కోల్‘కథ’ ఇంకా ఉంది!
ABN , Publish Date - May 17 , 2026 | 04:50 AM
లీగ్ చివరిదశకు చేరుతున్న తరుణంలో ఆట రసవత్తరంగా మారుతోంది. మరో గెలుపుతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలనుకున్న గుజరాత్ టైటాన్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్రేక్ వేసింది.
గుజరాత్‌పై విజయం
ప్లేఆఫ్స్ రేసులోనే నైట్‌రైడర్స్
చెలరేగిన ఆలెన్, రఘువంశీ
కోల్‌కతా: లీగ్ చివరిదశకు చేరుతున్న తరుణంలో ఆట రసవత్తరంగా మారుతోంది. మరో గెలుపుతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలనుకున్న గుజరాత్ టైటాన్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్రేక్ వేసింది. దీంతో నైట్‌రైడర్స్ తమ ఆశలను సజీవంగా ఉంచుకొంది. ఫిన్ ఆలెన్ (35 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 93) విజృంభించడంతో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌పై 29 పరుగులతో కేకేఆర్ గెలిచింది. వరుసగా ఐదు విజయాల తర్వాత గుజరాత్‌కిది తొలి ఓటమి. ప్రస్తుతం 11 పాయింట్లతో ఉన్న రహానె సేన మరో 2 మ్యాచ్‌ల్లో గెలిస్తే 15 పాయింట్లకు చేరుతుంది. అలాగే పంజాబ్, చెన్నై, రాజస్థాన్ తమ మిగిలిన మ్యాచ్‌లను ఓడితే కోల్‌కతా ముందుకెళుతుంది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగుల భారీస్కోరు చేసింది. ఆలెన్‌కు తోడు అంక్రిష్ రఘువంశీ (44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 నాటౌట్) చెలరేగారు. ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 218/4 స్కోరుకే పరిమితమైంది. గిల్ (49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 85), సాయి సుదర్శన్ (28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 నాటౌట్), బట్లర్ (35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57) అర్ధ సెంచరీలు వృథా అయ్యాయి. నరైన్‌కు 2 వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నరైన్ నిలిచాడు.
టైటాన్స్ తడబాటు: గుజరాత్ భారీ ఛేదన ఆశించిన రీతిలో సాగలేదు. కావాల్సినన్ని వికెట్లు చేతిలో ఉన్నా వేగం చూపలేకపోయింది. ఓపెనర్ గిల్ అర్ధసెంచరీతో పోరాడాడు. ఆరంభంలో ఓపెనర్ సాయి సుదర్శన్ చకచకా పరుగులు సాధించినా మోచేతి గాయంతో రిటైర్ట్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. తిరిగి 17వ ఓవర్‌లో అతను క్రీజులోకి వచ్చినా అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ 22కి పెరిగింది. దీంతో గెలుపు గుజరాత్‌కు కష్టమైంది. మూడో ఓవర్‌లో సాయి 4,6,4తో 15 రన్స్ రాబట్టినా గాయంతో వెనుదిరిగాడు. ఆ వెంటనే నిశాంత్ (1)ను నరైన్ అవుట్ చేశాడు. ఈ స్థితిలో గిల్‌కు బట్లర్ అండగా నిలిచాడు. పవర్‌ప్లేలో జట్టు 56/1 స్కోరు చేయగలిగింది. నరైన్ ఓవర్‌లో గిల్ 2 సిక్సర్లు, అనుకుల్ ఓవర్‌లో 6,6,4తో జట్టు 10 ఓవర్లలో సెంచరీకి చేరింది. 14వ ఓవర్‌లోనూ గిల్ చెలరేగి 4,6,4తో 22 రన్స్ రాబట్టాడు. బట్లర్ అడపాదడపా బౌండరీలు బాదినా రన్‌రేట్ అదుపులోకి రాలేదు. దీనికి తోడు గిల్ 17వ ఓవర్‌లో వెనుదిరగడంతో రెండో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం సాయి సుదర్శన్ బరిలోకి దిగి 18వ ఓవర్‌లో 6,4,4తో ఆకట్టుకున్నా బట్లర్‌ను సౌరభ్ దూబే అవుట్ చేశాడు. చివరి ఓవర్‌లో 40 రన్స్ కావాల్సిన వేళ గుజరాత్ 10 పరుగులే చేయగలిగింది.
టాపార్డర్ బాదుడు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రహానె (14) మినహా మిగిలిన టాపార్డర్ బ్యాటర్లంతా కదం తొక్కారు. ఆలెన్, రఘువంశీ, గ్రీన్‌ల ధాటికి తమ ఇన్నింగ్స్‌లో ఏకంగా 22 సిక్సర్లు నమోదయ్యాయి. ఇక, ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేయడం కేకేఆర్‌కు మరింత లాభించింది. రహానెను ఐదో ఓవర్‌లో సిరాజ్ బౌల్డ్ చేయగా.. పవర్‌ప్లేలో జట్టు 56/1 స్కోరుతో ఓ మాదిరిగానే ఆడింది. ఆ తర్వాతే ఆలెన్ బ్యాట్ ఝుళిపించడంతో రన్స్ వేగంగా వచ్చాయి. ఆలెన్ 33 పరుగుల వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్‌ను సిరాజ్ వదిలేశాడు. ఆ వెంటనే రషీద్ ఓవర్‌లో అతను 6,6,4తో 21 బంతుల్లోనే ఫిఫ్టీ అందుకున్నాడు. హోల్డర్ ఓవర్‌లో రెండు సిక్సర్లతో ఆకట్టుకున్న ఆలెన్.. అర్షద్ ఖాన్ ఓవర్‌లో 6,6,6,4తో 22 రన్స్ రాబట్టి సెంచరీకి చేరువలో నిలిచాడు. కానీ 12వ ఓవర్‌లో స్పిన్నర్ సాయి కిశోర్ అవుట్ చేయడంతో ఆలెన్ సునామీ ఇన్నింగ్స్‌కు తెర పడింది. అప్పటికే రెండో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం జత చేరింది. అనంతరం రఘువంశీ-గ్రీన్ జోడీ టైటాన్స్ బౌలర్లకు చుక్కలు చూపించింది. రషీద్ ఓవర్‌లో రఘువంశీ 4,6.. కిశోర్ ఓవర్‌లో గ్రీన్ 6,4,6తో చెలరేగారు. గ్రీన్ ఆ తర్వాతా బౌండరీలు బాదడంతో జట్టు స్కోరు 17 ఓవర్లలోనే 200కి చేరింది. అటు రఘువంశీ 33 బంతుల్లో ఈ సీజన్‌లో ఐదో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక సిరాజ్ వేసిన 19వ ఓవర్‌లో రఘువంశీ 6,6,6,4తో 25 రన్స్‌సతో అదుర్స్ అనిపించాడు. చివరి ఓవర్‌లో గ్రీన్ ఫోర్‌తో 26 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేయగా, జట్టు స్కోరు 240 దాటింది. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 108 పరుగులు జత చేయడం విశేషం.