Share News

భారత్‌ పాక్‌ పోరు నేడు

ABN , Publish Date - Aug 19 , 2026 | 05:42 AM

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై దశాబ్ద కాలంగా కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి.. హాకీ వరల్డ్‌కప్‌ తర్వాతి రౌండ్‌ బెర్త్‌ను సొంతం చేసుకోవాలి. భారత పురుషుల జట్టు ముందున్న లక్ష్యం ఇదే...

భారత్‌ పాక్‌ పోరు నేడు

సా. 6.30 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో..

హాకీ ప్రపంచకప్‌లో హైవోల్టేజ్‌

ఆమ్‌స్టెల్‌వీన్‌ (నెదర్లాండ్స్‌): చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై దశాబ్ద కాలంగా కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి.. హాకీ వరల్డ్‌కప్‌ తర్వాతి రౌండ్‌ బెర్త్‌ను సొంతం చేసుకోవాలి. భారత పురుషుల జట్టు ముందున్న లక్ష్యం ఇదే. ఇంగ్లండ్‌ చేతిలో ఓటమితో టోర్నీలో హర్మన్‌ప్రీత్‌ సేన ప్రయాణం ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-డిలో బుధవారం జరిగే సూపర్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ పోరు కీలకంగా మారింది. 2010 తర్వాత తొలిసారి మెగా ఈవెంట్‌లో ఇరుజట్లూ పోటీపడుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి కూడా పెరిగింది. వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఇంగ్లండ్‌ రెండో రౌండ్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. గ్రూప్‌లో రెండో స్థానం కోసం పోటీ నెలకొంది. ప్రస్తుతం ఒక గెలుపు సాధించి 3 పాయింట్లతో ఉన్న భారత్‌.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముందంజ వేస్తుంది. లేదంటే కనీసం డ్రా చేసుకొన్నా చాలు..! అయితే, పాక్‌ చేతిలో ఓడితే మాత్రం భారత జట్టు కథ ముగుస్తుంది. మరోవైపు ఇంగ్లండ్‌ చేతిలో ఓడి.. వేల్స్‌తో డ్రా చేసుకొన్న పాక్‌ ఒక పాయింట్‌ సాధించింది. తర్వాతి రౌండ్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌ పాక్‌కు చావోరేవోగా మారింది. ఇటీవలి కాలంలో పాక్‌తో పోల్చితే భారత్‌ మెరుగైన ఆటను ప్రదర్శిస్తోంది. అయితే, ఇంగ్లండ్‌తో పోరులో డిఫెన్స్‌ లోపాలు, పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడంలో విఫలమైన హర్మన్‌ సేన.. కీలక మ్యాచ్‌లో వాటిని అధిగమించాల్సి అవసరం ఎంతో ఉంది. కాగా, పాక్‌ కూడా నిలకడలేమితో తం టాలు పడుతోంది. వేల్స్‌ లాంటి జట్టుపై కూడా డ్రాతో గట్టెక్కిందంటే వారి ఆట ఎలా ఉందో అర్థమవుతోంది. అయితే, గతాన్ని మరచి మైదానంలో తమ సత్తా చూపుతామని పాక్‌ కెప్టెన్‌ మహమూద్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. నాలుగుసార్లు చాంపియన్‌ పాక్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.

హౌస్‌ ఫుల్‌

ఇండో-పాక్‌ మ్యాచ్‌కు టిక్కెట్లన్నీ హాట్‌ కేసుల్లా అమ్ముడైనట్టు నిర్వాహకులు తెలిపారు. దీంతో 10 వేల మంది కెపాసిటీ కలిగిన స్టేడియం పూర్తిగా నిండనుందన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

Updated Date - Aug 19 , 2026 | 05:42 AM