Share News

కొందరికి లాభం.. ఇంకొందరికి నష్టం

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:36 AM

బ్యాడ్మింటన్‌లో కొత్తగా ప్రవేశపెట్టనున్న స్కోరింగ్‌ విధానం.. కొందరు ఆటగాళ్లకు మేలు కలిగిస్తే, మరికొందరి కెరీర్‌ ముగిసిపోయే అవకాశముందని భారత కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు....

కొందరికి లాభం.. ఇంకొందరికి నష్టం

కొత్త స్కోరింగ్‌ విధానంపై కోచ్‌ గోపీచంద్‌

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో కొత్తగా ప్రవేశపెట్టనున్న స్కోరింగ్‌ విధానం.. కొందరు ఆటగాళ్లకు మేలు కలిగిస్తే, మరికొందరి కెరీర్‌ ముగిసిపోయే అవకాశముందని భారత కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు. ప్రస్తుతం అమల్లో ఉన్న బెస్టాఫ్‌ త్రీలోని 21 పాయింట్ల విధానం నుంచి 15 పాయింట్ల ఫార్మాట్‌కు గేమ్‌ మారనుంది. ఇది వచ్చే జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) చెబుతోంది. ‘2001లో నేను ఆల్‌ ఇంగ్లండ్‌ టైటిల్‌ నెగ్గిన తర్వాత సంప్రదాయ 15 పాయింట్ల నుంచి 7 పాయింట్ల విధానంతో ప్రయోగం చేశారు. కానీ, ఏడాది తర్వాత మళ్లీ పాత స్కోరింగ్‌ పద్ధతికి మార్చారు. అయితే, ఇలా మార్చడం వల్ల దానికి తగ్గట్టుగా ఆటతీరును మార్చుకోవడానికి నాకు ఏడాది పట్టింద’ని గోపీ చెప్పాడు. ఇక, ప్రస్తుత ఫార్మాట్‌ను మార్చడం అంటే అది కొందరి కెరీర్‌కు చావుదెబ్బ లాంటిదని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే, నెమ్మదిగా ఆడుతూ, సుదీర్ఘ ర్యాలీలకు గేమ్‌ను తీసుకెళ్లగలిగే షట్లర్లు కొత్తఫార్మాట్‌కు అలవాటు పడడం అంత సులువు కాదన్నాడు. ముఖ్యంగా డబుల్స్‌ ఆటగాళ్లపై ఇది ప్రభావం చూపే అవకాశముందన్నాడు. వేగవంతంగా, దూకుడైన ఆట తీరుతో చెలరేగే కిడాంబి శ్రీకాంత్‌, ప్రణయ్‌లాంటి షట్లర్లకు నూతన స్కోరింగ్‌ విధానం లాభదాయకమని చెప్పుకొచ్చాడు.

Also Read:

మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం: వెంకయ్య నాయుడు

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు

Updated Date - Aug 05 , 2026 | 05:36 AM