Share News

ఏదీ మెస్సీ మాయ?

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:07 AM

ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ అంచనాలకు భిన్నంగా సాగింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా, స్పెయిన్‌ జట్ల తుదిపోరు ప్రపంచ సాకర్‌ అభిమానులను ఉర్రూతలూగించ లేకపోయింది. ఈ మ్యాచ్‌లో...

ఏదీ  మెస్సీ మాయ?

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ అంచనాలకు భిన్నంగా సాగింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా, స్పెయిన్‌ జట్ల తుదిపోరు ప్రపంచ సాకర్‌ అభిమానులను ఉర్రూతలూగించ లేకపోయింది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌ విజేతగా నిలిచినా..చర్చంతా ఓ ఆటగాడిపైనే జరుగుతోంది. అది కూడా ఓడిన జట్టు ప్లేయర్‌పైనే. అతడు ఎవరోకాదు ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ లియోనెల్‌ మెస్సీ. స్పెయిన్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ చూశాక అర్జెంటీనా అభిమానులకే కాదు యావత్‌ సాకర్‌ ఫ్యాన్స్‌కు ఆడింది మెస్సీ జట్టేనా..అనిపించింది. అవును. క్వార్టర్‌ఫైనల్‌, సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రదర్శన చూశాక తుదిపోరులో ఆ జట్టు రాణించిన తీరు ఎవరికైనా ఆశ్చర్యమేస్తుంది. మ్యాచ్‌లో సింహభాగం బంతి స్పెయిన్‌ అధీనంలోనే ఉంది. కొద్ది సమయం మినహాయిస్తే ఆటంతా అర్జెంటీనా భాగంలోనే కొనసాగింది. ఇక కెప్టెన్‌ మెస్సీ మైదానంలో ఉన్నా..కనిపించింది కొంతసేపే. నిర్ణీత సమయంలో కాకపోయినా అదనపు సమయంలోనైనా మెస్సీ మాయ చేసి జట్టుకు మరోసారి వరల్డ్‌ కప్‌ అందిస్తాడని ఆశించిన ఫ్యాన్స్‌ ఉసూరుమన్నారు. 117 నిమిషాల వరకు గోల్‌కోసం మెస్సీ కొట్టిన షాట్‌ ఒక్కటంటే ఒక్కటుంటే ఒట్టు! 120 నిమిషాలు మైదానంలో ఉన్న అతడు బంతిని టచ్‌ చేసింది 54 సార్లే. తాను గోల్స్‌ చేయకపోయినా సహచరులు గోల్స్‌ చేసే అవకాశాలు సృష్టించడంలో మెస్సీ ఎంత మొనగాడో తెలిసిందే కదా. కానీ ఈ మ్యాచ్‌లో గోల్‌ కోసం సింగిల్‌ చాన్స్‌ను కూడా లియోనెల్‌ సృష్టించలేక పోయాడు. మరోవైపు స్పెయిన్‌ దాడుల పర్వంతో అర్జెంటీనా ఆత్మరక్షణలో పడిపోయిందనేది వాస్తవం. ఏమైనా వరుసగా రెండోసారి ప్రపంచ కప్‌ అందించడం ద్వారా తమ దిగ్గజ ఆటగాడు మెస్సీకి ఘనమైన వీడ్కోలు (వరల్డ్‌ కప్‌) ఇవ్వాలన్న అర్జెంటీనా ఆశ నెరవేరలేదు. దానికి కారణం ఆ జట్టు ఆటతీరే అనేది నిర్వివాదాంశం. అర్జెంటీనా మ్యాచ్‌ అయిపోయిన ప్రతిసారీ మెస్సీ కన్నీళ్లు పెట్టుకోవడం ఇటీవలి కాలంలో పరిపాటి అయ్యింది. అయితే స్పెయిన్‌తో తుదిపోరు తర్వాత ఆ సన్నివేశం కాస్త భిన్నంగా అనిపించింది. ఓటమికి పశ్చాత్తాపంతో ఆ కన్నీళ్లని కొందరంటే కాదు..కాదు..వరల్డ్‌ కప్‌కు వీడ్కోలు కన్నీళ్లని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఏమైనా ప్రపంచ కప్‌ అరంగేట్రం చేసిన రెండు దశాబ్దాల తర్వాత..పీలె, మారడోనాల కంటే గొప్ప ఆటగాడిగా మన్ననలు అందుకొన్న 39 ఏళ్ల మెస్సీ తన జట్టును వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలపడంలో మాత్రం విఫలమయ్యాడు.

ఇవి కూడా చదవండి:

యమాల్ విజయం వెనుక నానమ్మ త్యాగం.. కష్టాల నుంచి ప్రపంచ స్టార్‌గా..!

రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ సూచన

Updated Date - Jul 21 , 2026 | 05:07 AM