Share News

మనమ్మాయిల ఆట అంతంతే..

ABN , Publish Date - Aug 11 , 2026 | 02:19 AM

మరో మూడు రోజుల్లో మహిళల హాకీ ప్రపంచ కప్‌నకు తెరలేవనుంది. బెల్జియం, ఆమ్‌స్టెల్‌వీన్‌ వేదికలుగా పురుషులు, మహిళల మెగా టోర్నమెంట్‌ జరగనుంది. ఈనేపథ్యంలో...

మనమ్మాయిల ఆట అంతంతే..

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

మరో మూడు రోజుల్లో మహిళల హాకీ ప్రపంచ కప్‌నకు తెరలేవనుంది. బెల్జియం, ఆమ్‌స్టెల్‌వీన్‌ వేదికలుగా పురుషులు, మహిళల మెగా టోర్నమెంట్‌ జరగనుంది. ఈనేపథ్యంలో ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ కప్‌లో భారత మహిళల ప్రస్థానాన్ని గమనిస్తే..మన ప్రదర్శన అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. 1974 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ప్రపంచ కప్‌ జరిగితే భారత మహిళలు ఎనిమిదిసార్లే టోర్నమెంట్‌కు అర్హత సాధించారు. 1974 తొలి వరల్డ్‌ కప్‌లో నాలుగో స్థానమే మెగా టోర్నీలో ఇప్పటిదాకా మన అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.

1974, ఫ్రాన్స్‌

అజిందర్‌ కౌర్‌ కెప్టెన్సీలో తలపడిన భారత మహిళలు తొలి వరల్డ్‌ కప్‌ను చిరస్మరణీయం చేసుకున్నారు. ఆ ఏడాది చాంపియన్‌ నెదర్లాండ్స్‌ను గ్రూప్‌ దశలో ఓడించి సంచలనం సృష్టించారు. మెక్సికో, స్పెయిన్‌పై గెలిచి గ్రూప్‌ టాపర్‌గా నిలిచారు. సెమీఫైనల్లో 0-1తో అర్జెంటీనా చేతిలో ఓడిన మనోళ్లు..కాంస్య పతక పోరులో జర్మనీపై 0-2తో పరాజయం చవిచూశారు.

మహిళల హాకీ ప్రపంచ కప్‌ 3 రోజుల్లో

1976, బెర్లిన్‌: మహిళల హాకీ సంఘం వద్ద నిధుల కొరత, స్పాన్సర్‌షిప్‌ కూడా లేకపోవడంతో జట్టు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనలేకపోయింది.

1978, మాడ్రిడ్‌: రూపా సైనీ సారథ్యంలో బరిలో దిగిన భారత జట్టు 10 జట్లలో ఏడో స్థానంతో టోర్నమెంట్‌ను ముగించింది.

1981, బ్యూన్‌సఎయిర్స్‌: 1980 మాస్కో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంతో భళా అనిపించినా..అర్జెంటీనా ఆతిథ్యమిచ్చిన ఈ వరల్డ్‌ కప్‌నకు భారత్‌ అర్హత సాధించలేకపోయింది.

1983, కౌలాలంపూర్‌: 1982 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన ఆత్మవిశ్వాసంతో భారత మహిళలు ఈ ప్రపంచ కప్‌లో అడుగుపెట్టారు. సల్మా డిసిల్వా నాయకత్వంలో తలపడిన జట్టు 12 జట్ల టోర్నీలో 11వ స్థానంతో తీవ్రంగా నిరాశపరిచింది.

1986 (ఆమెస్టెల్‌వీన్‌), 1990 (సిడ్నీ),

1994 (డబ్లిన్‌): వరుసగా మూడు ప్రపంచ కప్‌లకు అర్హత సాధించలేదు.

1998, ఉట్రెచ్‌: ప్రీతమ్‌ రాణి కెప్టెన్సీలో జట్టు ఈ మెగా టోర్నీలో పునరాగమనం చేసినా.. 12వ, ఆఖరి స్థానంతో వెనుదిరిగింది.

2002, పెర్త్‌: క్వాలిఫై కాలేదు.

2006, మాడ్రిడ్‌: పోటీపడ్డ మొత్తం 12 జట్లలో 11వ స్థానంతో ముగింపు.

2010, రొసారియో: తొమ్మిది స్థానం దక్కించుకుంది. యువప్లేయర్‌ రాణీ రాంపాల్‌ ఏడు గోల్స్‌ చేసి తన అంతర్జాతీయ ఆగమనాన్ని ఘనంగా చాటింది.

2014, హేగ్‌: టోర్నీకి అర్హత సాధించలేదు.

2018, లండన్‌: రాణీ రాంపాల్‌ సారథ్యంలో భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌ చేరింది. అయితే క్వార్టర్స్‌లో పెనాల్టీ షూటౌట్‌లో ఐర్లాండ్‌ చేతిలో పరాజయం పాలైంది.

2022, ఆమ్‌స్టెల్‌వీన్‌: తొమ్మిదో స్థానం.

ఇవి కూడా చదవండి:

ఫిట్‌నెస్‌ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌ ఈసారైనా నిరూపించుకుంటాడా?

2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్

Updated Date - Aug 11 , 2026 | 02:20 AM