12 రోజులు.. 27 క్రీడాంశాలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:59 AM
సుమారు ఆరు వేల మంది క్రీడాకారులతో 27 క్రీడాంశాల్లో వచ్చే నెల 11వ తేదీ నుంచి తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను నిర్వహిస్తున్నట్టు...
తెలంగాణలో 6 వేల మందితో ఖేలో ఇండియా యూత్ గేమ్స్
కేంద్ర క్రీడామంత్రి మాండవీయ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సుమారు ఆరు వేల మంది క్రీడాకారులతో 27 క్రీడాంశాల్లో వచ్చే నెల 11వ తేదీ నుంచి తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను నిర్వహిస్తున్నట్టు కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది యూత్ గేమ్స్ షెడ్యూల్‌ను సోమవారం మాండవీయ విడుదల చేశారు. డిసెంబరు 11 నుంచి 22వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి క్రీడా సముదాయం, సరూర్‌నగర్, యూసు్‌ఫగూడ, సైక్లింగ్ వెలోడ్రోమ్‌లో 22 క్రీడా పోటీలను, ఖమ్మంలో ఆర్చరీ, హనుమకొండలో అథ్లెటిక్స్, కరీంనగర్‌లో జూడో, నిజామాబాద్‌లో టేబుల్ టెన్నిస్, మహబూబ్‌నగర్‌లో కబడ్డీ పోటీలను నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో భారత్ ప్రాతినిథ్యం పెంచేందుకు క్రీడారంగ అభివృద్ధిని దేశం నలుమూలలకు విస్తరించాలనేది ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని, ఆ దిశగానే ప్రతి ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కొండలు, సముద్రాలు సహజ వనరులతో ముడిపడి ఉన్న క్రీడలను ప్రోత్సహించాలనేది మోదీ ఆకాంక్షని, అందులో భాగంగానే సెయిలింగ్‌ను ఈసారి డెమో క్రీడగా ఖేలో ఇండియాలో చేర్చామని తెలిపారు. యూత్ గేమ్స్‌లో తొలిసారిగా సాఫ్ట్‌బాల్‌కు అవకాశం కల్పించారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, గట్కా, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, కలరిపయట్టు, ఖో-ఖో, మల్లఖంబ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, సాఫ్ట్‌బాల్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, థాంగ్ టా, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగాసనలో మొత్తం 27 క్రీడాంశాల్లో దాదాపు ఆరు వేల మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఈ పోటీల కోసం క్రీడాకారులతో పాటు 1800 మంది సహాయ సిబ్బంది రాష్ట్రానికి రానున్నారు. ఇక, గత ఏడాది బిహార్‌లో నిర్వహించిన యూత్ గేమ్స్‌లో మహారాష్ట్ర 58 స్వర్ణాలతో అగ్రస్థానం దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి:
దక్షిణాఫ్రికా పర్యటన.. భారత మహిళా జట్ల ప్రకటన
ఎంఐతో ట్రేడ్ డీల్.. పంజాబ్‌కు చిక్కులు తప్పవు: భారత మాజీ క్రికెటర్