India Open Badmintor 2026: సొంతగడ్డపై సత్తా చాటాలని..
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:07 AM
భారత టాప్ షట్లర్ల సత్తాకు అసలైన పరీక్షగా నిలిచే ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వచ్చేసింది. సొంతగడ్డపై అభిమానులను అలరించే ఈ మెగా ఈవెంట్ మంగళవారం...
బరిలో సింధు, లక్ష్య, సాత్విక్ జోడీ
నేటినుంచే ఇండియా ఓపెన్
న్యూఢిల్లీ: భారత టాప్ షట్లర్ల సత్తాకు అసలైన పరీక్షగా నిలిచే ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వచ్చేసింది. సొంతగడ్డపై అభిమానులను అలరించే ఈ మెగా ఈవెంట్ మంగళవారం ఇక్కడ మొదలవనుంది. స్థానిక స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, సాత్విక్/చిరాగ్, పుల్లెల గాయత్రి/ట్రీసా జాలీతో పాటు అంతర్జాతీయ షట్లర్లు ఈ టోర్నీలో అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో మాజీ విజేత సింధు ఆరంభ రౌండ్లో గుయెన్ తుయ్ లిన్ (వియత్నాం)తో ఆడనుండగా.. పురుషుల సింగిల్స్‌లో 2022 చాంపియన్ లక్ష్య సేన్ భారత్‌కే చెందిన యువ సంచలనం ఆయుష్ శెట్టితో, తరుణ్‌తో 2015 విజేత శ్రీకాంత్, లీ చుక్ యి (హాంకాంగ్)తో వెటరన్ ప్రణయ్ తమ పోరు ప్రారంభించనున్నారు. కచ్చితంగా పతకం నెగ్గే అవకాశమున్న సాత్విక్/చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్‌లో ఆరంభ రౌండ్లో అమెరికా ద్వయం చెన్ జి యి/ప్రెస్లీ స్మిత్‌తో, మహిళల డబుల్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ఒమ్నిచా/సువచాయ్ ద్వయంతో గాయత్రి/ట్రీసా జంట అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇతర భారత షట్లర్లలో మాళవికా బన్సోడ్, తన్వీ శర్మ సింగిల్స్‌లో, ప్రియ/శ్రుతి, రుతుపర్ణా పాండ/శ్వేతాపర్ణా పాండ, కవిప్రియ/సిమ్రన్ డబుల్స్‌లో, ధ్రువ్ కపిల/తనీషా క్రాస్టో, రోహన్/రుత్విక, ధ్రువ్ రావత్/మనీషా, అశిత్ సూర్య/అమృత జోడీలు మిక్స్‌డ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కున్లావత్ వితిసార్న్, అన్ సే యంగ్‌లాంటి అంతర్జాతీయ స్టార్లతో కలిపి 20 దేశాల నుంచి ఓవరాల్‌గా 256 మంది షట్లర్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?
నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా