‌ బ్యాటర్లను ఆటాడుకున్నారు. 255 స్కోరు ఛేదనలో ఆ జట్టు 150 పరుగులు చేసేందుకే అష్టకష్టాలు పడింది. పేసర్లు భువనేశ్వర్‌, హాజెల్‌వుడ్‌, డఫీ, రసిఖ్‌లతో పాటు స్పిన్నర్‌ క్రునాల్‌ చక్కటి ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. బ్యాటింగ్‌లో ప్రతీ బ్యాటర్‌ ఎదురుదాడే లక్ష్యంగా క్రీజులోకి దిగుతున్నారు. విన్నింగ్‌ కాంబినేషన్‌ను మార్చకుండా ఓపెనర్‌గా వెంకటేశ్‌ అయ్యర్‌నే కొనసాగించవచ్చు. విరాట్‌ కోహ్లీ, దేవ్‌దత్‌, రజత్‌, క్రునాల్‌, డేవిడ్‌, జితేశ్‌లతో బ్యాటింగ్‌ విభాగం అత్యంత పటిష్ఠంగా కనిపిస్తోంది. కీలక పోరులో వీరిని టైటాన్స్‌ బౌలర్లు ఏమేరకు అడ్డుకుంటారో చూడాలి.

6.jpg


సొంత గడ్డపై మురిపించాలని..

బెంగళూరులో ఆడాల్సిన ఫైనల్‌ అహ్మదాబాద్‌కు తరలిరావడంతో, టైటిల్‌ఫైట్‌ చేరిన గుజరాత్‌కు అద్భుత అవకాశం లభించినట్టయ్యింది. తమకు అనుకూలంగా ఉండే సొంత వేదికపై రెండో టైటిల్‌ను ముద్దాడాలనే ఉత్సాహంతో టైటాన్స్‌ ఉంది. అయితే ముందు సరైన జట్టు కూర్పుతో బరిలోకి దిగాల్సి ఉంది. రాజస్థాన్‌పై స్పిన్నర్‌ సాయికిశోర్‌ను ఆడించినా ఒక్క ఓవర్‌ కూడా వేయించలేదు. గత సీజన్‌లో అతను 19 వికెట్లు తీసినా.. ఈసారి ఆడింది 3 మ్యాచ్‌లే.. వేసింది 4 ఓవర్లే. బౌలర్‌గా ఉపయోగించనప్పుడు అతడి స్థానంలో మరో బ్యాటర్‌ను తీసుకుంటే మేలు. కుమార్‌ కుషాగ్రను ఎంపిక చేస్తే ఫినిషర్‌గా ఉపయోగపడతాడు. ఇక మిగతా ఆటగాళ్లంతా జట్టులో కుదురుకున్నవారే. ఓపెనర్లు సాయి సుదర్శన్‌, గిల్‌ ఇప్పటికే చెరో 700+ రన్స్‌తో ఉండగా, బట్లర్‌ ఖాతాలోనూ 507 రన్స్‌ ఉన్నాయి. ఫైనల్లోనూ ఈ ముగ్గురు సత్తా అదరగొట్టాలి. పేసర్లు రబాడ, సిరాజ్‌ కొత్త బంతితో ఇబ్బందిపెడుతున్నారు. కానీ ఆర్‌సీబీ బ్యాటర్ల ఊచకోతను అడ్డుకోవాలంటే బౌలింగ్‌ విభాగం తగిన వ్యూహంతో బరిలోకి దిగాల్సిందే.

7.jpg

తుది జట్లు

బెంగళూరు: వెంకటేశ్‌ అయ్యర్‌, విరాట్‌, దేవ్‌దత్‌, రజత్‌ (కెప్టెన్‌), క్రునాల్‌, జితేశ్‌, డేవిడ్‌, భువనేశ్వర్‌, హజెల్‌వుడ్‌, డఫీ, రసిఖ్‌.

గుజరాత్‌: గిల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, బట్లర్‌, కుమార్‌ కుషాగ్ర, సుందర్‌, నిశాంత్‌, హోల్డర్‌, రషీద్‌, సిరాజ్‌, రబాడ, ప్రసిద్ధ్‌.

పిచ్‌

ఇక్కడి వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ఎర్రమట్టితో కూడిన పిచ్‌ కావడంతో బంతికి చక్కటి బౌన్స్‌ లభించి భారీస్కోరుకు చాన్సుంది. ఈ సీజన్‌లో ఇక్కడ సగటు స్కోరు 193. పేసర్లకు ఆరంభంలో సహకారం లభిస్తుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు విజయావకాశాలు 62శాతంగా ఉండడం విశేషం. మ్యాచ్‌కు వర్షంముప్పు లేదు.

ముఖాముఖి

  • ఆడిన మ్యాచ్‌లు 9

  • బెంగళూరు గెలుపు 5

  • గుజరాత్‌ గెలుపు 4

8.jpg

Updated Date - May 31 , 2026 | 04:35 AM