Share News

విరిసిన భారతీయం

ABN , Publish Date - Aug 04 , 2026 | 04:55 AM

పదకొండు రోజులపాటు క్రీడాభిమానులను అలరించిన గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌ అట్టహాసంగా ముగిశాయి. ఆదివారం అర్ధరాత్రి ఓవో హైడ్రో స్టేడియంలో ది వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ (వసుధైక కుటుంబం) పేరిట వైభవంగా...

విరిసిన భారతీయం

  • ఆకట్టుకున్న చారిత్రక, సాంస్కృతిక ప్రదర్శనలు

  • గ్లాస్గో కామన్వెల్త్‌ ముగింపు వేడుకలు

  • ‘2030’ బ్యాటన్‌ అందుకున్న నీరజ్‌, ఉష

గ్లాస్గో: పదకొండు రోజులపాటు క్రీడాభిమానులను అలరించిన గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌ అట్టహాసంగా ముగిశాయి. ఆదివారం అర్ధరాత్రి ఓవో హైడ్రో స్టేడియంలో ది వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ (వసుధైక కుటుంబం) పేరిట వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో భారతీయ సాంస్కృతిక నృత్య రూపకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా 2030 కామన్వెల్త్‌ శతాబ్ది ఉత్సవాలకు ఆతిఽథ్యమివ్వనున్న భారత్‌కు లాంఛనంగా గేమ్స్‌ పతాకాన్ని అందించారు. కింగ్‌ చార్లెస్‌ 3 తరపున హాజరైన ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఈ క్రీడలు ముగిసినట్టు ప్రకటించి, నాలుగేళ్ల తర్వాత అథ్లెట్లను అహ్మదాబాద్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అంతకుముందు సంగీతం, నృత్యం, పురాతన కథలు, సంప్రదాయాలతో భారత దేశ ఉజ్వల సంస్కృతిని చాటేలా ప్రదర్శనలు జరిగాయి. అలాగే ఇండో-స్కాటి్‌ష కు చెందిన సంగీతకారులు, నృత్యకారులు కలిసి చేసిన జుగల్‌బందీ ఆకర్షణగా నిలిచింది.

పాటల జోరు.. నృత్యాల హోరు: ముగింపు వేడుకల్లో మొదట స్కాట్లాండ్‌, ఆస్ర్టేలియాకు చెందిన ప్రఖ్యాత గాయకులు క్యామీ బార్నెస్‌, డెల్టా గుడ్రెమ్‌ తమ పాటలతో హుషారెత్తించారు. అనంతరం ఆయా దేశాల నుంచి ఫ్లాగ్‌ బేరర్స్‌ తమ జాతీయ పతాకాలతో స్టేడియంలోకి వచ్చారు. భారత్‌ తరఫున బాక్సర్‌ జాస్మిన్‌ లంబోరియా త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించింది. ఆఖర్లో 2030 ఆతిథ్య అహ్మదాబాద్‌ పేరును చూపారు. ఈ సమయంలో కామన్వెల్త్‌ గేమ్స్‌ పతాకాన్ని కిందికి దించి అధికారికంగా భారత్‌కు అందించారు. అనంతరం భారత క్లాసికల్‌, జానపద సంప్రదాయాల సమ్మేళనంగా సాగిన నృత్య ప్రదర్శనకు మాజీ మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌ నాయకత్వం వహించింది. గాయకుడు శంకర్‌ మహదేవన్‌ ఆలపించిన వందేమాతర గీతం హృదయాలను తాకింది. అలాగే భారత దేశ పరిణామక్రమాన్ని చాటేలా తయారుచేసిన వీడియో ఆసక్తిని రేకెత్తించింది. చారిత్రక కట్టడాలు, సంస్కృతీ సంప్రదాయాలు, గుజరాత్‌ వారసత్వం నుంచి ఆధునిక క్రీడా విజయాల వరకు ఇందులో చూపారు. సింగర్‌ మహదేవన్‌ తన కుమారుడు, సోదరుడితో కలిసి భాగ్‌ మిల్కా భాగ్‌ గీతాన్ని ఆలపించి ప్రేక్షకుల హుషారును పెంచాడు. ఆ తర్వాత సింగర్‌ భూమి త్రివేది కూడా తనతో చేరి లెహ్రా దో, సబ్‌సే ఆగే హోంగే హిందుస్తానీ లాంటి గీతాలతో ఉర్రూతలూగించారు. ఇక ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ముగింపు ప్రసంగంలో తమ విజయాలతో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చినందుకు అథ్లెట్లకు కృతజ్ఞతలు తెలిపి గేమ్స్‌ ముగిసినట్టుగా ప్రకటించారు.


అహ్మదాబాద్‌ క్రీడల కౌంట్‌డౌన్‌ మొదలు

ముగింపు వేడుకల సందర్భంగా తదుపరి క్రీడల కోసం కామన్వెల్త్‌ గేమ్స్‌ బ్యాటన్‌ను భారత్‌కు అప్పగించారు. ఈ అధికారిక బదిలీలో భాగంగా మార్చ్‌పాస్ట్‌ ద్వారా తీసుకువచ్చిన గేమ్స్‌ పతాకాన్ని కామన్వెల్త్‌ స్పోర్ట్స్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ డొనాల్డ్‌ రుకారె.. మొదట జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు అందించాడు. ఆ తర్వాత చోప్రా భారత ఒలింపిక్‌ సంఘం చీఫ్‌ పీటీ ఉషకు అందజేశాడు. ఆమె గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి హర్ష్‌ సంఘవికి పతాకాన్ని అందించడంతో.. 2030లో అహ్మదాబాద్‌ వేదికగా జరిగే గేమ్స్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది.

ఇవి కూడా చదవండి:

నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్

టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ

Updated Date - Aug 04 , 2026 | 04:55 AM