Share News

ప్రతిభకు ఏదీ గుర్తింపు?

ABN , Publish Date - Feb 03 , 2026 | 06:05 AM

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో అత్యంత క్లిష్టమైన ఈవెంట్‌ మహిళల హెప్టాథ్లాన్‌. ఏడు అంశాల సమాహారమైన ఈ ఈవెంట్‌లో తలపడే అథ్లెట్లు.. అటు వేగంగా పరిగెత్తడంతోపాటు త్రో చేయడంలోనూ సిద్ధహస్తులై ఉండాలి...

ప్రతిభకు  ఏదీ గుర్తింపు?

  • ఇల్లుగడవక పనులకు వెళ్లాల్సిన దుస్థితి

  • ఆసియా క్రీడల పతక విజేత అగచాట్లు

  • అగసర నందినికి అందని సాయం

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో అత్యంత క్లిష్టమైన ఈవెంట్‌ మహిళల హెప్టాథ్లాన్‌. ఏడు అంశాల సమాహారమైన ఈ ఈవెంట్‌లో తలపడే అథ్లెట్లు.. అటు వేగంగా పరిగెత్తడంతోపాటు త్రో చేయడంలోనూ సిద్ధహస్తులై ఉండాలి. దిగ్గజ అథ్లెట్లు జేజే శోభ, స్వప్నా బర్మన్‌ తర్వాత ఈ ఈవెంట్‌లో వినిపిస్తున్న పేరు అగసర నందిని. అంతేకాదు.. ఈ ఈవెంట్‌లో ఇండియా నెంబర్‌ వన్‌ నందినియే. ఆమె ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షి్‌ప రెండింట్లోనూ పతకాలు గెలిచిన మూడో భారతీయ అథ్లెట్‌ నందిని. ఒలింపిక్స్‌లో పతకం సాధించే సత్తా ఉన్నా ప్రోత్సహించే వారు కరవై రోజు గడవడానికి బర్త్‌డే ఫంక్షన్ల స్టేజీ డెకరేషన్‌.. ఇతరత్రా అలంకరణ పనులకు వెళ్తున్న దయనీయ స్థితి ఆమెది. తండ్రి టీ అమ్ముతూ, తల్లి నాలుగిళ్లలో పని చేస్తే కానీ గడవని పరిస్థితి ఆ కుటుంబానిది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 30కి పైగా పతకాలు కొల్లగొట్టినా గుర్తింపు, ప్రోత్సాహానికి నోచుకోని హైదరాబాద్‌ అమ్మాయి నందిని ఆవేదనను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

ఊహ తెలిసినప్పటి నుంచి అథ్లెటిక్స్‌నే ప్రాణంగా భావించా. పదేళ్ల అకుంఠిత దీక్షతో హాంగ్జౌ ఆసియా క్రీడల్లో (2023) కాంస్యం, గుమి ఆసియా చాంపియన్‌షి్‌ప (2025)లో స్వర్ణం సాధించిన తర్వాత కూడా నాకు లభించాల్సిన గౌరవం, గుర్తింపు, ప్రోత్సాహకం దక్కకపోవడం తీవ్రంగా బాధిస్తోంది. ఆసియా క్రీడల్లో పతకం సాధించాక నా కష్టాలన్నీ తీరతాయని భావిస్తే నిరాశే ఎదురైంది. నాతో పాటు ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన పారుల్‌ చౌధురి (ఉత్తరప్రదేశ్‌), తజిందర్‌పాల్‌ సింగ్‌ (పంజాబ్‌)కు గ్రూప్‌-1 ఉద్యోగాలు, భారీ నగదు పురస్కారాలు ఇచ్చి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ యర్రాజి జ్యోతికి కూడా వచ్చే కామన్వెల్త్‌ క్రీడలు, ఒలింపిక్స్‌ సన్నద్ధత కోసం ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షల నగదు ప్రోత్సాహకం, ఇంటి స్థలం, ఉద్యోగం ప్రకటించింది. తెలంగాణలో కూడా గతంలో కొందరు క్రీడాకారులకు ఇంటి స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, నజరానాలు, ఒలింపిక్స్‌ సన్నద్ధత కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు లభించాయి. నాపైన మాత్రం ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో అర్థం కావడం లేదు.


000-Sports.jpg

హెప్టాథ్లాన్‌లో నెంబర్‌ వన్‌..

హెప్టాథ్లాన్‌లో గత రెండేళ్లుగా జాతీయ స్థాయిలో నేనే నెంబర్‌ వన్‌. గత మేలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో అయిన గాయానికి చికిత్స కూడా తీసుకోలేకపోయా. గాయం కారణంగా నేను గత ఆరు నెలలుగా ఎలాంటి పోటీల్లోనూ పాల్గొనడం లేదు. అయినా ప్రస్తుతం 27వ ర్యాంక్‌లో ఉండడంతో ఇప్పటినుంచి మళ్లీ పోటీల్లో పాల్గొంటే ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే, కనీస గుర్తింపు, గౌరవం లభించకపోయేసరికి ఇన్ని కష్టాలు, బాధలు పడేకంటే పరుగు ఆపివేస్తేనే మంచిదన్న బాధ కలుగుతోంది. స్వతహాగా క్రీడాకారుడైన సీఎం రేవంత్‌ రెడ్డి గారు నా సమస్యల్ని తెలుసుకొని సాయం అందిస్తే జపాన్‌ వేదికగా ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఆసియా క్రీడల్లో తిరిగి దేశానికి పతకం అందించగల సత్తా నాలో ఉంది.

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)

గాయంతోనే

బరిలోకి దిగా..

ఆసియా చాంపియన్‌షిప్‌లో షాట్‌పుట్‌ విసిరాక మోచేతి కండరాలకు గాయమైంది. ఎలాగైనా పతకం అందించాలన్న పట్టుదలతో నొప్పిని భరిస్తూనే జావెలిన్‌ కూడా విసిరి.. స్వర్ణపతకం నెగ్గా. స్వప్నా బర్మన్‌ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక భారత అథ్లెట్‌ను నేనే. ఈ ప్రదర్శనతో వరల్డ్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షి్‌పకు అర్హత పొందిన తొలి తెలుగమ్మాయిని కూడా నేనే. ఆసియా చాంపియన్‌షి్‌ప పతకానికి ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఇప్పటికీ అందలేదు. నా భవిష్యత్‌కు, నాపై ఆధారపడిన నా కుటుంబ సభ్యులకు ఎలాంటి భరోసా, ఆసరా లేకపోవడం నన్ను మానసిక వేదనకు గురి చేస్తోంది.

2025 ఆసియా చాంపియన్‌షి్‌ప్స స్వర్ణం

2023 ఆసియా క్రీడలు కాంస్యం

2025 జాతీయ చాంపియన్‌షి్‌ప స్వర్ణం

2025 జాతీయ క్రీడలు స్వర్ణం

ఇవీ చదవండి:

ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్

చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం

Updated Date - Feb 03 , 2026 | 06:05 AM